నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

Published Mon, Oct 18 2021 2:13 AM

Paddy Procurement Begins In Telangana District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ వానాకాలంలో పండిన ధాన్యాన్ని సేకరించే ప్రక్రియ సోమవారం ఆరంభం కానుంది. ఇప్పటికే వరికోతలు ఆరంభమైన జిల్లాల నుంచి మొదటగా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించనుంది. ఈ సీజన్‌లో మొత్తం 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కొనుగోళ్ల ప్రక్రియకు అవసరమైన చర్యలను వెంటనే మొదలుపెట్టాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు... 
ఈ సీజన్‌లో మొత్తంగా 1.35 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో కనీసంగా 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించనుంది. దీనికిగాను 6,500లకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కోతలు ఆరంభమైన నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి మొదటగా ధాన్యం సేకరించే అవకాశాలున్నాయని పౌర సరఫరాల వర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది వానాకాలం సీజన్లో 43 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరించగా, ఈసారి దాదాపు రెట్టింపు సేకరించే అవకాశాలున్నాయి. వరి ఎ–గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ధాన్యం సేకరణ నిమిత్తం రూ.7 వేల కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నిధులు అవసరమైతే, వాటిని రుణాల రూపేణా సమకూర్చుకోనుంది. 

ధాన్యం సేకరణపై కమిటీ 
ధాన్యం సేకరణ వ్యవహారాల పరిరక్షణకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కమిషనర్, పోలీస్‌ శా>ఖ అధికారులతో కలిపి ఆరుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ధాన్యం సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు ఎలాంటి అక్రమాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపడుతుంది. ఇక ధాన్యం అప్పగించిన రోజు నుంచి 15 రోజుల్లోగా మిల్లర్లు బియ్యాన్ని తిరిగి అప్పగించాలని పేర్కొన్న ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌కు సంబంధించి బాయిల్డ్‌ రైస్‌(ఉప్పుడు బియ్యం)ను ఏమాత్రం తీసుకునేది లేదని తెలిపింది. మిల్లర్లు రారైస్‌ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) బాయిల్డ్‌ రైస్‌ తీసుకునే పరిస్థితులు లేకపోవడం, ఇప్పటికే బాయిల్డ్‌ నిల్వలు భారీగా పేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Advertisement
Advertisement