ప్యార్‌ కియా తో డర్నా క్యా?

21 Aug, 2021 00:25 IST|Sakshi

ప్రేమించడం నేరం కాదు... ఘోరం కాదు... పాపం అసలే కాదు. స్వచ్ఛమైన ప్రేమ దేనికైనా భయపడాల్సిన పనేముంది? ‘ప్యార్‌ కియా తో డర్నా క్యా’ అంటూ అలనాటి మొఘల్‌ యువరాజు సలీమ్‌ను ప్రేమించిన అనార్కలీ నోట పాలకులకు కవి వేసిన ప్రశ్న అదే! కానీ మతాలు వేరైతే ప్రేమకైనా, పెళ్ళికైనా భయపడాల్సిందే అన్నది ఈనాటి ఆధునిక భారత పాలకుల అభిప్రాయంలా తోస్తోంది. విభిన్న మతాల వాళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకొంటే భయపడాల్సి వచ్చేలా యాంటీ ‘లవ్‌ జిహాద్‌’ చట్టాలూ వచ్చాయి. అలాంటి ఒక ఓటుబ్యాంకు చట్టంపై గుజరాత్‌ హైకోర్టు గురువారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు లౌకికవాదులకు ఒకింత సంతోషం కలిగిస్తున్నాయి. 

గుజరాత్‌ సర్కారు 2003 నాటి మతస్వాతంత్య్ర చట్టాన్ని ఆ మధ్య సవరిస్తూ, కొత్తగా అనేక అంశాలు చేర్చింది. అందులోని ఆరు నిరంకుశ సెక్షన్లను అడ్డగోలుగా అమలు చేయరాదని కోర్టు ఇప్పుడు పేర్కొంది. పదేళ్ళ జైలు, 5 లక్షల జరిమానాలే కాక, అసలు పెళ్ళే చెల్లదనేలా పాలకులు చట్టసవరణలు చేశారు. అది పౌరుల ప్రాథమిక హక్కయిన మత స్వాతంత్య్రానికి భంగమంటూ కేసు దాఖలైంది. మోసం చేసో, బలవంతపెట్టో, ప్రలోభపరిచో మతాంతర వివాహం చేస్తే తప్పు. అందుకు సాక్ష్యాలు లేకుండా ప్రతి పెళ్ళినీ ‘చట్టవిరుద్ధమైన మతమార్పిడి పెళ్ళి’గా అభివర్ణించడానికి వీలు లేదని కోర్టు తేల్చింది. వెరసి, ఈ ఏడాది ఏప్రిల్‌ 1న అసెంబ్లీలో ఆమోదించి, ఈ జూన్‌ 15న గుజరాత్‌ సర్కారు చేసిన నిరంకుశ సవరణలకు అడ్డుకట్ట పడింది. ఉత్తరప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో అమలులో, ఆలోచనల్లో ఉన్న ఇదే తరహా యాంటీ ‘లవ్‌ జిహాద్‌’ చట్టాలపై మళ్ళీ చర్చ మొదలైంది. 

కర్ణాటకలోని ప్రమోద్‌ ముతాలిక్‌ సారథ్యంలోని ‘శ్రీరామ్‌సేనె’ కొన్నేళ్ళ క్రితం సృష్టించిన పదం ‘లవ్‌ జిహాద్‌’. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాకముందు యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యం వహించిన ‘హిందూ యువవాహిని’ కూడా మతాంతర వివాహాలను భగ్నం చేస్తూ వచ్చింది. సీఎం అయ్యాక నిరుడు ఆదిత్యనాథ్‌ యూపీలో యాంటీ ‘లవ్‌ జిహాద్‌’ చట్టమే తెచ్చారు. వయసొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే, మతాలు వేరైనా సరే పెళ్ళి చేసుకోవడం నేరం కాదని మన సుప్రీమ్‌ కోర్టు, హైకోర్టులు పదే పదే స్పష్టం చేశాయి. మతాంతర వివాహాల ద్వారా మతమార్పిడి కుట్ర జరుగుతోందన్న వాదననూ కొట్టేశాయి. ఆ మధ్య హదియా, షఫీ జహాన్‌ కేసులో మతాంతర వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పునిస్తే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పే చెల్లదని చెప్పడం గమనార్హం. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాలతో కొందరు పాలకులు ఇలాంటి అంశాలను పెడచెవిన పెడుతున్నారు. 

మతమార్పిడి కోసమే బలవంతాన పెళ్ళి చేసుకున్నారని ఎవరైనా ఆరోపణలకు గురైతే, ఆ నిందితులే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని గుజరాత్‌ సర్కారీ చట్టం చెబుతోంది. ఇది విస్మయం కలిగిస్తోంది. అసలైతే ఆరోపణలు చేసినవారే వాటిని రుజువు చేయాలనేది 150 ఏళ్ళుగా అమలులో ఉన్న ‘1872 నాటి భారతీయ సాక్ష్యాధార చట్టం’. దానికి విరుద్ధంగా గుజరాతీ యాంటీ ‘లవ్‌ జిహాద్‌’ చట్టంలో సెక్షన్‌ 6ఏ లాంటివి చోటుచేసుకోవడం విడ్డూరం. ఆ మాటకొస్తే, ‘లవ్‌ జిహాద్‌’ మాటనే కేంద్రం గుర్తించడం లేదనీ, ఏ చట్టంలోనూ నిర్వచించనే లేదనీ హోమ్‌ శాఖ నిరుడు వివరణ ఇచ్చినట్టు భోగట్టా. కానీ, మెజారిటీ మతానికి చెందిన ఆడపిల్లలకు వల వేసి, పెళ్ళి పేరుతో పెద్దయెత్తున మరో మతంలోకి మార్చేస్తున్నారనీ, ఇది ‘ప్రేమ పేరిట సాగుతున్న మతయుద్ధం’ (లవ్‌ జిహాద్‌) అనీ వస్తున్న ఆరోపణలు ఆగట్లేదు. ఇప్పటికీ మన దేశంలో అయిదింట నాలుగు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే. అయినాసరే, వాట్సప్‌లో లక్షల మందికి ఈ విద్వేష ప్రచారం యథేచ్ఛగా సాగుతూనే ఉంది. 

దాదాపు 1300 ఏళ్ళ పైగా మతసామరస్యం వెల్లివిరుస్తున్న దేశంలో ఈ ‘వాట్సప్‌ యూనివర్సిటీలు’ అసలు చరిత్ర పేరిట కొత్త కథలు వండి వారుస్తున్నాయి. మధ్యయుగాల నాటి మైనారిటీ పాలకులకు, నేటి తరం మైనారిటీలు నకళ్ళు అంటూ లేనిబూచిని చూపెడుతున్నాయి. 2022లో రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు, ఆపై 2024లో జరిగే సాధారణ ఎన్నికల వరకూ ఈ విద్వేష ప్రచారం ఇలాగే సాగడం ఖాయమని అంచనా. దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలలో అతి పెద్ద వర్గమైన ముస్లిమ్‌లను ఇరుకున పెట్టడానికే ఇదంతా అని మైనారిటీల వాదన. పౌరసత్వ చట్టాలు, ‘లవ్‌ జిహాద్‌’ లాంటి అసత్యాలు, గో సంరక్షణ పేరిట దాడులు అందుకు ఉదాహరణలని వారి ఆరోపణ. వారి అనుమానాలు పూర్తిగా అర్థరహితమని అనలేం.

ఒకటి మాత్రం నిజం. దేశంలో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ మతం పేరిట మనుషుల్లో విద్వేషం రగిల్చి, మనసు విరిచి, మెజారిటీలను సంఘటిత ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఇలాంటి ‘లవ్‌ జిహాద్‌’ ఆరోపణలు బాగా పనికొస్తాయి. అది దృష్టిలో పెట్టుకొనే, మెజారిటీ వర్గాల ఏకైక పరిరక్షకులమనే ముద్ర కోసం కొన్ని రాష్ట్రాలు ఇలా మత మార్పిడి నిరోధక చట్టాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇష్టమైనవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకొనే మానవ స్వేచ్ఛకు ఇవన్నీ తీవ్ర అవరోధం. పెళ్ళంటే ‘మూడే ముళ్ళు... ఏడే అడుగులు... మొత్తం కలిసి నూరేళ్ళు’ అంటారు మనసు కవి. మనసులు కలసిన ఇద్దరు మనుషులు నూరేళ్ళ జీవితం కలసి నడవాలనుకున్నప్పుడు కులం, మతం లాంటి అడ్డుగోడలు పెట్టాలనుకోవడం అసలు సిసలు మధ్యయుగపు మనస్తత్వం. ఆధునిక ప్రభుత్వాల అడ్డగోలు చట్టాల వల్ల లౌకికవాద సమాజంలో శాశ్వతంగా చీలికలొస్తే ఆ పాపం ఎవరిది? సహనం, సమానత్వం, సామరస్యమే ప్రాణధాతువులైన మన జాతి మనోఫలకంపై ఇవన్నీ మాయని మరకలుగా మిగిలిపోతే, దానికి ప్రాయశ్చితం ఏమిటి? పాలకులారా... కళ్ళు తెరవండి!  

మరిన్ని వార్తలు