సమష్టిగా రబీ విజయవంతం | Sakshi
Sakshi News home page

సమష్టిగా రబీ విజయవంతం

Published Fri, Nov 17 2023 2:32 AM

- - Sakshi

మొత్తం డెల్టా ఆయకట్టుకు నీరు

ముందస్తు సాగు.. నీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఐఏబీ సమావేశంలో తీర్మానం

సాక్షి, అమలాపురం: జలవనరులు, వ్యవసాయ, రెవెన్యూ అధికార వ్యవస్థలతో పాటు రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) సిబ్బంది, రైతులు సమష్టిగా పని చేయాలి. అప్పుడే రబీకి నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా ఉంటుంది. సాగు సాఫీగా సాగడమే కాదు.. అధిక దిగుబడులు వచ్చే ఆస్కారముంటుంది. రైతులు కూడా సకాలంలో సాగు చేపట్టి నీటి ఎద్దడి బారిన పడకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలి’ అని జిల్లా సాగునీటి సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు తీర్మానించాయి. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో గురువారం జరిగిన ఈ సమావేశాల్లో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొని రబీ ప్రణాళికపై చర్చించారు.

రూ.కోట్లతో వివిధ పనులు

రబీ సాగులో నీటి ఎద్దడిని అధిగమించే పనులకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నామని కలెక్టర్‌ శుక్లా తెలిపారు. జిల్లాలోని తూర్పు డెల్టా పరిధిలో 99,658 ఎకరాలు, మధ్య డెల్టాలో 1,72,000 ఎకరాల చొప్పున మొత్తం 2,71,658 ఎకరాల ఆయకట్టు ఉందని నిర్ధారించారు. ఆయిల్‌ ఇంజిన్లు, క్రాస్‌బండ్‌లు, షట్లర్ల మరమ్మతులు, తూడు తొలగింపునకు సంబంధించి 91 పనులకు గాను రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) ద్వారా 127 పనులకు రూ.11 కోట్లు కేటాయించామని తెలిపారు.

ఇవీ తీర్మానాలు

● నీటి లభ్యత 8.86 టీఎంసీలు తక్కువగా ఉన్నప్పటికీ మొత్తం ఆయకట్టుకు సాగునీరివ్వాలి.

● రబీ సాగు సమయంలో నీటి పంపిణీ సమస్యల పరిష్కారానికి జాయింట్‌ మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి.

● క్రాస్‌బండ్‌లు, మోటార్లతో నీరు తోడేందుకు చర్యలు తీసుకోవాలి.

● ముందస్తు సాగుకు రైతులను ప్రోత్సహించాలి. డిసెంబర్‌ 31 నాటికి నాట్లు, మార్చి 31 నాటికి సాగు పూర్తయ్యేలా అవగాహన కల్పించాలి.

● స్వల్పకాలిక రకాల సాగును ప్రోత్సహించాలి.

● సాగునీటి సరఫరాకు అవాంతరం రాకుండా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలి.

ప్రతి ఎకరాకూ నీరివ్వాల్సిందే : మంత్రి వేణు

‘గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఎకరాకూ నీరందించాలి. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదనే మాట రాకుండా అధికారులు పని చేయాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని అధిక నిధులు కోరేందుకు సిద్ధం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఖరీఫ్‌లో అధిక దిగుబడులు సాధించామని, నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో కూడా దిగుబడులు అధికంగా వస్తాయనే విషయం నిరూపణ అయ్యిందని అన్నారు. రబీలో సైతం తక్కువ నీటి వాడకం ద్వారా అధిక దిగుబడులు వస్తాయనే విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు అధికారులు వెన్నెంటే ఉండాలని, అప్పుడే అధిక దిగుబడులు వస్తాయని చెప్పారు. సాగు ఆలస్యంగా చేసేవారిని ఆర్‌బీకే స్థాయిలోనే గుర్తించి, వారి అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వెదజల్లును ప్రోత్సహిస్తే పంట త్వరగా చేతికి రావడం, దిగుబడులు పెరగడం, పెట్టుబడులు, నీటి వినియోగం తగ్గడం జరుగుతోందని, ఇన్ని లాభాలు ఉన్నందున ఈ సాగును ప్రోత్సహించాలని మంత్రి వేణు సూచించారు.

● రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ, గతంలో రబీ సాగుకు నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో తీసుకున్న చర్యలను పరిశీలించాలన్నారు. గోదావరి మురుగు నీటి కాలువల నుంచి వృథా నీటిని పొలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాట్లు పూర్తయ్యాకే వంతులవారీ విధానం అమలు చేయాలన్నారు.

● ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ, రబీ సాగుకు ఇబ్బంది లేకుండా అత్యవసర పనులను గుర్తించి, ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

● ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ. ఆయకట్టు రైతుల ఇబ్బందులు తొలగేలా పంట కాలువలను ఆధునీకరించాలని కోరారు.

● ఏపీ స్టేట్‌ అగ్రి మిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబీ), డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హార్టికల్చర్‌ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడు జిన్నూరి వెకంటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి మాట్లాడుతూ, సాగునీటి సరఫరాలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.

● సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాస్‌, జిల్లా అధికారి కె.బుల్లిరాజు, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు బోసుబాబు, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement