‘గ్యాస్‌ పన్ను’పై బీజేపీ అబద్ధాలు 

24 Oct, 2021 01:16 IST|Sakshi
నాగంపేటలో మాట్లాడుతున్న హరీశ్‌రావు  

రాష్ట్రం వాటా ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీశ్‌రావు

చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఈటలకు సవాల్‌

హుజూరాబాద్‌/ ఇల్లందకుంట: గ్యాస్‌ సిలిండర్‌ ధరలో రాష్ట్ర ప్రభుత్వానిది 291 రూపాయల పన్ను ఉందని బీజేపీ నాయకులు అబద్ధం ఆడుతున్నారని, అది నిరూపిస్తే తాను ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసిరారు. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు కొద్దికొద్దిగా పెంచుకుంటూ కొత్తగా 28 రూపాయలు, పాతది రూ.10 కలిపి మొత్తం లీటర్‌ మీద రూ.38 తీసుకుంటోందన్నారు.

దమ్ముంటే కిషన్‌రెడ్డి బడ్జెట్‌కు సంబంధించిన పుస్తకాలు తీసుకొని టీవీ చానళ్లకుగానీ, బహిరంగ చర్చకుగానీ రావాలని సవాల్‌ చేశారు. అబద్ధాలు చెప్పే బీజేపీ కావాలా.. నమ్మకాలు నిలబెట్టే టీఆర్‌ఎస్‌ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులు ఇబ్బందులు పడకుండా రైతుబంధు పథకం అమలు చేశామని, టీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో సొంత జాగాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల 4 వేలు సాయం అందిస్తామని, మహిళలకు అభయ హస్తం డబ్బులు వడ్డీలతో చెల్లించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు.

‘ఈటల ఎలాగూ గెలిచేది లేదు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు’అని హరీశ్‌ పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీకి హరీశ్‌ 15 ప్రశ్నలు 
‘టీఆర్‌ఎస్‌ సంపద పెంచింది. రైతుల అప్పు మాఫీ చేసింది. బీజేపీ పేద రైతుల పన్నులు పెంచి బడా పారిశ్రామిక వేత్తలకు అప్పులు మాఫీ చేసింది. హుజూరాబాద్‌ రైతులు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో హరీశ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ‘బీజేపీకి 15 ప్రశ్నలు వేస్తున్నాం. వాటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సమాధానం ఇవ్వాలి’అని బహిరంగ లేఖ విడుదల చేసినట్లు తెలిపారు.

బీజేపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సంవత్సర కాలంగా రైతులు పోరాడుతున్నారని, కానీ ఆ పార్టీకి చీమ కుట్టినంత బాధ కూడా లేదని, ఇంత క్రూరంగా ప్రవర్తించిన ప్రభుత్వం బీజేపీ తప్ప మరోటి లేదన్నారు. రైతులను లాఠీలతో చితక్కొట్టండని బీజేపీకి చెందిన హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్‌ అన్నారని పేర్కొన్నారు. రైతులను చితక్కొట్టండని ఆదేశించిన బీజేపీకి రైతులు ఎందుకు ఓట్లు వేయాలని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి  పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు