సామాజిక న్యాయ సారథి.. సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయ సారథి.. సీఎం జగన్‌

Published Fri, Nov 17 2023 2:30 AM

- - Sakshi

రావులపాలెం: అన్ని సామాజిక వర్గాల్లో వివక్షకు గురైన వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో న్యాయం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా రావులపాలెం జూనియర్‌ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సామాజికంగా సాధికారతను చేకూర్చిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని గుర్తు చేశారు. ఎవరైనా ఎస్సీల్లో పుడతారా అంటూ ఎస్సీ వర్గాలను చులకన చేస్తూ మాట్లాడారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలు చంద్రబాబు పాలనలో వివక్షకు గురయ్యారన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఓటును ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇస్తే.. ఆయన తన నాలుగున్నరేళ్ల పాలనలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, నివాసపరంగా ఆత్మాభిమానం చాటుకునేలా అన్ని వర్గాలకూ స్థానం కల్పించారని చెప్పారు.

తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు

‘‘ఒక నాయీ బ్రాహ్మణ వ్యక్తి ఆలయాల్లో ప్రాతినిధ్యం కల్పించమని కోరితే ‘మీ తోకలు కత్తిరిస్తాను’ అని చంద్రబాబు అన్నారు. మత్స్యకారులు రిజర్వేషన్లు కల్పించాలని అడిగితే తోలు తీస్తానని చెప్పకనే చెప్పాడు. ఇలా వివిధ వర్గాల పట్ల చంద్రబాబు తన భావజాలాన్ని బయట పెట్టాడు’’ అని మంత్రి వేణు గుర్తు చేశారు. నాటి చంద్రబాబు పాలనలో వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లో వివక్షకు గురైన ప్రతి ఒక్కరికీ గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చూపారని చెప్పారు. వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన ఫలాలను డీబీటీ పద్ధతిలో నేరుగా అందించి, నిజమైనా సామాజిక న్యాయం చేసి చూపించారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఇచ్చిన ఓటు హక్కును ఈ సామాజిక వర్గాలు వినియోగించుకుని, రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని, తద్వారా సంపన్న వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఈ సామాజిక వర్గాలకు శాసనసభ సభాపతి, శాసన మండలి చైర్మన్‌ పదవులతో పాటు మంత్రివర్గ కూర్పులో 75 శాతం అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అలాగే జిల్లా పరిషత్‌ స్థానాల్లో 90 శాతం, అలాగే మార్కెటింగ్‌ కమిటీలు, దేవాలయాల కమిటీల్లో 55 శాతం అవకాశం కల్పించారని అన్నారు. తద్వారా అసలైన సామాజిక న్యాయాన్ని సీఎం జగన్‌ అమలు చేసి చూపించారన్నారు.

ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడి 14 ఏళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అనేక విధాల వివక్షకు గురయ్యారని చెప్పారు. వారందరికీ సముచిత స్థానం కల్పించడం ద్వారా సామాజిక సాధికారత అంటే ఏమిటో సీఎం జగన్‌ చేసి చూపారని అన్నారు. అన్ని వర్గాలకూ సరైన సామాజిక న్యాయం చేకూర్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మరోసారి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం ‘రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలంటే’ బ్రోచర్‌ను నాయకులు ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, వైఎస్సార్‌ సీపీ కొత్తపేట నియోజకవర్గ ఇన్‌చార్జి కొప్పన రవి, అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ (అముడా) చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బొక్కా వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకూ మేలు చేశారు

ఆయనకు మరోసారి మద్దతు ఇవ్వాలి

బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణు

Advertisement
Advertisement