‘ఫెడరల్‌’ పరిరక్షణ ముఖ్యం

29 Oct, 2022 02:06 IST|Sakshi

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను మరింత పటిష్ఠం చేయబోతున్నామనీ, వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాని విభాగాలుంటాయనీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేరశిక్షా స్మృతి(సీఆర్‌పీసీ)లకు సవరణలు కూడా చేస్తామన్నారు. హరియాణాలోని సూరజ్‌కుంద్‌లో ముఖ్యమంత్రులు, హోంమంత్రులు పాల్గొన్న మేధోమథన సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్‌ఐఏ విస్తరణ, నేరాల స్వభావం మారు తున్న తీరు గురించి అమిత్‌ షా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించాల్సిన అవసరం లేదు.

ఉగ్రవాదం సైబర్‌ ప్రపంచంలో కూడా స్వైరవిహారం చేస్తూ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుండటం రహస్యమేమీ కాదు. కనుక అమిత్‌ షా అన్నట్టు నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యతే. అయితే తీసుకురాదల్చిన ఏ మార్పుల విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకోవటం, వాటి మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులకు సిద్ధపడటం అవసరమని కేంద్రం గుర్తించాలి. ముంబై మహానగరంపై ఉగ్ర దాడి నేపథ్యంలో 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎన్‌ఐఏ చట్టాన్ని తెచ్చింది.

ఒక రాష్ట్రానికి చెందిన ఉగ్రవాదులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించి అలజడులు సృష్టించటం, వేరే దేశాల ఉగ్రవాదులు చొరబడి విధ్వంసక చర్యలకు పాల్పడటం వంటి తీవ్ర నేరాల అణచివేతకు సాధారణ పోలీసు విభాగాలు సరిపోవనీ, సీబీఐపై ఇప్పటికే ఉన్న ఒత్తిళ్ల వల్ల అది కూడా ఈ తరహా నేరాలపై దృష్టి కేంద్రీకరించలేదనీ అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఎన్‌ఐఏకు విశేషాధికారాలు ఇవ్వటం కోసం తాను ‘రాజ్యాంగ పరిమితులను అతిక్రమించే ప్రమాదకరమైన విన్యాసం చేయ వలసి వస్తున్నద’ని అప్పటి అమెరికా ఎఫ్‌బీఐ చీఫ్‌ రాబర్ట్‌ మ్యూలర్‌తో 2009లో నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వాపోయినట్టు 2011లో బయటపడిన వికీలీక్స్‌ టేపుల్లో వెల్లడైంది. ఎన్‌ఐఏ ఏర్పాటు వ్యవహారం ఎంత సున్నితమైనదో ఈ అభిప్రాయమే చెబుతోంది. 

రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తున్నదని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీయే పలుమార్లు ధ్వజమెత్తారు. ఆయన నాయకత్వంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, కేరళ తదితర విపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపించటం రివాజైంది. రాష్ట్రాల ఆదాయవనరులు కుదించటం మొదలుకొని పలు రంగాల్లో కేంద్రం జోక్యం పెరుగుతున్నదనీ, రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారుస్తున్నారనీ ఆ ఆరోపణల సారాంశం.

వీటన్నిటికీ పరాకాష్ఠ ఎన్‌ఐఏపై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌ దాఖలు చేసిన పిటిషన్‌. తమ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ చట్టం తెచ్చిందన్న సంగతి కూడా మరిచి శాంతిభద్రతల పరిరక్షణ వ్యవహారంలో చట్టం తెచ్చే అధికారం పార్లమెంటుకు ఎక్కడిదని ఛత్తీస్‌గఢ్‌ ప్రశ్నించింది. నిజానికి ఎన్‌ఐఏ చట్టం తెచ్చినప్పుడే ఆ చర్య రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవటం అవుతుందన్న సంగతి చిదంబరానికి తెలుసు. మ్యూలర్‌ దగ్గర చిదంబరం వాపోవటం దీన్ని దృష్టిలో ఉంచుకునే.

నేరాల దర్యాప్తులో రాష్ట్రానికుండే అధికారాలను ఎన్‌ఐఏ చట్టం హరిస్తున్నదని ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన ఆరోపణ. ఎన్‌ఐఏకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి, దాన్ని మరింత కఠినతరం చేస్తూ 2019లో ఎన్‌డీఏ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏకు కూడా సవరణలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ సవాలు చేసింది ఈ సవరణలను కాదు. మొత్తం ఎన్‌ఐఏ చట్టమే ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తుందని వాదించింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్న సంగతలా ఉంచి, ఎన్‌ఐఏ తీరుతెన్నుల విషయంలో రాజకీయ పక్షాల నుంచి, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.

సాధారణ పౌరులకు ఫెడరలిజం వంటి అంశాలపై పెద్ద పట్టింపు లేకపోవచ్చు. కానీ రాష్ట్రాలు శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా వ్యవహరించలేవనీ, ఉగ్రవాదంవంటి అంశాల్లో దర్యాప్తు కోసం వాటి అనుమతి తీసుకోవటంలో అపరిమితమైన జాప్యం చోటుచేసు కుంటున్నదనీ నిర్ధారించేందుకు అవసరమైన డేటా కేంద్రం దగ్గర ఉన్నదా? ఇటీవలే జరిగిన కొయం బత్తూరు పేలుడుకు సంబంధించి తమిళనాడు పోలీసులు చురుగ్గా స్పందించి, ఎన్‌ఐఏ ఆ కేసును తీసుకొనే లోపే ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రమూ ఉపేక్షించదని ఈ ఉదంతం చెబుతోంది.

స్వేచ్ఛాయుత సమాజాలను భయకంపితం చేయటం, రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నపరచటం ఉగ్రవాదుల ఆంతర్యం. అందుకు దీటుగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటం, పకడ్బందీ దర్యాప్తు జరిపి నేరగాళ్లకు శిక్షపడేలా చూడటం అవసరం. అలాగే న్యాయవ్యవస్థను పటిష్టం చేయటం ముఖ్యం. ఇలాంటి చర్యలు ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయ గలవు తప్ప చట్టాలను మరింత కఠినం చేసు కుంటూ పోవటం పరిష్కారం కాదు.

ఎన్‌ఐఏను పటిష్టపరచటం, బ్రిటిష్‌ వలసపాలకుల కాలంలో పుట్టుకొచ్చిన ఐపీసీ, సీఆర్‌పీసీ లను ప్రక్షాళన చేయటం వంటి అంశాల్లో పార్లమెంటులోనే కాదు, వెలుపల కూడా సమగ్ర చర్చ జరిగేలా చూడాలి. రాష్ట్రాల అభీష్టాన్నీ, పౌర సమాజం అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసు కోవాలి. తీసుకొచ్చే ఏ మార్పులైనా ఫెడరల్‌ వ్యవస్థకు విఘాతం కలగని రీతిలో ఉండాలి. 

మరిన్ని వార్తలు