కొత్తపేటలో జనగోదారి | Sakshi
Sakshi News home page

కొత్తపేటలో జనగోదారి

Published Fri, Nov 17 2023 2:32 AM

బస్సు యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు - Sakshi

సాక్షి, అమలాపురం/కొత్తపేట/రావులపాలెం: గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తమకు అందిస్తున్న సంక్షేమానికి.. చేస్తున్న సామాజిక అభివృద్ధికి.. తమ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు తీసుకుంటున్న చర్యలకు అశేష జనవాహిని జై కొట్టింది. వైఎస్సార్‌ సీపీ కొత్తపేట నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన కొత్తపేటలో జరిగిన బహిరంగ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్‌ సీపీ జెండాలు చేబూని, పెద్ద పెట్టున ‘జై జగన్‌’ నినాదాలు చేస్తూ, ఉత్సాహంగా కదలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో రావడం గమనార్హం. అశేషంగా వచ్చిన జనంతో రోడ్లు నిండిపోయాయి. నిర్ణీత సమయంకన్నా రెండు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైనప్పటికీ మొక్కవోని దీక్షతో సభాస్థలిలోనే వేచి ఉన్నారు.

రావులపాలెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌ తదితరులు బస్సు ఎక్కి యాత్రను ప్రారంభించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి మోటార్‌ సైకిళ్లపై వేలాదిగా తరలి వచ్చిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బస్సు వెంట బయలుదేరారు.

‘అబద్ధాల చంద్రబాబు మనకొద్దు’

జనసందోహాన్ని ఉద్దేశించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, వాటి వల్ల జిల్లా ప్రజలకు చేకూరిన లబ్ధిని గణంకాలతో వివరించారు. ఈ పథకాలు కొనసాగాలంటే ఆయా వర్గాలన్నీ కలసికట్టుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని చెప్పారు. పలు సందర్భాల్లో ఆయా వర్గాలకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గుర్తు చేయడంతో పాటు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును వివరించారు. ‘అబద్ధాల చంద్రబాబు మనకొద్దు’ అంటూ సభికులతో నినాదాలు చేయించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎగవేత, 642 హామీలకు గాను 42 మాత్రమే అమలు చేయడాన్ని గుర్తు చేశారు. ‘ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి’ అంటూ నేతలు చేసిన ప్రసంగాలు సభికులను ఆలోచింపజేశాయి. జిల్లాలో తొలిసారి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం కావడం పార్టీ వర్గాల్లో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దృశ్యకళల అకాడమీ చైర్‌పర్సన్‌ కుడుపూడి సత్యశైలజ, అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ సాకా ప్రసన్నకుమారి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు కొప్పన శివనాగు, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, హితకారిణి సమాజం చైర్‌పర్సన్‌ కాశి బాలమునికుమారి, పార్టీ సీనియర్‌ నాయకుడు వాసంశెట్టి సుభాష్‌, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కప్పల శ్రీధర్‌, ఎస్టీ విభాగం అధ్యక్షుడు కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సాధికార బస్సు యాత్రకు నీరా‘జనం’

వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం

రావులపాలెం నుంచి భారీగా ర్యాలీ

మార్మోగిన ‘జై జగన్‌’ నినాదాలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న సామాజిక న్యాయాన్ని వివరించిన

మంత్రులు, ప్రజాప్రతినిధులు

Advertisement
Advertisement