ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన

24 Oct, 2021 01:15 IST|Sakshi

జనతంత్రం

రాజసభలో ఒక వేడుక. అతిథి రాజులంతా ఉచితాసనాలను అధిష్ఠించారు. అందులో ఒక రాజుగారి తల తెగిపడింది. ఉత్సవంలో రక్తపు మరకలు. ఈ ఘటనకు కారకులెవరు? దోషి ఎవరు?... బూతులు తిట్టిన శిశుపాలుడా? చక్రం తిప్పిన శ్రీకృష్ణుడా? తప్పు శిశుపాలుడిదేననీ, అతడు దండనార్హుడని,యుగయుగాలుగా తరతరాలుగా భారత సమాజం నమ్ముతూ వస్తున్నది. ఇప్పుడా కేసును తిరగదోడాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్‌ చేస్తున్నది.

ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి అప్పీలు చేయ దలచుకున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షానంతర భాషణలో భాగంగా అభిభాషించారు. అనగనగా ఒకరాజు ఉదంతం సందర్భంగా కొద్దినెలల క్రితమే ఈ తర్క మీమాంసకు ఆ పార్టీ తెరతీసింది. ఆయన రాజంటే రాజు కాదు. దొరల యందు పిట్టల దొరలు వేరయా అన్నట్టు రాజుల్లో ఆయన తేడా రాజు. శత్రువుల తరఫున పనిచేసే కోవర్టులు రహస్యంగా ఉంటారు. ఈయన బహిరంగ కోవర్టు. అదీ తేడా. అతడు శల్యుని పరంపర.

అఖండ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని బజారు భాషలో తిట్టించడం తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల పంథాలో ఒక ముఖ్యమైన అంశం. ఈ కర్తవ్య నిర్వహణకోసం ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌’గా ‘తేడా రాజు’ను ఆ పార్టీ నియో గించింది. ఒక డజన్‌ దుర్భాష దండకాల తర్వాత అతడి మీద పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. తిట్టిన రాజుది తప్పు కాదు, అరెస్ట్‌ చేసిన పోలీసులదే తప్పని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా హడావుడి చేసింది. శిశుపాలోపాఖ్యానంలో కృష్ణుడిని విలన్‌గా ప్రకటించే వరకు నిద్రపోరాదని అప్పుడే చంద్రబాబు వర్గం కంకణం కట్టుకున్నది.

తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల్లో భాగంగా పట్టాభి అనే ఔత్సాహికుడిని అధికార ప్రతినిధిగా రంగంలోకి దించింది. ‘నా బూతే నా భవిష్యత్తు’ అన్నంత దీక్షతో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించాడు. సంస్కృత భాషలో భవభూతి ఎంతటి పండి తుడో బజారు భాషలో ఈ ‘బండబూతి’ కూడా ఇంచుమించు అంతటివాడనే ఖ్యాతికోసం ఆయన తహతహలాడుతున్నాడు. టీడీపీ అవసరాలకు అచ్చుగుద్దినట్టు పట్టాభి కుదురుకున్నాడు.

‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డం వచ్చినది’. ఇది పాత కథ. ఆ గడ్డిపోచను పట్టుకొని కథ మూలాల్లోకి వెళితే చేప ఎందుకు ఎండలేదో కారణం తెలుస్తుంది. చీమ పుట్టలో పెట్టిన వేలు విలన్‌గా తేలుతుంది. ఇప్పుడు మన ఎల్లో చేపల్ని కూడా ప్రశ్నించుకుంటూ వెళితే బూతు రహస్యాలను కనిపెట్టవచ్చును. ‘చేపా చేపా బూతులెందుకు మాట్లాడుతు న్నావు?’ ‘ఫ్రస్ట్రేషన్‌’... ‘ఎందుకు?’... ‘కిక్కు లేదప్పా!’. ‘చేపా చేపా అబద్ధాలెందుకు చెబుతున్నావు?’... ‘డబుల్‌ ఫ్రస్ట్రేషన్‌’... ‘ఎందుకు?’ ... ‘కిక్కు లేదప్పా’.

ఏమిటా కిక్కు?... అది గంజాయి వనం నుంచే వీచే ధన మారుతం జేబుల్లో ప్రవహిస్తున్నప్పుడు కలిగే పరవశాల కిక్కు. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ను తవ్వుతున్నప్పుడు నట్టింట్లో ధనలక్ష్మి కాలిగజ్జెలు మోగుతున్నట్టు అనుభూతినిచ్చే కిక్కు. వాడవాడనా వెలసిన బెల్టు షాపుల్లో పారిన పేదవాడి నెత్తురు అత్తరు రూపంలో హత్తుకున్నప్పుడు వెలువడే పరిమళాల కిక్కు. వగైరా వగైరాలెన్నో ఉన్నాయి ఈ కిక్కుల్లో. కానీ మొన్న మన ఎల్లో ఫిష్‌ చేసిన బూతు ప్రవచనంలో గంజాయి, డ్రగ్స్‌ల పలవ రింతే ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌లకు సంబంధించిన వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలించడం అవసరం.

‘ఆంధ్రప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతం దేశ గంజాయి రాజధానిగా మారుతున్నది’ అనే శీర్షికతో 2018 సెప్టెంబర్‌ 2న ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ఒక పరిశోధనా కథనాన్ని ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇటువంటి కథనాన్నే వేసింది. తెలుగు పత్రికల్లో, చానల్స్‌లో పుంఖాను పుంఖాలుగా ఈ వార్తలు వచ్చాయి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా పనిచేసిన 2014 – 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశవిదేశాలకు గంజాయి అక్రమ రవాణా పెద్దఎత్తున సాగిందని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి.

శ్రీలంకలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిన సంఘటనపై ఆ దేశ ప్రభుత్వం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఆ సరుకు రవాణా అయినట్టుగా విచారణలో వెల్లడైంది. ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం కేంద్రానికి చేరవేసింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వాన్ని అప్రమత్తం చేసింది. అప్పుడే కాదు మరో రెండు మూడు సందర్భాల్లో కూడా కేంద్రం గంజాయి రవాణాపై బాబు ప్రభు త్వాన్ని హెచ్చరించింది. అయినా రాష్ట్రం పెడచెవిన పెట్టింది. అంతేకాదు, గంజాయి అక్రమ రవాణాకు కొమ్ము కాసింది.

చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా చేసిన అప్పటి నర్సీ పట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుపై మొదటి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గంజాయి స్మగ్లింగ్‌ కింగ్‌ అయ్యన్నేనని ఆయన మంత్రివర్గ సహచరుడు గంటా శ్రీనివాసరావు బహి రంగంగా చెప్పిన వైనం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దా లుగా మావోయిస్టులకు గట్టిగా పట్టుంది. వారి భౌగోళిక విభ జనలో ఈ ప్రాంతానికి ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్‌)గా నామకరణం చేసుకున్నారు.

వారికి కూడా ఆదాయ వనరుగా మారడంతో పెద్దఎత్తున ఇక్కడ గంజాయి సాగుకు అండగా నిలబడ్డారు. మావోయిస్టు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఈ సాగును ఏమీ చేయలేక పోయారు. మావోయిస్టుల వేటకు వెళ్లే కూంబింగ్‌ పార్టీలు కూడా గంజాయి వనాల జోలికి వెళ్లేవి కావు. అలా చేస్తే గిరిజనులు మావోయిస్టులకు మరింత దగ్గరవుతారని వారి భయం.

ఇక్కడ విస్తారంగా పండించిన పంటను దేశవిదేశాలకు తరలించడానికి ఉన్నది ఒకటే దారి. ఏవోబీ నుంచి నర్సీపట్నం, రంపచోడవరం, జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్‌. అక్కడినుంచి అన్నివైపులకు పంపిణీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రవాణా కార్యక్రమం సాఫీగా సాగి పోయేది. ‘నర్సీపట్నం – ఫార్టీ పర్సెంట్‌’ అనే అనధికార ఒడంబ డిక ఇందుకు కారణమని స్థానికులు చెబుతారు.

ఏవోబీ నుంచి మొదటి ఎగ్జిట్‌ పాయింట్‌ (నర్సీపట్నం) దగ్గర అక్కడ వుండే వీఐపీకి సరుకులో 40 శాతం విలువచేసే సొమ్ము చెల్లిస్తే హాయిగా చేరవచ్చు. ఈ ఫార్టీ పర్సెంట్‌లో ఏ స్థాయి వరకు ఎంత శాతం చేరుకునేదో ఆ వీఐపీలకు మాత్రమే ఎరుక. నామ్‌కే వాస్తే  కొన్ని కేసులను మాత్రం నమోదు చేసేవారు. ఆ కేసుల్లో పురో గతి ఏమీ ఉండదు. అప్పుడప్పుడూ కొంత సరుకు సీజ్‌ చేసినట్టు చూపేవారు.

గంజాయి స్మగ్లింగ్, మద్యం దొంగరవాణా, డ్రగ్స్‌ తదితర వ్యవహారాలపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కర్తవ్య సాధనకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో’ (ఎస్‌ఈబీ)ని ఏర్పాటు చేసింది. మెరికల్లాంటి సిబ్బం దిని ఈ బృందంలో నియమించింది. స్వయంగా సీఎం ఈ బృందం పని తీరును సమీక్షిస్తున్నారు. అనతికాలంలోనే ఎస్‌ఈబీ అద్భుతమైన పని తీరును కనబరిచింది.

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంతో పాటు, రవాణా మార్గం అంతటా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి, ఇన్ఫార్మర్ల వ్యవస్థను నిర్మించుకున్నది. దాడులు, తనిఖీలను పెంచింది. ఫలితంగా కేసుల సంఖ్యలో కూడా వృద్ధి కనిపించింది. కేసులు పెరిగినా ఫరవాలేదు, కానీ ఈ దుర్వా్యపారాన్ని మాత్రం అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదే శాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గంజాయి కథలో దోషి చంద్రబాబు ప్రభుత్వం. ఆ పాపాన్ని కడిగేస్తున్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కానీ ఇక్కడ దొంగే అందరికంటే ముందుగా ‘దొంగా దొంగా’ అని అరుస్తున్నాడు. చంద్రబాబు నేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చూస్తున్నవారికి ఇదే మంత పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. డ్రగ్స్‌ వ్యవహారం లోనూ అదే తంతు. గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ రాకెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒక అడ్రస్‌ కనిపించిందట.

అది దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఇచ్చిన ఉత్తుత్తి అడ్రస్‌గా అధికారులు తేల్చారు. ఈ డ్రగ్స్‌ రాకెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఏరకమైన సంబంధమూ లేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసింది. కానీ మన తెలుగుదేశం పరివారానికి ఇవేమీ తలకెక్కవు. గంజాయి రవాణాపై కేంద్రం నిజంగా హెచ్చ రించినప్పుడు మౌనం పాటించిన ఈ పరివారం, ఇప్పుడు కేంద్రం అసత్యమని ఖండించిన అంశాన్ని మాత్రం నిజమే అన్నట్టుగా చాటింపు వేయిస్తోంది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉండడం వలన తెలుగుదేశం పరివారానికి మూసుకుపోయిన దొంగ వ్యాపారాల దారుల్లో గంజాయి అక్రమ రవాణా ఒకటి. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు అవి అందనప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. పిచ్చిగా మాట్లాడతారు. అటువంటి లక్షణాలు ఇప్పుడు ఎల్లో పరివార్‌లో కనిపిస్తున్నాయి. ఆరునూరైనా, నూరు ఆరైనా∙సరే, ఎంత ఖర్చయినా సరే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనే సంక ల్పాన్ని తెలుగుదేశం తీసుకున్నట్టు పరిణామాలను బట్టి అర్థమ వుతున్నది.

రాజు భాష, పాత్రుడు భాష, పట్టాభి భాష – ఇందుకు సాక్ష్యాలు. పాలక పక్షాన్ని కవ్వించాలి. వారు రెచ్చి పోవాలి. తెలుగుదేశం వారిపై దాడులు చేయాలి. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదంటూ గగ్గోలుపెట్టాలి. ప్రభు త్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన పెట్టించాలి. తెలుగుదేశం పరివారంలోని అన్ని విభాగాల లైన్‌ ప్రస్తుతానికి ఇదే.

పట్టాభి బూతులు, చంద్రబాబు దీక్ష, దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన సభ – ఈ వ్యూహానికి అద్దం పట్టాయి. డెబ్బయ్‌ రెండేళ్ల వృద్ధుడు, మధుమేహ పీడితుడైన వ్యక్తి 36 గంటలపాటు నిరాహారంగా వుండి కూడా గంటన్నర పాటు ఆవే శంతో ఊగిపోతూ ఎలా మాట్లాడగలిగారని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయనే ప్రశ్నలు వేస్తారు, ఆయన్నెవరూ ప్రశ్నించకూడదు, సందేహించ కూడదు అనే నియమం కొన్ని దశాబ్దాలుగా అమల్లో వుంది. కనుక సజ్జల ప్రశ్నకు సమాధానం దొరికే ఛాన్స్‌ లేదు.

ఈ సభలో చినబాబు వీరంగం చూసి తరించవలసినదే. పనిలో పనిగా మంగళగిరి లోని ఒక మండలంలో తాను ఐదుగురు ఎంపీ టీసీలను గెలిపించిన విషయాన్ని చినబాబు చాటుకున్నారు. అదే ఊపులో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిచి మీకు కానుకగా అర్పిస్తానని తండ్రిగారికి హామీ ఇచ్చారు. ఈ వీరాలాపన వింటుంటే భలే ముచ్చటేసింది.

ఇదే సభలో ఒక నాయకురాలు నాగమ్మ మాట్లాడుతూ ‘మీరు ఒక రెండు నిమిషాలు మాకు అనుమతివ్వండి. ఏం చేస్తామో చూపిస్తామ’ని సవాల్‌ విసిరారు. ‘టైమ్‌ మీరు చెబుతారా, నన్ను చెప్పమం టారా?, ప్లేస్‌ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? కొట్టుకో వడానికి మేం రెడీ’ అని కేశినేని నాని సవాల్‌ విసిరారు. నాని విసిరిన సవాల్‌ పార్టీలోని తన వ్యతిరేకులకా, వైసీపీ వారికా అనేది అర్థంకాక సభికులు అయోమయానికి గురయ్యారు.

చివరగా మాట్లాడిన చంద్రబాబు ఈ రాజ్యాంగ వ్యవస్థ మీద దాదాపు యుద్ధ ప్రకటనే చేశారు. తన నలభై మూడేళ్ల రాజకీయ అనుభవాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు. స్థానిక ఎన్నికలపై విషాన్ని వెళ్లగక్కారు. ‘థూ... ఇవి ఎన్నికలా’ అని ఈసడించుకున్నారు. తన జేబులోని మనిషి ఎన్నికల కమిష నర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాలే ఆ తర్వాత కూడా పునరావృతమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించే ఇంగితాన్ని కూడా ఆయన కోల్పోయారు.

ముందుగా మాట్లాడిన తన వారసుడు తాను ఐదు ఎంపీటీసీలను గెలిపించిన విషయాన్ని చెప్పుకుంటుంటే ఆనందించిన వ్యక్తి, ఈ విధంగా మాట్లాడట మేమిటి? ఎన్నికల్లో తాను గెలవలేననే నిర్ధారణకు వచ్చారా? గెలవకపోయినా గద్దె కావాలని తహతహలాడుతున్నారా? అందుకోసమే వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారా? చివర్లో ‘కార్యకర్తలారా! మీరు పోరాడండి’ అని పిలుపునిచ్చింది అందు కేనా? కేసులు వస్తే నేను చూసుకుంటానని చెప్పడంలోని అర్థమేమిటి? తాను న్యాయవ్యవస్థను మేనేజ్‌ చేయగలడని కార్యకర్తలు అనుకోవాలా? ఇది న్యాయ వ్యవస్థను అవమా నించడం కాదా? ఎన్నికలను తూర్పారబట్టి తిట్లకూ, ఘర్షణ లకూ వీరతాళ్లు వేయడం దేనికి సంకేతం? రాజ్యాంగ వ్యవస్థ లను అవహేళన చేస్తున్నారా? ఇటువంటి మనోవికారంతో బయల్దేరి రాష్ట్రపతికీ, కేంద్ర పెద్దలకు ఏమని విజ్ఞప్తి చేస్తారు? వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని మీరు రద్దుచేయక పోతే వీధి పోరాటాల ద్వారా నేనే రద్దు చేయిస్తానని చెబుతారా? ఈ వైఖరి రాజ్యాంగ వ్యవస్థలపై యుద్ధ ప్రకటన కాదా? ఆ ప్రభుత్వాన్ని అత్యవసరంగా తప్పించవలసినంత భయంకరమైన ఒత్తిడి ఆయన మీద ఏమైనా ఉన్నదా? గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా రాకెట్‌ అంతా అంతర్జాతీయ మాఫియా ముఠాల కనుసన్నల్లో జరుగుతుంది.

చంద్రబాబు హయాంలో సాఫీగా సాగిన గంజాయి కదలికలు ఇప్పుడు కష్టసాధ్యంగా పరిణ మించాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమ రవాణాపై కేంద్రం దర్యాప్తు జరిపితే చాలా సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.

-వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు