అప్పు తీర్చలేక యువతి ఆత్మహత్య 

4 Nov, 2020 12:36 IST|Sakshi

సాక్షి, గాజువాక : ఆన్‌లైన్‌లో చేసిన అప్పులను తీర్చలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక శ్రీనగర్‌లోని సుందరయ్య కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక ఆటోనగర్‌లోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్న మాండవ సత్యనారాయణ కుమార్తె అహల్య (25) ఎంబీఏ పూర్తి చేసింది. ఇటీవల ఆమె ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా రూ.40 వేల వరకు అప్పు చేసింది. ఆ అప్పు మంగళవారం నాటికల్లా తిరిగి చెల్లిస్తానని సమాచారం ఇచ్చింది.

ఈ నేపథ్యంలో అప్పు తిరిగి చెల్లించాల్సిందిగా ఆయా యాప్‌ల సిబ్బంది నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ నేపథ్యంలో అహల్య తండ్రి సత్యనారాయణ తలుపులమ్మ దర్శనం కోసం మంగళవారం బయల్దేరి వెళ్లారు. తల్లి ఉషామణి బ్యాంకుకు వెళ్లింది. ఇంటర్‌ చదువుతున్న తమ పిన్ని కుమారుడికి పదిన్నర గంటల వరకు క్లాసు చెప్పిన అహల్య స్నానం చేస్తానని అతడిని హాల్‌లోకి పంపించింది. బ్యాంకు నుంచి కుమార్తెకు ఫోన్‌ చేయగా ఆమె స్పందించకపోవడంతో ఉషామణి హుటాహుటిన ఇంటికి చేరుకుంది.  (చదివింది ఎంబీఏ.. చేసేది పార్ట్‌టైమ్‌ చోరీలు)

ఎంత పిలిచినా తలుపు తెరవకపోవడంతో బద్దలుగొట్టి గదిలోకి వెళ్లి చూసేసరికి అహల్య ఫ్యాన్‌ హుక్‌కు తాడుతో ఉరి వేసుకొని మృతి చెంది కనిపించింది. చుట్టుపక్కలవారి సహాయంతో మృతదేహాన్ని కిందకి దింపి గాజువాక పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ గణేష్‌ ప్రాథమిక విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి ఫోన్‌లో తొమ్మిది యాప్‌ల ద్వారా అప్పులు చేసినట్టు గుర్తించారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు