కోనసీమ తిరుపతి అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

28 Mar, 2023 02:32 IST|Sakshi
అన్నదాన భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

రూ.55 కోట్లతో ప్రతిపాదనలు

ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వెల్లడి

వాడపల్లి ఆలయం వద్ద వకుళమాత అన్నదాన సముదాయానికి శంకుస్థాపన

రూ.5.5 కోట్లతో నిర్మాణం

ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికి రూ.55 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైందని ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. దీని ఆమోదానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయం పార్కింగ్‌ ప్రాంగణం వద్ద రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వకుళమాత అన్నదాన సముదాయానికి జగ్గిరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పారు. సుమారు రూ.4 కోట్లతో ప్రాకార మండపాలు నిర్మించామని, ఆలయం చుట్టూ గ్రానైట్‌ వేయించామని గుర్తు చేశారు. పార్కింగ్‌ ప్రాంగణం వద్ద రూ.55 లక్షలతో కల్యాణ ప్రాంగణం నిర్మించామన్నారు. ఆలయం వద్ద ఉన్న చెరువును పుష్కరిణిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆలయ అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. వాడపల్లి కొత్త బ్రిడ్జి వరకూ ఉన్న రోడ్డుకు విద్యుత్‌ స్తంభాలు, లైట్ల ఏర్పాటుకు రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) నుంచి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆ పనులు కూడా అతి త్వరలోనే చేపట్టి, పూర్తి చేస్తామని చెప్పారు. వాడపల్లి ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో జీతం లేని ఉద్యోగులుగా కష్టపడి పని చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, కార్యవర్గ సభ్యులతో పాటు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, సిబ్బందిని, సర్పంచ్‌ పోచిరాజు సూర్యకుమారిని జగ్గిరెడ్డి అభినందించారు.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ ముదునూరి రామరాజు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ కనుమూరి శ్రీనివాసరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ కప్పల శ్రీధర్‌, ఎంపీపీలు కుండ అన్నపూర్ణ, మార్గని గంగాధరం, టి.లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యుడు బోణం సాయిబాబా, మాజీ ఎంపీపీ పీఎస్‌ రాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

తొలి విరాళం రూ.1,01,116

వాడపల్లి ఆలయంలో వకుళమాత అన్నదాన పథకానికి తొలి విరాళంగా దేవస్థానం కమిటీ సభ్యులు మన్యం వెంకట నాగ సూర్యకుమారి, భాను దంపతులు రూ.1,01,116 విరాళం అందించారు. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చేతుల మీదుగా ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజుకు అందజేశారు.

మరిన్ని వార్తలు