ప్రేమించాడు.. పెళ్లికి నిరాకరించాడు..

18 Oct, 2021 02:03 IST|Sakshi

మనస్తాపంతో పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య

హసన్‌పర్తి: ప్రేమ పేరుతో యువతిని నమ్మించిన ఓ యువకుడు శారీరకంగా దగ్గరై  చివరికి పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన మంత్రి త్రివేణి (20) నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అదే వీధిలో ఉంటున్న ఆటో డ్రైవర్‌ గోళ్ల సుమన్‌ అలియస్‌ కిట్టు (ప్రస్తుతానికి ఓ షాపులో దినసరి కూలీ)తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.

ఈ క్రమంలోనే సుమన్‌ ఆమెను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. నెలరోజుల క్రితం త్రివేణి కుటుంబం వేలేరుకు వలస వెళ్లింది. ఇటీవల త్రివేణి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సుమన్‌ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన త్రివేణి శనివారం రాత్రి వేలేరులోని తన ఇంట్లో పురుగుల మందు తాగింది. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు వేలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీతంపేటకు చెందిన మరో ముగ్గురు యువకులు కూడా ఆత్మహత్యకు కారకులుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు