పురిటి బిడ్డ పురోగమనం!

9 Sep, 2021 00:44 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

రైతాంగ పోరాటం దేశంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశ రాజధాని, పరిసరాలను దాటి విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ (అనుబంధ అంశాల) చట్టాలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం, ఇప్పటికే  పలు ఆటుపోట్లను చవిచూసింది. దేశంలో ఎక్కడికక్కడ నిరసించినా... ఢిల్లీని చుట్టుముట్టి ఓ ఆందోళన నిరవధికంగా సాగుతోంది. ఏకరీతిన నవమాసాలు గర్భస్థ స్థితిలో ఢిల్లీ, శివార్లకే పరిమితమైన శైశవ దశ నుంచి... ఆందోళన తాజాగా గడపదాటుతోంది.

మహాపంచాయతీల రూపంలో అడుగు బయటకు వేసింది. వారం కిందటి ముజఫర్‌నగర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), నిన్నా ఇవాళ్టి కర్నల్‌(హర్యానా) రైతు ఆందోళనలు సంకేతం. వారం కింద, మితిమీరిన పోలీసు లాఠీ దెబ్బకు ఒకరు మరణించి, పదిమంది రైతులు గాయపడ్డ దాష్టీకాన్ని నిరసించిన ఆందోళన, హర్యానా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలో రోజురోజుకు బలపడుతోంది. వివిధ రాష్ట్రాలకు, జిల్లా కేంద్రాలకు విస్తరించే రైతు ఉద్యమ కార్యాచరణ ఐక్య పోరాట వేదిక, ఇతర రైతు సంఘాల వ్యూహాల్లో రూపుదిద్దుకుంటోంది.

పాలకపక్షమైన భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా... ఉద్యమాన్ని నిరాఘాటంగా సాగించిన రైతు సంఘాలు, ఇంతకాలం వ్యూహాత్మకంగా రాజకీయ పక్షాలను దూరం పెట్టాయి. తమ వేదికలనెక్కనివ్వలేదు! అందుకే, ఎంతో విశ్వసనీయత పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందీ ఉద్యమం. కానీ, ఉత్తరాది వివిధ రాష్ట్రాలు ఎన్నికలకు సమాయత్తమౌతున్న ప్రస్తుత తరుణంలో... ఆయా పార్టీలు రైతాంగ ఉద్యమాంశాన్ని ఇప్పుడు తమ ప్రచారాస్త్రంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.

చిత్రమేమంటే, పాలకపక్షం బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అనుబంధ రైతు విభాగమైన భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) కూడా దేశవ్యాప్త నిరస నల కార్యాచరణ ప్రారంభించింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కాలని, చట్టబద్దత కావా లని కోరుతూ, మచ్చుకి 500 జిల్లా కేంద్రాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టింది. ఇది వ్యూహాత్మక చర్య అన్నది ప్రత్యర్థుల వాదన! ఒక మహాఉద్యమం నుంచి, మూడు చట్టాలు ఎత్తివేయాల్సిందేననే తమ ప్రధాన డిమాండ్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ అని, ఇన్నాళ్లు రైతు సంఘలెన్నింటినో ఏకీకృతం చేసిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) అంటోంది. వారు సెప్టెంబరు 27న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చి ఉన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికి, మరోవైపు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఒత్తిడి పెరుగుతోంది. రైతు సంఘ నాయకులు, కేంద్ర ప్రభుత్వం... ఇరువురితో సంప్రదింపులు జరిపి, నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టే ఏర్పాటు చేసిన సంఘ సభ్యుడొకరు, సుప్రీం ప్రధాన న్యాయ మూర్తికి తాజాగా లేఖ రాసి సంచలనం సృష్టించారు. తామిచ్చిన  నివేదికను బయటపెట్టాలని, ప్రతిష్టంభనను తొలగించి, సమస్యను పరిష్కరించేట్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయ స్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. తగిన సంప్రదింపులు లేకుండా, తమ ప్రయోజనాలకు వ్యతి రేకంగా తెచ్చిన ఆ మూడు చట్టాలను ఎత్తివేయాల్సిందేనని రైతాంగం పట్టుబట్టడంతో పోరాటం తీవ్రరూపం దాల్చినపుడు, గత జనవరిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.

చట్టాల అమలును పక్కనపెట్టమని కేంద్రాన్ని ఆదేశించింది. చట్టాలను మాత్రం ఎత్తివేసేది లేదని కేంద్రం భీష్మించి, ప్రతిష్టంభన ఏర్పడటంతో సుప్రీం ఒక కమిటీని నియమించి రెండు మాసాల్లో నివేదిక ఇవ్వాలంది.  మార్చి 19న సీల్డు కవర్‌లో ఆ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను సుప్రీం ఇంతవరకు విప్పలేదు.

చట్టాలు రైతు వ్యతిరేకమైనందున వాటిని పూర్తిగా ఎత్తివేయాలనేది ఒక వాదనైతే, అంత అవసరం లేదు సవరిస్తే చాలనేది మరోవాదన. మెజారిటీ రైతు సంఘాలు చట్టాలను ఎత్తివేయాలనే కోరుతున్నాయి. భారత్‌ కిసాన్‌ సంఘ్‌ మాత్రం, ఆ మేరకు సవరిస్తే చాలంటోంది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదనేది పాలకపక్షపు అనుకూల రైతు సంఘం వాదన. రైతుకు గిట్టుబాటు ధర (ఆర్పీ) లభించాలని, శాస్త్రీయంగా దాన్ని ఖరారు చేసి, వ్యవసాయో త్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియకు చట్టబద్ధత తీసుకురావాలని ఈ సంఘం కోరు తోంది. ప్రభుత్వమైనా, ప్రయివేటు వ్యాపారులైనా... రైతు ఉత్పత్తుల్ని ముందే ఖరారు చేసిన గిట్టు బాటు ధరకు తగ్గి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించి, ఆ మేర శిక్షించాలని కూడా డిమాండ్‌ చేస్తోంది.

పెరిగే పెట్టుబడి వ్యయాన్ని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని సదరు గిట్టుబాటు ధర ఖరారు చేయాలనే వాదన సముచితం. అది లేక, దేశానికి అన్నం పెట్టే రైతు నానాయాతన అనుభవించాల్సి వస్తోంది. రైతు ఆదాయం రెట్టింపేమో కానీ, ఉత్పత్తి వ్యయంలో 40, 50 శాతం కూడా లభించక రైతు అప్పుల్లో పడి కునారిల్లుతున్నాడు. తమనీ దుస్థితికి తెచ్చిన పాలకపక్షాల పట్ల ఆగ్రహమే కాకుండా తమ శ్రమశక్తిని దోచుకోజూస్తున్న కార్పొరేట్లపై కోపం కూడా రైతు ఉద్యమానికి కొత్త ఊపిరులు పోస్తోంది.

కేంద్రం, అది తెచ్చిన కొత్త చట్టాలే ఊతంగా... వ్యవసాయోత్పత్తులతో పాటు, వాటి నిల్వ, మార్కెటింగ్‌ రంగాల్లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వస్తున్న కార్పొరేట్‌ శక్తులనూ రైతు ఉద్యమాలు లక్ష్యం చేసుకుంటున్నాయి. మద్దతు పెరగటంతో బలోపేతమౌతున్నాయి. రేపటి పరిస్థితేమిటో వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు