ఎర్రచందనం స్మగ్లర్లపై ఆపరేషన్‌ సక్సెస్‌

3 Dec, 2020 11:29 IST|Sakshi

సాక్షి, కడప: జిల్లాలోని అటవీప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను నరికివేసి, బెంగళూరు, చెన్నై నగరాలకు అక్రమంగా తరలిస్తున్న ‘ఎర్ర’గ్యాంగ్‌ల ఆట కట్టించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషి సఫలీకృతమవుతోంది.  తమిళనాడు రాష్ట్రంలో గ్యాంగ్‌లను తయారు చేసుకుని, జిల్లా నుంచి ఆ తరువాత బెంగళూరు నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తీసుకుని వెళ్లే బాషాభాయ్‌ని, అతనికి సహకరించేవారిని గత నెలలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా మరికొందరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతో అక్రమార్కుల ఆట కట్టించినట్లయింది.

స్మగ్లర్ల రూటు ఇలా..
కర్ణాటక రాష్ట్రం కటిగేనహళ్లికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు ఖలీల్‌ఖాన్, అఫ్రోజ్‌ఖాన్‌లు జిల్లాలోని రైల్వేకోడూరుకు చెందిన షేక్‌ మస్తాన్‌ అలియాస్‌ బాబును ఆశ్రయించారు. అతని ద్వారా జిల్లాలో రైల్వేకోడూరు, నందలూరు, ఒంటిమిట్ట, పుల్లంపేట, మైదుకూరు పరిసర ప్రాంతాల్లో లోకల్‌ ఎర్రగ్యాంగ్‌లను తయారు చేసుకున్నారు. వీరి ద్వారా తమిళకూలీలు వచ్చి అటవీ ప్రాంతాల్లోని ఎర్రచందనం దుంగలను నరికి డంప్‌లను తయారు చేయించి వెళతారు. తరువాత ప్రధాన నిందితుల సూచనల మేరకు వాహనాలలో ఎర్రచందనం దుంగలను లోడింగ్‌ చేసుకుని అక్రమంగా కటిగెనహళ్లికి తరలిస్తుంటారు.

వేర్వేరు ప్రాంతాల్లో 20 మంది అరెస్టు
మైదుకూరు సబ్‌డివిజన్‌ పరిధిలో ప్రధాన నిందితులు ఖలీల్‌ఖాన్, అఫ్రోజ్‌ఖాన్‌లను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ల ప్రధాన అనుచరుడైన షేక్‌ మస్తాన్‌తో పాటు గిరిచంద్ర, అశోక్‌కుమార్, శివయ్య, రాజారెడ్డి, సురేష్‌, విజయకుమార్, మల్లారెడ్డి, వెంకటశివకుమార్‌రెడ్డిలను సిద్దవటం మండలం భాకరాపేట దగ్గరగల శనేశ్వరస్వామి దేవాలయం సమీపంలో అరెస్టు చేశారు.  నందలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆల్విన్‌ ఫ్యాక్టరీ వద్ద  సురేంద్రనాథరెడ్డి, శివప్రసాద్, రమ్మ మోహన్, అశోక్, చంద్రశేఖర్‌ నాయుడు, గంగాధర్‌లను అరెస్ట్‌ చేశారు.

పుల్లంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వత్తలూరు సబ్‌స్టేషన్‌కు దగ్గర జింకల సుబ్రమణ్యం, గణేష్‌, చెంచయ్య, సుబ్బారెడ్డి, నాగేంద్ర, వెంకటేష్‌లను, రైల్వేకోడూరు పరిధిలో సూరపరాజుపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో బురుసు రమేష్‌, నాగేశ్వర, శ్యాంసుందర్, గుండాల శంకరమ్మ, సుబ్బరాజు, వెంకటసుబ్బయ్యలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు టన్నుల బరువున్న 98 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ఐదు వాహనాలను సీజ్‌ చేశారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) దేవప్రసాద్‌ ఆధ్వర్యంలో మైదుకూరు డీఎస్పీ విజయకుమార్, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డిలు, సీఐలు, ఎస్‌ఐలు ప్రత్యేక బందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. త్వరలో మరికొంతమంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియాకు వెల్లడించారు.

పీడీ యాక్టుకు ప్రతిపాదనలు
ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. గత నెలలో ఇద్దరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించామని, మరో ఆరుగురిపై పీడీ యాక్ట్‌ ప్రయోగానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ సంఘటనల్లో నిందితులను అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు