NASA DART Mission: అసాధారణ విజయం

29 Sep, 2022 00:28 IST|Sakshi

తోకచుక్కలు, ఉల్కలు, గ్రహశకలాలు వగైరాల నుంచి భూగోళాన్ని రక్షించే ప్రయత్నంలో పడిన తొలి అడుగు మంగళవారం విజయవంతం కావడం శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు, ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి గలవారందరికీ ఉత్సాహాన్నిచ్చింది. గత నవంబర్‌లో నాసా శాస్త్రవేత్తలు డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీ డైరెక్షన్‌ టెస్ట్‌ (డార్ట్‌) పేరుతో ప్రయోగించిన ఉపగ్రహం అందించిన విజయం అసాధారణమైంది.

అది అంతరిక్షంలో పది నెలలు ప్రయాణించడం, శాస్త్రవేత్తల ఆదేశాలకు అనుగుణంగా నిర్దేశిత కక్ష్యలో, నిర్దేశిత వేగంతో మునుముందుకు దూసుకుపోవడం, కాస్తయినా తేడా రాకుండా అత్యంత కచ్చితంగా వారు చెప్పిన చోటే, చెప్పిన సమయానికే డైమార్ఫస్‌ అనే ఫుట్‌బాల్‌ గ్రౌండంత సైజున్న ఒక గ్రహశకలాన్ని ఢీకొట్టడం ఖగోళ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. డిడిమోస్‌ అనే మరో గ్రహశకలం చుట్టూ ఈ డైమార్ఫస్‌ పరిభ్రమిస్తోంది. ఈ జంట శకలాల్లో సరిగ్గా డైమార్ఫస్‌ని శాస్త్రవేత్తలు లక్ష్యంగా చేసుకున్నారు. 

అంతరిక్షం నుంచి భూగోళానికి రాగల ముప్పు గురించిన భయాందోళనలు ఈనాటివి కాదు. 1908లో సైబీరియాలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచ ప్రజానీకాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. అక్కడి అటవీ ప్రాంతంలో గ్రహశకలం భూమిని ఢీకొట్టడం, పెను విస్ఫోటనం సంభవించి క్షణకాలంలో 10 కిలోమీటర్ల మేర సర్వనాశనం కావడం మానవాళి మస్తిష్కంలో నమోదైన తొట్ట తొలి ఖగోళ సంబంధ భయానక ఉదంతం.

మన పుడమికి ఎప్పటికైనా ముప్పుంటుందన్న ఆందోళనకు అంకురార్పణ పడింది అప్పుడే. ఆ తర్వాత ఏమంత చెప్పుకోదగ్గ ఉదంతాలు లేవు. కానీ 2013 ఫిబ్రవరిలో రష్యాలోనే యురల్‌ పర్వతశ్రేణి ప్రాంత పట్టణాలు ఆరింటిని చెల్యాబిన్స్క్‌ గ్రహశకలం వణికించింది. కేవలం 66 అడుగుల నిడివున్న ఈ గ్రహశకలం భూవాతావరణంలోకి ప్రవేశించగానే విచ్ఛిన్నమై, ఉల్కాపాతంగా ముట్టడించడంతో ఆ పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి.

గంటకు 69,000 కిలోమీటర్ల వేగంతో ఆ గ్రహశకలం వచ్చిందని అప్పట్లో శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమేమంటే అదే రోజు 2012 డీఏ 14 పేరుగల మరో గ్రహశకలం రాక కోసం నిరీక్షిస్తున్న శాస్త్రవేత్తలకు పిలవని పేరంటంలా వచ్చిపడిన ఈ గ్రహశకలం ఊపిరాడకుండా చేసింది. ఈ ఉల్కాపాతంలో పౌరులెవరూ మరణించకపోయినా దాని పెనుగర్జన ధాటికి ఇళ్ల కిటికీ అద్దాలు పగిలి 1,500 మంది గాయపడ్డారు. ఆరు పట్టణాల్లోనూ 7,200 ఇళ్లు దెబ్బతిన్నాయి. 

తోకచుక్కలూ, గ్రహశకలాల తాకిడికి గురికాని గ్రహాలు ఈ విశాల విశ్వంలో లేనేలేవు. అవి పెను విధ్వంసకారులే కావొచ్చుగానీ... కేవలం వాటి పుణ్యానే ఈ పుడమి తల్లి ఒడిలో జీవరాశి పురుడు పోసుకుంది. తోకచుక్కలో, పెను గ్రహశకలాలో తమ వెంట మోసుకొచ్చిన కీలకమైన కర్బన మిశ్రమాలూ, నీరూ జీవరాశి పుట్టుకకూ, వాటి అభివృద్ధికీ కారణమని శాస్త్రవేత్తలు చెబుతారు. దాదాపు 400 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరిణామమే విశ్వంలో భూగోళానికి విలక్షణత తీసుకొచ్చింది.

ఇదే మాదిరి  ఉదంతం ఈ విశాల విశ్వంలో మరోచోట జరిగే అవకాశం లేకపోలేదన్న అంచనాతో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. వారి అంచనా నిరాధారమైంది కాదు. మన పాలపుంత లోనే దాదాపు 4,000 కోట్ల నక్షత్రాలున్నాయంటారు. ఇలాంటి తారామండలాలు ఈ విశ్వంలో వంద కోట్లు ఉంటాయని ఒక అంచనా. కనుక అచ్చం భూమిపై చోటుచేసుకున్న పరిణామం వంటిదే మరోచోట జరగకపోవచ్చని చెప్పడానికి లేదు.

లక్షలాది నక్షత్రాలు, గ్రహాలు పరిభ్రమిస్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే ధూళి కణాలు మేఘాలై, ఆ మేఘాలు కాస్తా కోట్ల సంవత్సరాల్లో గ్రహాలుగా రూపాంతరం చెందడం సాధారణం. ఆ క్రమంలో కొన్ని శకలాలు విడివడి ఇతర గ్రహాలకు ముప్పు తెస్తూ ఉంటాయి. గురు గ్రహానికీ, అంగారకుడికీ మధ్య ఇలాంటివి అసంఖ్యాకం. ఆ కోణంలో మన భూగోళం సురక్షితమనే చెప్పాలి. 

అయితే ఇటీవల మనవైపుగా వచ్చిన గ్రహశకలాలు సంఖ్యాపరంగా కాస్త ఎక్కువే. అవి భూమికి లక్షలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నా శాస్త్రవేత్తల దృష్టిలో సమీపం నుంచి పోయే గ్రహశకలాల కిందే లెక్క. భూకక్ష్యకు నాలుగున్నర కోట్ల కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే గ్రహశకలాలను భూమికి సమీపంగా పోతున్నవాటిగా పరిగణిస్తారు. మన సౌర కుటుంబంలో మొత్తం ఆరు లక్షల గ్రహ శకలాలున్నాయని ఒక లెక్క.

అందులో కనీసం 20,000 భూ సమీప వస్తువులు (నియో)–అంటే గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే అందులో భూమికి ముప్పు తెచ్చిపెట్టేవి అతి తక్కువ. అయినా కూడా ఏమరుపాటు పనికిరాదన్నది వారి హెచ్చరిక. టెక్సాస్‌ నగరం నిడివిలో ఉండి భూగోళాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న గ్రహశకలంపై కొన్నేళ్లక్రితం వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘ఆర్మెగెడాన్‌’ను ఎవరూ మరిచిపోరు.

శాస్త్రవేత్తలు సమష్టిగా కృషిచేసి ఆ గ్రహశకలం గర్భంలో అణుబాంబును ఉంచి దాన్ని పేల్చేయడం ఆ సినిమా ఇతివృత్తం. ఇప్పుడు డార్ట్‌ ప్రయోగం ఒక రకంగా అటువంటిదే. ఉపగ్రహాన్ని ఢీకొట్టించి దాని కక్ష్యను 1 శాతం తగ్గిస్తే దాని పరిభ్రమణ కాలాన్ని పది నిమిషాలు కుదించవచ్చని, దాంతో కక్ష్య స్వల్పంగా మారవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవంగా ఏం జరిగిందో తెలియడానికి మరికొన్ని వారాలు పడు తుంది. ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని విజయాలకు బాటలు పరుస్తుందని, భవిష్యత్తులో ధూర్త శకలాలను దారిమళ్లించి పుడమి తల్లిని రక్షించుకోవడం సాధ్యమేనని ఆశించాలి. 

మరిన్ని వార్తలు