చూచిన కనులదే భాగ్యము

24 Dec, 2023 02:26 IST|Sakshi
ద్వారకా తిరుమలలో శేష వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శిస్తున్న భక్తులు

వైకుంఠవాసుని దర్శనానికి

పోటెత్తిన భక్తజనం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా

ఉత్తర ద్వారం నుంచి ప్రవేశాలు

ద్వారకాతిరుమల: అలాగే ద్వారకా తిరుమల చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం ఇల వైకుంఠాన్ని తలపించింది. వేద మంత్రా నడుమ దేవేరులతో శ్రీవారు ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై భక్తజనులకు దర్శనమిచ్చారు. ఉదయం 4.30 గంటలకు ఉత్తర ద్వారాలను తెరవగా ఈఓ వేండ్ర త్రినాథరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు తదితరులు స్వామివారిని దర్శించి, పూజాదికాలు చేశారు. సుమారు 40 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించారు. అలాగే జిల్లాలోని కోరుకొండలోని లక్ష్మీ నృసింహస్వామిని భక్తులు విశేషంగా దర్శించుకున్నారు.

ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి వారి కల్యాణం, బాలభోగం తదితర పూజలు చేశారు. ఉత్తర ద్వారం నుంచి వెళ్లిన భక్తులు శేషపాన్పుపై ఉన్న స్వామివారిని, అనంతరం ప్రధాన ఆలయంలోని మూల విరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి తదితర ఆలయాల్లో పూజలు చేశారు. స్వామికి రూ.44,19,982 ఆదాయం వచ్చిందని, సుమారు 60 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.

అప్పనపల్లి బాలాజీ సన్నిధిలో..

మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ దర్శనానికి 10,394 మంది భక్తులు తరలివచ్చారు. దర్శనానంతరం మొక్కులు తీర్చుకుని స్వామి వారి నిత్యాన్నదాన ప్రసాదాన్ని 6,852 మంది స్వీకరించారు. స్వామికి వివిధ సేవల ద్వారా రూ.6,41,530 ఆదాయం వచ్చింది. లడ్డూ ప్రసాదం, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.5,21,961 ఆదాయం సమకూరింది. స్వామి వారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.1,19,569 విరాళంగా వచ్చాయి. ఆలయ ఈఓ జి.మాధవి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

అంతర్వేదిలో..

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని 10 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు ఏసీ వి.సత్యనారాయణ తెలిపారు. అనంతరం కంచుగరుడ వాహనంపై మాడ వీధ్లుల్లో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.

విజయదుర్గా పీఠంలో..

రాయవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం ముక్తికి మార్గమని పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్‌) అన్నారు. శనివారం పీఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

సత్యదేవుని సన్నిధిలో..

అన్నవరం : కట్టెదురా వైకుంఠము.. కాణాచైన కొండ.. అని పదకవితా పితామహుడు అన్నమయ్య వేంకటేశుని కీర్తించినట్టు రత్నగిరి శనివారం వైకుంఠాన్ని తలపించింది. ముక్కోటి ఏకాదశి, అందునా శనివారం శేష శయనుడైన స్వామివారు దేవేరులతో సత్యదేవుని రూపంలో అనంత లక్ష్మీ, సత్యవతీదేవి సమేతంగా భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉత్తరద్వారం నుంచి దేవేరీ సమేతుడైన అయ్యవారిని దర్శించిన భక్తులు పులకాంకితులయ్యారు. తెల్లవారు జామున 3–30 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతసేవ చేసి, నాలుగు గంటలకు సత్యదేవునికి, లక్ష్మీదేవి అలంకరణలో అనంతలక్ష్మి, సత్యవతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ రామచంద్రమోహన్‌, ఏసీ డీఎల్‌వీ రమేష్‌ బాబు, సత్యదేవుడు, అమ్మవార్ల వజ్ర కిరీటాల దాత మట్టే సత్యప్రసాద్‌ తదితరులు స్వామివారిని, అనంతరం గర్భాలయంలోని సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతి అమ్మవార్లను దర్శించుకున్నారు.

విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి

స్వాత్మానందేంద్ర పూజలు

4.45 గంటలకు విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలకగా ఆయన స్వామివారికి కర్పూర హారతి సమర్పించారు.

తరలివచ్చిన భక్తజన సంద్రం

పుష్పాలంకరణతో శోభిల్లిన ఉత్తర ద్వారం నుంచి వచ్చిన భక్తజనానికి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న సత్యదేవుడు, సత్యవతీదేవి భక్తులకు కనువిందు చేశారు. గర్భాలయంలో తూర్పుముఖంగా ఉన్న స్వామి, దేవేరులను వారు దర్శించుకుని పశ్చిమ ద్వారం నుంచి వెలుపలికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించిన అధికారులు అనంతరం యథావిధిగా దక్షిణ ద్వారం నుంచి లోపలికి పంపి ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు పంపించారు.

ఈ సందర్భంగా అంతరాలయ దర్శనాలను అధికారుల రద్దు చేశారు. తెల్లవారుజామున స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సహస్ర తులసి దళార్చన, నీరాజన, మంత్రపుష్పాలు, అవసర నివేదనలు సమర్పించారు.

స్వామిని దర్శించిన 50 వేల మంది

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శనివారం సుమారు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించి పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంపై పార్కింగ్‌ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. స్వామివారి వ్రతాలు 3,500 జరగగా, వివిధ విభాగాల ద్వారా రూ.50 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఘనంగా రథోత్సవం..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెండి రథంపై స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు. ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. స్వామివారి రధం లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. కదంబ ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.

ప్రధాన వేదపండితులు గొల్లపల్లి ఘనాపాఠి, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, ఉపప్రధానార్చక ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, అర్చకులు సుధీర్‌, పవన్‌, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాబి, ఇతర వైదిక బృందం ప్రత్యేక పూజలు చేశారు.

శృంగార వల్లభుని దర్శనానికి..

పెద్దాపురం/సామర్లకోట/పిఠాపురం: కాకినాడ జిల్లాలలోని తొలి తిరుపతిగా ఖ్యాతి పొందిన స్వయంభూ శంగారవల్లభ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే సామర్లకోట మండలంలోని మాండవ్య నారాయణస్వామి, పిఠాపురంలోని కుంతీమాధవ స్వామి దర్శనాలకు భక్తులు భారీగా తరలివచ్చి ఉత్తర ద్వారం నుంచి దర్శనాలు చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు