జీవితంలో ఒకటికాలేక.. మరణంతో ఒక్కటయ్యారు!

12 Aug, 2022 07:33 IST|Sakshi
సుబయ్య, సుధా (ఫైల్‌)  

సాక్షి, చెన్నై: మేనమామ ఇంటికి కోడలిగా వెళ్లాలన్న  ఓ యువతి ఆశలు అడియాశలయ్యాయి. తాను ఎంతగానో ప్రేమించిన మేనమామ కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించక పోవడంతో ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వివరాలు.. తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన ఆర్ముగం , సరస్వతి దంపతులకు సుధా(22), ఉదయ శంకర్‌(20) అనే పిల్లలు ఉన్నారు.

సుధా ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తన మేనమామ పెరియస్వామి కుమారుడు సుబయ్య(24)ను ప్రేమించింది. సుబయ్య కూడా సుధను ఇష్టపడ్డాడు. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. అయితే వీరి ప్రేమకు కుటుంబ సభ్యులే అడ్డంకిగా మారారు. చదువుకునే వయస్సులో ప్రేమ వద్దంటూ వారించారు. దీంతో మనస్థాపం చెందిన సుబ్బయ్య బుధవారం రాత్రి పురుగుల మందు తాగేశాడు. ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి సమయంలో మరణించాడు.

ఈ సమాచారంతో సుధా తల్లడిల్లి పోయింది. జీవితంలో ఒకటి కాకున్నా, మరణంలోనైనా ఒక్కటి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. గురువారం ఓ వైపు సుబయ్య మృతదేహానికి అంత్యక్రియలు జరగగా, మరో వైపు ఇంట్లో ఉరివేసుకుని సుధా ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన సుధా తల్లిదండ్రులు కుమార్తె మృత దేహాన్ని చూసి రోదించారు. ప్రేమను పక్కన పెట్టి చదువుకోవాలని సూచించినందుకు బలవన్మరణానికి పాల్పడి తమకు కడుపు కోత మిగిల్చారని వాపోయారు.  

చదవండి: (ప్రేమ జంట ఆత్మహత్య) 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు