అగ్నిపరీక్ష

3 Mar, 2022 01:03 IST|Sakshi

ప్రపంచం కుగ్రామంగా మారిన తర్వాత ఎక్కడో జరిగిన పరిణామం మరెక్కడో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ కఠిన వాస్తవం మన దేశానికి మరోసారి అనుభవంలోకి వస్తోంది. సరిగ్గా ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న భీకర దాడితో విదేశీ దౌత్యంలో కొత్త సవాళ్ళు, ఆ దేశంలో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్థుల దయనీయ గాథ, పెరిగిపోతున్న చమురు ధరలతో భారత్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకపక్క యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే, మరోపక్క దాడుల తీవ్రతను పెంచుతున్న రష్యాను దూరం చేసుకోలేని అనివార్యమైన విదేశాంగ నీతిలో ఒత్తిడికి గురవుతోంది. 

ఐరాస భద్రతా సమితి భేటీలోనూ, ఆపైన ఐరాస అత్యవసర సమావేశంలోనూ రష్యా వ్యతిరేక తీర్మానంలో ఓటింగ్‌కు భారత్‌ వ్యూహాత్మకంగా దూరంగా ఉంది. యుద్ధం వద్దనీ, చర్చలతో సమస్య పరిష్కారమే ముద్దనీ వివరించింది. వివరణలిచ్చినా దాన్ని రష్యా అనుకూల వైఖరిగానే పాశ్చాత్య ప్రపంచం విమర్శిస్తోంది. రక్షణ అవసరాలెన్నో ముడిపడిన చిరకాల మిత్రుడు రష్యాతో బంధం చెడగొట్టుకోలేని అనివార్యత భారత్‌ది. ఆంక్షలు ఎన్ని ఉన్నా భారత్‌తో రక్షణ ఒప్పందాలకు ఇబ్బంది లేదన్న ఆశ్వాసన రష్యాది. అయితే, రష్యన్‌ దాడి మారణహోమంగా మారుతున్న నేపథ్యంలో భారత్‌ తన వైఖరిని మార్చుకోవాలన్నది ఇంటా బయటా డిమాండ్‌. ప్రజాస్వామ్యాన్ని కోరుకొనే శాంతి కాముక దేశంగా నైతికతను నిరూపించుకోవాలనీ, బాధిత బలహీన దేశానికి అండగా నిలవాలనీ ఒత్తిడి పెరుగుతున్న వేళ రాగల కొద్ది వారాలు భారత దౌత్యనీతికి కత్తి మీద సాము కానుంది. 

మరోపక్క మంగళవారం రష్యన్‌ దాడిలో భారతీయ విద్యార్థి నవీన్‌ మరణించిన వైనం బాధా కరం. తినడానికి తిండి కోసం బయటకు వెళ్ళిన అన్నెంపున్నెం ఎరుగని వ్యక్తి అమానవీయంగా ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నీరు పెట్టిస్తుంది. స్వదేశంలో కన్నా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య విద్యను అభ్యసించవచ్చని ఆశతో వెళ్ళిన మన పిల్లలు కన్నవారికి దూరంగా, కంటి మీద కునుకు లేకుండా పడుతున్న కష్టాలు అనేకం. ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే చెడ్డపేరు ఇప్పటికే మోడీ సర్కారు మూటగట్టుకుంది. అయితే, ఆలస్యంగానైనా ‘ఆపరేషన్‌ గంగ’ పేరుతో విద్యార్థులను వెనక్కితెచ్చే ప్రక్రియను వేగవంతం చేయడం సంతోషకరం. వేల సంఖ్యలో ఉన్న మనవారి తరలింపు కోసం వాయుసేన విమానాలనూ, సమన్వయానికి నలుగురు కేంద్ర మంత్రులనూ రంగంలోకి దింపడం అభినందించాల్సిందే. అయితే, యుద్ధక్షేత్రాలైన నగరాల నుంచి వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణించి, సరిహద్దులకు చేరుకుంటారన్నది బేతాళ ప్రశ్న. 

ఇప్పటికి 26 విమానాల్లో 3300 మంది భారతీయులను ప్రభుత్వం వెనక్కి రప్పించినట్టు లెక్క. ఇంకా వేల మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. మూడు రోజులుగా 4 వేల మంది విద్యార్థులు సరిహద్దు ల్లోనే అవస్థ పడుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో తెచ్చిన కొద్ది మంది విద్యార్థుల వద్దకు విమానాల్లోకి వెళ్ళి మరీ మంత్రులు ప్రభుత్వ ఘనకీర్తి చెప్పడం, వందేమాతర నినాదాలు, వారణాసి ఎన్నికల సభల్లో ‘ఆపరేషన్‌ గంగ’ అద్భుతమంటూ దేశ ప్రధాని వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. విషాద వేళలోనూ ప్రచార విన్యాసాలు, సోషల్‌ మీడియోలో వైరలయ్యే భావోద్వేగాల కోసం పాలకులు ప్రయత్నించడమేమిటన్నది విమర్శకుల వాదన. ఎన్నో సవాళ్ళు ఉన్నాయన్నది అసలు నిజం. కీవ్‌ నుంచి బయటపడడానికి రైలులోకి ఎక్కిన భారత విద్యార్థులను దింపేసిన ఉక్రెయిన్‌ అధికారుల కథనాలు, సరిహద్దుల్లో విద్యార్థులపై ఉక్రెయిన్‌ సేనల దాష్టీకాలే అందుకు సాక్ష్యం.    

ఇప్పటికే రష్యా దాదాపు అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌ను కమ్మేస్తోంది. ఉత్తరాన రాజధాని కీవ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరం దాకా రష్యన్‌ సేనలు చొచ్చుకువచ్చాయి. ఈశాన్యాన ఖార్కివ్, తూర్పున డాన్‌బాస్, దక్షిణాన 2014 నుంచి తమ అధీనంలో ఉన్న క్రిమియా మీదుగా ఖెర్సన్, మారియాపోల్‌ నగరాలపై పట్టు బిగించినట్టు వార్త. ఉక్రేనియాలోని రెండో పెద్ద నగరం ఖార్కివ్‌ బుధవారం రష్యా బాంబుల దాడిలో ఛిన్నాభిన్నమైంది. ఈ చారిత్రక ప్రాధాన్య నగరం ఇప్పుడు కూలిన భవనాలు, కాలుతున్న ఇళ్ళు, చెల్లాచెదురుగా పడిన పదుల కొద్దీ మృతదేహాల మధ్య బావురుమంటోంది. నాలుగ్గంటల్లో విద్యార్థులు ఖార్కివ్‌ను కాలినడకనైనా సరే వదిలి వచ్చేయాలన్న భారత ప్రభుత్వ తాజా సూచన భవిష్యత్‌ తీవ్రతనూ చెబుతోంది.

రష్యాతో పోరు సాగిస్తూనే, అండగా నిలిచేవారి కోసం జెలెన్‌స్కీ వరస ఫోన్‌కాల్స్‌తో ప్రపంచ దేశాల తలుపులు తడుతూనే ఉన్నారు. కానీ, అమెరికా సహా పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యాపై ఆర్థిక ఆంక్షల మీదే ఇప్పటికీ ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సైన్యాలను ఉక్రెయిన్‌కు పంపేది లేదని చెప్పేస్తూనే, యుద్ధమనే ఘోర తప్పిదానికి పుతిన్‌ మూల్యం చెల్లించుకొనేలా చేస్తామన్నది అమెరికా అధ్యక్షుడి గర్జన. దీని వల్ల ఉక్రెయిన్‌కు తక్షణ ఉపశమనం శూన్యమే. అందుకే, ‘నాటో’లో చేరిక పేరుతో అమెరికా చూపిన కలల మేడకు ఆశపడి, రష్యాతో కయ్యం పెట్టుకున్న ఉక్రెయిన్‌ చివరకు ఇప్పుడు రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో పావుగా మారిందనే భావన కలుగుతోంది. భౌతిక యుద్ధంలో పై చేయి మాట ఎలా ఉన్నా, ఆంక్షలు, నిషేధాలతో ఆర్థికంగా, సామాజికంగా రష్యాను ఏకాకిని చేయాలన్న పాశ్చాత్య దేశాల సంకల్పం ఫలిస్తుందా? బుధవారం పొద్దుపోయాక మొదలయ్యే రెండో విడత శాంతి చర్చలు, ఆ పైన ఐరాస సర్వప్రతినిధి సభ సమా వేశం ఫలితం ఏమిటి? ‘నాటో’పై మొండిపట్టుతో ఉన్న పుతిన్‌ జోరు తగ్గేదెలా? వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు