అసంపూర్ణ చర్చలు

25 Sep, 2020 01:00 IST|Sakshi

భారత–చైనాల మధ్య కోర్‌ కమాండర్ల స్థాయిలో జరిగిన ఆరో దఫా చర్చలు యధావిధిగా అసంపూర్తిగా ముగిశాయి. ఆ తర్వాత ఒక ఉమ్మడి ప్రకటన కూడా వెలువడింది. అయితే ఎప్పటిలాగే అది కూడా అస్పష్టంగానే వుంది. చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చొరబాటుకు దిగడానికి ముందున్న యధాపూర్వ స్థితి పునరుద్ధరణకు రెండు పక్షాలూ ఏం చర్యలు తీసుకో బోతున్నాయో, ప్రతిష్టంభన తొలగింపు కోసం తిరిగి చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తాయో అందులో చెప్పలేదు. సోమవారం ఉదయం 9.30 ప్రాంతంలో మొదలైన చర్చలు రాత్రి 10.30 వరకూ సాగాయంటే చాలా అంశాల విషయంలో ప్రతినిధి బృందాల మధ్య వాదోపవాదాలు జోరుగానే సాగివుంటాయనుకోవాలి. నెలన్నర వ్యవధి తర్వాత ఈ చర్చలు చోటుచేసుకున్నాయి. ఈసారి చర్చల్లో మన విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి హోదా స్థాయి అధికారి పాల్గొనడమే విశేషం. ఎల్‌ఏసీలో ప్రస్తుతం ఎలాంటి ఘటనా జరగటంలేదన్న మాటేగానీ.. ఉద్రిక్తతలు ఎక్కువే. ఎందుకంటే ఇరుపక్కలా చెరో 40,000మంది సైనికులు సర్వసన్నద్ధంగా వున్నారు. వారి వద్ద శతఘ్నులు, తుపాకులు, క్షిపణులు వున్నాయి. ఏ పక్షంనుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ఘర్షణలకు దారితీసే ప్రమాదం వుంది. కనుకనే చర్చలు త్వరగా కొలిక్కి వచ్చి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు.

ఎల్‌ఏసీ వద్ద రెండు దేశాల మధ్యా ఖచ్చితమైన, పరస్పర ఆమోదయోగ్యమైన సరిహద్దు లేనిమాట వాస్తవమే అయినా... దశాబ్దాలుగా ఇరు సైన్యాలు గస్తీ కాస్తున్న ప్రాంతాలు స్పష్టంగానే వున్నాయి. సైన్యం కదలికలు పూర్తిగా భౌగోళిక మ్యాప్‌లపై ఆధారపడి వుంటాయి గనుక పొరబడే అవకాశం లేనేలేదు. అందువల్లే మన దేశం చైనా సైన్యం తమ పాత ప్రాంతానికే పరిమితమై వుండాలని పట్టుబడుతోంది. ప్యాంగాంగ్‌ సో, చుశాల్, గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్, డెస్పాంగ్‌ ప్రాంతాలనుంచి చైనా వైదొలగాలని కోరుతోంది. అలా వైదొలగడానికి సంబంధించిన పథకమేమిటో చెప్పాలంటోంది. మిగిలిన ప్రాంతాల్లోకన్నా డెస్పాంగ్‌ వద్ద చైనా సైన్యం బాగా లోపలికి చొచ్చుకొచ్చింది. అది దాదాపు 15 కిలోమీటర్ల వరకూ వుంటుందంటున్నారు. అయితే మీరే ప్యాంగాంగ్‌ సో సరస్సు సమీపంలోని ఫింగర్‌–5, ఫింగర్‌–6 శిఖరాల నుంచి వైదొలగాలని చైనా డిమాండ్‌ చేస్తోంది. ఆ తర్వాతే తాము ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామంటోంది.  ఉమ్మడి ప్రకటనలో వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. చైనా వెనక్కు తగ్గడానికి నిరాకరించడాన్ని చూశాక మన సైన్యం గత నెలాఖరున ప్యాంగాంగ్‌ సో సరస్సు వద్ద వున్న కైలాష్‌ రేంజ్‌ శిఖరాల్లో భాగమైన ఫింగర్‌–5, ఫింగర్‌–6 శిఖరాలపై పట్టు సాధించింది. వ్యూహాత్మకంగా మన సైన్యం పైచేయి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. చైనా సైన్యం కదలికలు, వారు చేరేసుకుంటున్న ఆయుధాలు వగైరా సులభంగా తెలుస్తాయి. పశ్చిమంవైపు విస్తరించకుండా అడ్డుకునేందుకు అది దోహదపడుతుంది. కనుకనే ఇక్కడినుంచి వెనక్కు వెళ్లాలని చైనా పట్టుబడుతోంది.

ఉద్రిక్తతలు, ఘర్షణలు ఇరు దేశాలకూ ఏమాత్రం మేలు చేయబోవన్న అంశంలో రెండు దేశాలదీ ఒకే మాట. ఈ నెల 10న ఉభయ దేశాల విదేశాంగమంత్రులూ మాస్కోలో సమావేశమైనప్పుడు దీన్ని అంగీకరించారు. కనుకనే ఈసారి జరిగే కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో పురోగతి వుంటుందనుకున్నారు. అయితే ఈ స్థాయి చర్చలు ఎక్కువ సందర్భాల్లో దేశాధినేతలు వాస్తవ పరిస్థితిపై లోతైన అవగాహన పెంచుకోవడానికి, సరిహద్దు వివాదంలో అవతలి పక్షం ఉద్దేశాలేమిటో తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తుది పరిష్కారం లభించాలంటే అది అధినేతల మధ్య జరిగే చర్చల్లో మాత్రమే సాధ్యం. అధినేతలు కేవలం సైనిక కోణంలో మాత్రమే సమస్యను చూడరు. మొత్తంగా అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలు చూసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దేశానికి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందో తేల్చుకుంటారు. ఆ మేరకు తమ తమ సైన్యాలకు సూచనలిస్తారు. ఇప్పుడున్న సైనిక దళాల సంఖ్యను రెండు దేశాలూ పెంచకూడదన్న అంశంలో కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిందని ఉమ్మడి ప్రకటన చెబుతోంది. అయితే ఇప్పటికే అక్కడ చైనా అవసరమైనమేర సైన్యాన్ని పెంచుకుందనేది మరిచిపోకూడదు. 

అన్ని దేశాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ విభేదాలను తగ్గించుకోవాలని, వివాదాలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈమధ్య జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలనుద్దేశించి పంపిన వీడియో ప్రసంగంలో చెప్పారు. ఆ మాటల్లో చిత్తశుద్ధి ఎంతవుందో మన దేశమే కాదు... ప్రపంచమంతా గమనిస్తుంది. రెండు దేశాల రక్షణమంత్రులు, విదేశాంగమంత్రులు చర్చించుకున్నా కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో మెరుగైన పురోగతి లేకపోవడం అందరూ చూస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా దూకుడుకు కారణాలేమిటో తెలియనివారెవరూ లేరు. జమ్మూ–కశ్మీర్‌ ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటినుంచీ చైనా, పాకిస్తాన్‌లకు అది కంటగింపుగా వుంది. చైనా లద్దాఖ్‌లో చొచ్చుకొస్తే, పాకిస్తాన్‌ గిల్గిత్‌–బాల్టిస్తాన్‌కు సంబంధించిన కొత్త మ్యాప్‌ విడుదల చేసి వివాదం రేపాలని చూసింది. వారి ఉమ్మడి ఎజెండా సుస్పష్టం. 1979లో ఆనాటి చైనా అధినేత డెంగ్‌ జియావో పెంగ్‌ ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఉదారవాద విధానాలు ప్రారంభించినప్పుడు  చైనాలో ఏకస్వామ్య వ్యవస్థ బద్దలు కావడానికి అవి దోహదపడతాయని పాశ్చాత్య దేశాలు భావించాయి. కానీ తూర్పు చైనా సముద్రంలోనైనా, తూర్పు లద్దాఖ్‌లోనైనా చైనా తీరు చూస్తుంటే ఆ ఆర్థికాభివృద్ధి ఆంతర్యం ప్రపంచంపై పట్టు సాధించడానికేనన్న సంశయాలు కలుగుతున్నాయి. తమకా ఉద్దేశం లేదని నిరూపించుకునే బాధ్యత ఇప్పుడు చైనాదే.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా