ప్రకృతి వ్యవసాయంపై ముగిసిన శిక్షణ

24 Dec, 2023 02:26 IST|Sakshi
ఉత్తమ రైతు రాంబాబును సన్మానిస్తున్న అధికారులు

రాజానగరం: ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పెరటి తోటల పెంపకంపై కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ, క్షేత్ర సందర్శన కార్యక్రమం ముగిసింది. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమం, జాతీయ రైతు దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్‌ వీఎస్‌జీ ఆర్నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న లఘు శిక్షణను రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అగ్రికల్చరల్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.జ్యోతిర్మయి మాట్లాడుతూ భవిష్యత్తులో ఆత్మ సౌజన్యంతో ప్రకృతి వ్యవసాయం కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు సహకరిస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన చీడరాసు రాంబాబుకు ఉత్తమ రైతు పురస్కారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించడంతో నేల ఆరోగ్యం పెరిగి, మొక్కలుఽ ధృడంగా తయారయ్యాయన్నారు. మిచాంగ్‌ తుపాను సమయంలో తన వరిపంట ఒరిగిపోకుండా ఉందన్నారు. దీంతో నష్టాన్ని అధిగమించగలిగానని చెప్పారు. అనంతరం వంగ, మిరపనారును కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు పంపిణీ చేశారు. ఏపీ కమ్యూనిటీ బేస్‌డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ అడిషనల్‌ ప్రాజెక్టు డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ షేక్‌ మెహబూబ్‌ వలీ మాట్లాడుతూ జిల్లాలో ఏపీసీఎన్‌ఎఫ్‌ ద్వారా జరుగుతున్న వివిధ కార్యక్రమాలను, రైతులు పొందుతున్న లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఏపీసీఎన్‌ఎఫ్‌ జూనియర్‌ పీఈ సీహెచ్‌ వరలక్ష్మి, కేవీకే ఉద్యోగులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు