ఆసుపత్రిలో దారుణం.. అనస్తీషియా అధిక డోస్‌ ఇవ్వడంతో..

29 Jul, 2022 17:41 IST|Sakshi
మణిచంద్ర (ఫైల్‌)    

లింగోజిగూడ(హైదరాబాద్‌): భుజం నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు మృతి చెందిన ఘటన ఎల్‌బీనగర్‌లో గురువారం జరిగింది. వైద్యులు అనస్తీషియా అధిక డోస్‌ ఇవ్వడం వల్లే అతను చనిపోయాడని ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అమలాపురానికి చెందిన  శ్రీపియల్‌ వెంకటేశ్వరరావు కుటుంబంతో సహా హయత్‌నగర్‌ సుబ్రహ్మణ్యనగర్‌లో నివాసం ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు.
చదవండి: మహిళతో ఒ‍ప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా

ఇతని కుమారుడు మణిచంద్ర (28) కూడా తండ్రితో పాటు కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం క్రికెట్‌ ఆడుతుండగా కుడి చెయ్యి నొప్పి వచ్చింది. పలు ఆసుపత్రుల్లో చూపించినా నొప్పి తక్కువగా కాలేదు. పలువురి సూచన మేరకు ఎల్‌బీనగర్‌లోని శ్రీకార ఆసుపత్రిలో చూపించారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో గురువారం శస్త్ర చికిత్స చేయడానికి మణిచంద్రను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లిన వైద్యులు కొద్ది సేపటి తర్వాత అతను మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు.

అనస్తీషియా (మత్తుమందు) అధిక మోతాదులో ఇవ్వడం వల్లే మణిచంద్ర చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను శాంతిపజేశారు. మృతి చెందిన మణిచంద్ర కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఆసుపత్రి యజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు