ఇన్‌చార్జి జేసీగా దినేష్‌ కుమార్‌

24 Dec, 2023 02:26 IST|Sakshi
రోడ్డు మూసివేసినట్టు అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ ఆదివారం నుంచి ఈనెల 28 వరకూ వ్యక్తిగత కారణాలపై సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌గా కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు ఆయన కొనసాగుతారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ మాధవీలత శనివారం ప్రకటనలో తెలిపారు.

కాటన్‌ బ్యారేజీ

రోడ్డు మూసివేత

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజీ రోడ్డును మరమ్మతుల కోసం శనివారం మూసివేశారు. వాహన చోదకులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని అధికారులు సూచిస్తున్నారు. బ్యారేజీ రోడ్డు బాగా శిథిలమైంది. దీంతో మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. రోడ్డులోని 6.8 కి మీటర్ల మేర పనులు జరుగుతాయి. ఇందుకోసం రూ.2 కోట్లు కేటాయించారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి, ప్రజలను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

జూన్‌లో సుప్రీం ముందుకు మార్గదర్శి కేసు : ఉండవల్లి

సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసు జూన్‌లో సుప్రీం కోర్టుకు రానుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రకాష్‌ నగర్‌ బుక్‌హౌస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ విలువలు మంట గలిశాయన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పోటీ చేస్తే ఓట్లు వస్తాయేమో కానీ సీట్లు రావడం కష్టమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తరుణంలో చేపడుతున్న ఎమ్మెల్యే స్థానాల మార్పు విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ టాక్టికల్‌గా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని ప్రయోగం సంక్షేమం పేరిట డబ్బులు పంపిణీ కార్యక్రమం జగన్‌ చేశారని, అయితే ఇదేమీ కొత్త కాదని, ఇలాంటి ప్రయోగాలు ఇందిరా గాంధీ భూ పంపిణీతో మొదలు పెట్టారని గుర్తుచేశారు. కౌలు దారులు– పట్టాదారుల మధ్య గొడవ రోజుకీ పెరుగుతోందన్నారు. 262 ఎకరాలకు సంబంధించి 114 మంది పట్టాదారులు, 32 మంది కౌలుదారులు ఉన్నారన్నారు.

>
మరిన్ని వార్తలు