సైన్స్ ఆగిపోయిన సమయాన ..

17 Jul, 2023 01:20 IST|Sakshi

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు 

ఆపిల్‌ చెట్టు నుంచి పండు కిందపడిపోతుందని అందరికీ తెలుసు... కానీ అది కిందనే ఎందుకు పడాలి..? అని అడిగిన వాడు సర్‌ ఐజాక్‌ న్యూటన్‌. ఉత్తమమైన ప్రశ్న వేస్తే సారవంతమైన పరిష్కారాలు బయటికి వస్తాయి. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని, అంతరిక్షం లో గ్రహాల కదలికలకు సంబంధించిన విషయాలను ప్రతి పాదించిన ఆయన అఖండ మేధావి, గణిత, భౌతిక శాస్త్రవేత్త.

‘‘అంతరిక్షం లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి... అన్న విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రతి పాదన చేస్తుందనీ, కానీ అక్కడ గ్రహాలు పెట్టిన వారు ఎవరు? అలా పెట్టి వాటిని నియమబద్ధమైన రీతిలో ఇంత వేగంతో ఇలానే కదలాలని నియంత్రిస్తున్నది ఎవరు? ...అన్న విషయాన్ని చెప్పదు’’ అని కూడా ఆయన అన్నారు అందుకే పెద్దలు..‘‘ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది’’ అంటూంటారు.

 ఉన్న విషయాన్నే కనుక్కొని ప్రతిపాదిస్తే డిస్కవరీ, సృష్టిలో ఇతః పూర్వం లేని విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటే  ఇన్వెన్షన్‌. ఈ రెండింటి ద్వారా నిరూపణచేస్తూ వెడుతుంది సైన్స్. కానీ ఆ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ వేదాంతం ప్రారంభం అవుతుంది. అదే న్యూటన్‌ మాటల్లో తెలుస్తున్నది.

మంట పైకే రావాలి, కిందకుపోతే ఎవరికీ పనికిరాదు. నీరు కిందకు పోకుండా పైకి వెడితే సృష్టి నిలబడదు. గాలి దానంతట అది కదులుతూ పోతుంటుంది. సముద్రాలు భూమిని పూర్తిగా ముంచెత్తకుండా ఒక హద్దు దగ్గరే ఆగిపోతుంటాయి... ఇవి కంటికి కనిపించే విషయాలే అయినా ఎవరు వాటిని అలా నియంత్రిస్తున్నారు లేదా ఏ శక్తి వాటిని అలా శాసిస్తున్నది అన్న విషయం ఈ భౌతిక నేత్రానికి కనపడేది కాదు.

మొగ్గ పువ్వు అవుతుంది. పరిమళం వెదజల్లుతుంటుంది. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, గుజ్జు రసమయింది, బాగా పండిన తరువాత చెట్టుకున్న ముచ్చెను వదిలి కిందపడిపోతున్నది.. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో చుక్కలు... ఇవన్నీ మనకు కనపడేవే... కానీ వాటిని చక్కగా నియమబద్ధంగా చేసి మనకు చూపుతున్న ఆ శిల్పి ఎవరు? ఆయన మాత్రం కనపడడు.


మరి ఆయనను చూడాలని ఉందా!!! ఒక్కటే మార్గం. భక్తి. దీని ద్వారా భారతదేశం సృష్టి రహస్యాలను విప్పి చూపింది... ఎప్పటినుంచో చూపుతూ వస్తున్నది... అందుకే సనాతనమయింది. వేదం ప్రమాణం గా నిర్ణయింపబడింది. అది ఎవరో రచించినది కాదు.. అది ఈశ్వర వాక్కు. భగవద్గీత కూడా అంతే... అందుకే సర్వజనాదరణ ΄పొందింది. సైన్స్ పరిమితులను గురించి న్యూటన్‌ నిజాయితీగా చెప్పినా గొప్ప మాట చెప్పడు.

 
రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ... నీటిని ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా, దాహం తీరుస్తుంది... అలా తీర్చడం దాని లక్షణం. సైన్స్ అందుకోలేని లేదా విప్పి చెప్పలేని విషయాలను ఆధ్యాత్మికత జన సామాన్యానికి సుళువుగా అందిస్తుంది భక్తి అనే మాథ్యమం ద్వారా.  

మరిన్ని వార్తలు