నలభయ్యారు రోజుల పండుగ!

6 Oct, 2023 00:07 IST|Sakshi

నలభై ఆరు రోజులు... 48 మ్యాచ్‌లు... దేశంలోని 10 వేర్వేరు నగరాలు... 10 అంతర్జాతీయ క్రికెట్‌ జట్లు. ఒక క్రీడా సంరంభానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? అక్టోబర్‌ 5న ఆరంభమైన ఐసీసీ పురుషుల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌–2023 కచ్చితంగా మరో పెద్ద ఆటల పండుగ. ఒక పక్కన చైనాలో ఆసియా క్రీడోత్సవాల హంగామా సాగుతుండగానే మన గడ్డపై మరో సందడి మొదలైపోయింది. నాలుగేళ్ళకు ఓసారి సాగే అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్‌ షురూ అయింది.

నిరుటి ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ ఈసారీ బలమైన జట్టుగా ముందుకు వస్తుంటే, సొంతగడ్డపై సాగుతున్న పోటీలో కప్పు కొట్టాలనే ఒత్తిడి భారత జట్టుపై ఉంటుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సైతం బలమైన పోటీదార్లుగా నిలుస్తుంటే, ఆఖరు నిమిషంలో తడబడతారనే పేరున్న దక్షిణాఫ్రికా జట్టు ‘అనూహ్యమైన గెలుపుగుర్రం’ కావచ్చని ఓ అంచనా. గత వరల్డ్‌ కప్‌లో లానే పోటీలో పాల్గొనే పది జట్లూ లీగ్‌ దశలో పరస్పరం తలపడే ఈ ప్రపంచపోటీ రానున్న నెలన్నర కాలంలో విస్తృత చర్చనీయాంశం కానుంది. 

యాభై ఓవర్ల ఈ వన్డే మ్యాచ్‌ల వరల్డ్‌ కప్‌కు గతంలో 1987, 1996, 2011ల్లో భారత్‌ ఆతిథ్యమిచ్చింది. అయితే, అప్పుడు ఉపఖండంలోని ఇతర దేశాల సహ ఆతిథ్యంలో అవి సాగాయి. కానీ, ఈసారి పూర్తిగా మనమే ఆతిథ్యమిస్తున్నాం. సరిగ్గా దసరా, దీపావళి పండుగ సీజన్‌లోనే వరల్డ్‌ కప్‌ రావడంతో తమకు కలిసొస్తుందని ప్రకటనకర్తలు భావిస్తున్నారు. తమ ఉత్పత్తుల కొనుగోళ్ళు పెరుగుతాయని బ్రాండ్‌లన్నీ ఉత్సాహపడుతున్నాయి. దానికి తోడు ఆతిథ్య దేశం భారత్‌ కావడంతో ఉత్పత్తుల ప్రచారం మరింతగా జనంలోకి చొచ్చుకుపోతుందని భావిస్తున్నాయి.

ఈ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో సింహభాగం తాజా వరల్డ్‌ కప్‌కు అధికారిక మీడియా హక్కులున్న డిస్నీ స్టార్‌కు చేరుతుంది. పలు బ్రాండ్లు టీవీ, డిజిటల్‌ వేదికల్లో స్పాన్సర్‌షిప్‌ కోసం డిస్నీస్టార్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నాకౌట్‌ మ్యాచ్‌ల వేళ టీవీలో 10 సెకన్ల ప్రకటన ఇప్పుడు రూ. 30 లక్షల పైనే అని వార్త. ఈ వరల్డ్‌ కప్‌తో ప్రయాణ, పర్యాటక, ఆతిథ్య, ఆహార రంగాలు ప్రధానంగా లబ్ధి పొందుతాయని నిపుణుల విశ్లేషణ. మ్యాచ్‌ల పుణ్యమా అని ఇప్పటికే విమాన టికెట్ల రేట్లు, హోటల్‌ బస రేట్లు భారీగా పెరిగాయి. దేశ స్టాక్‌ మార్కెట్‌పైనా గణనీయమైన ప్రభావం ఉంటుందని అంచనా. 

సినిమా, క్రికెట్‌లంటే ప్రాణాలిచ్చే భారత్‌లో మామూలుగా అయితే, వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అంటే చంద్రమండల యాత్ర అంత సంబరం ఉండాలి. విచిత్రంగా ఈసారి ఎందుకనో ఆ క్రేజు వ్యాపారంలోనే తప్ప వ్యవహారంలో కనిపించట్లేదు. మన దేశమే పూర్తిగా ఆతిథ్యమిస్తున్నప్పటికీ, తాజా కప్‌కు ముందస్తు హంగామా అంతగా లేదు. దాదాపు లక్షా 30 వేల మంది కూర్చొనే సౌకర్యంతో ప్రపంచంలోనే పెద్ద క్రికెట్‌ స్టేడియమ్‌గా పేరొందిన అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియమ్‌లో గురువారం అంతా కలిపి 20 వేల మంది కూడా లేరు.

ఆది నుంచీ ఆన్‌లైన్‌లో కొనడానికి టికెట్లు దొరకలేదు గానీ, తీరా మ్యాచ్‌ రోజున మైదానమంతా ఖాళీగా ఉంది. లార్డ్స్‌లో గత 2019 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో హోరాహోరీగా తలపడ్డ న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ తాజా ప్రపంచ కప్‌ను ప్రారంభించారు. కానీ లాభం లేకపోయింది. భారత జట్టుతో తొలి మ్యాచ్‌ మొదలుపెడితే ఊపు వచ్చేదేమో! నిజానికి, 1999 నుంచి ఐసీసీ వరల్డ్‌ కప్‌గా పేరుబడ్డ ఈ పోటీల్లో ఆతిథ్యదేశం ఆరంభమ్యాచ్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అదెందుకు మార్చారో తెలియదు. 

ఈసారి మ్యాచ్‌ టికెట్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఆఖరి నిమిషంలో మ్యాచ్‌ల తేదీలు, వేదికలు మారిపోయాయి. ఇవి చాలదన్నట్టు 2000లల్లో టీ20 మ్యాచ్‌లకు అలవాటు పడ్డ కొత్త తరానికి ఐపీఎల్‌ సరికొత్త నంబర్‌ వన్‌ టోర్నమెంట్‌గా అవతరించింది. వెరసి, 2011లో భారత్‌ ఆతిథ్యమిచ్చినప్పటితో పోలిస్తే పన్నెండేళ్ళ తర్వాతి ఈ వరల్డ్‌ కప్‌ ఆ స్థాయి హడావిడి సృష్టించట్లేదు. అలాగే, గతంలో వరల్డ్‌ థీమ్‌సాంగ్‌ ప్రతి ఛానల్‌లో మోత మోగేది. ఈసారి రణ్‌బీర్‌ సింగ్‌తో చేసిన ‘దిల్‌ జష్న్‌ బోలే...’ పాట విఫలమైంది. ఇక, మైదానం వెలుపల అవలక్షణాలకు కొదవ లేదు.

ఐసీసీ వార్షిక ఆదాయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ) వాటా 72 శాతానికి పెరిగింది. మిగతా దేశాల క్రికెట్‌ బోర్డులు బాగా వెనకబడ్డాయి. దాంతో, ఎప్పటిలానే బీసీసీఐ తన హజం చూపిస్తోంది. బీసీసీఐ అక్రమాలకు నెలవంటూ సుప్రీమ్‌ కోర్ట్‌ వేసిన ముగ్గురు సభ్యుల సంఘం నివేదిక లోపాలెత్తిచూపినా అది తన పంథా మార్చుకోలేదు. చిత్రంగా అధికారిక అమ్మకాలు మొదలైనా కాక ముందే టికెట్లు ‘అమ్ముడైపోయాయి’ అని బోర్డులు వెలిశాయి. మచ్చుకు, అహ్మదాబాద్‌లోని అదే భారీ స్టేడియమ్‌లో జరిగే భారత – పాకిస్తాన్‌ మ్యాచ్‌కు 8500 టికెట్లే అమ్మకానికి పెట్టారంటే ఏమనాలి?

భారీ క్రికెట్‌ వేదికలైన ముంబయ్, కోలకతాలను వెనక్కినెట్టి, ఈసారి అహ్మదాబాద్‌ ముందుకు రావడంలోనూ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఆటకు సంబంధం లేని ఇతర ప్రయోజనాలను పక్కనపెట్టి, భారత్‌ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి ఇది మరో అవకాశం. జీ20 సదస్సు నిర్వహణ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరోసారి మన పేరు మోగడానికి మంచి సందర్భం. దాన్ని చేజార్చుకోకూడదు.

1975లో మొదలైనప్పటి నుంచి ఆతిథ్య దేశాలేవీ కప్‌ గెల్చుకోలేదన్న వాదనను 2011 ఏప్రిల్‌లో మన ధోనీ సేన సమర్థంగా తిప్పికొట్టింది. తర్వాత 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్‌లు అదే బాటలో నడిచాయి. కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్యా లాంటి బ్యాట్స్‌మన్లు, బుమ్రా, షమీ, షిరాజ్‌ లాంటి పేసర్లు, అశ్విన్, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి స్పిన్నర్లతో పటిష్ఠమైన రోహిత్‌ సేన ఆ కథ పునరావృతం చేయాలని ఆశ. రాజకీయాల కన్నా ఆట, వ్యక్తిగత రికార్డుల కన్నా దేశం గొప్పదని గ్రహిస్తే, నిర్వాహకులైనా, ఆటగాళ్ళైనా అద్భుతాలు చేయడం అసాధ్యమేమీ కాదు! 

మరిన్ని వార్తలు