National Service Scheme 2021: గ్రామాల దత్తత: సేవాధీరలు

29 Sep, 2022 00:19 IST|Sakshi
∙భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్‌ బెస్ట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు అందుకుంటున్న సిరిశ్రీ దేవనపల్లి; డాక్టర్‌ సుంకరి జ్యోతి (ఫైల్‌ ఫొటో)

ఈ నెల 24వ తేదీ, జాతీయ సేవాపథకం ఆవిర్భావ దినోత్సవం. మన దేశరాజధాని నగరంలోని రాష్ట్రపతి భవనం 2020–21జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి వేదికైంది. విశిష్ట సేవలందించిన నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఆనంద తరుణం. ఆ సంతోషంలో మన తెలుగు మహిళలు ఇద్దరున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అనంతపురం అమ్మాయి సిరిశ్రీ దేవనపల్లి. మరొకరు తెలంగాణ రాష్ట్రం, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుంకరి జ్యోతి.

దేవనపల్లి సిరిశ్రీ సొంతూరు సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) కదిరి. నాన్న పద్మనాభ రెడ్డి ఎల్‌ఐసీలో హైయ్యర్‌గ్రేడ్‌ అసిస్టెంట్‌గా రిటైరయ్యారు. అమ్మ అమరావతి గృహిణి. తమ్ముడు నిఖిల్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌. ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్న సిరి శ్రీ విద్యార్థి దశ నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేది.

తాను పొల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో నిత్యం జాతీయ సేవా పథకంపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. రక్తదానం, మొక్కలు నాటడం, పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమాలు చాలా నిర్వహించాం. రోటరీపురం వద్ద రెండు గ్రామాలు దత్తత తీసుకున్నాం. గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించాం. ప్రతిరోజూ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి పంపాం. డేటా సేకరించి నిరక్షరాస్యులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) గురించి వివరించి వారికి అవగాహన కల్పించాం.
 
కాలేజీలో శారో హుండీ
మా ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో ‘శారో (సేవ్‌ ఏ రూపీ ఆర్గనైజేషన్‌)’ పేరుతో ప్రతి బ్లాక్‌లోనూ హుండీ ఏర్పాటు చేశారు. విద్యార్థులం స్వచ్ఛందంగా ఇందులోకి నగదు జమ చేసేవాళ్లం. ఆరు నెలలకోసారి ఈ మొత్తంతో అనాథ, వృద్ధాశ్రమాల్లో కార్యక్రమాలను నిర్వహించేవాళ్లం. ఈ విధానం నచ్చడంతో జాతీయ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితమయ్యాను. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ చిన్నపుల్లయ్య సార్‌ మాకు ఎంతో తోడ్పాటు అందించారు. జాతీయ సేవా పథకంలో పని చేయడం వల్ల సేవాభావం మాత్రమే కాదు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి.

ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌గా 2019లో గుజరాత్‌లో జరిగిన ప్రీ–రిపబ్లిక్‌ పరేడ్‌ క్యాంప్‌కు ఎంపికయ్యాను. 2020 జనవరి 26న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు గౌరవనీయులు భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడాన్ని జీవితకాల సాఫల్యంగా భావిస్తున్నాను. ఇంతకు మించి గొప్ప ఘనత నా జీవితంలో ఉండదేమో! మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఫస్ట్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా చేతుల మీదుగా సత్కారం అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సిరి శ్రీ దేవనపల్లి.
– బడ శ్రీనివాస రెడ్డి, సాక్షి, అనంతపురం

లీడర్‌షిప్‌ మాత్రమే
‘‘మాది హన్మకొండ. ఇంటర్‌ హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాల, డిగ్రీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. కాకతీయ యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్‌ చేసి, 2007లో అదే యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించాను.  2008లో అప్పటి ప్రిన్సిపాల్‌ నన్ను ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా నియమించారు. నాకు విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌ఎస్‌తో పరిచయం లేదు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత నా టీమ్‌లోని వాలంటీర్ల సామాజిక సేవాపథం, వారు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే తీరు నన్ను స్ఫూర్తిమంతం చేశాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లతో కుమ్మరిగూడెంలో ప్రత్యేక శిబిరం పెట్టి మొక్కలు నాటాం. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్య కల్పన కు కృషి చేశాం. అలా 2012వరకు నాలుగేళ్లపాటు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా కొనసాగాను.

కో ఆర్డినేటర్‌గా...
కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌గా 2017లో అప్పటి వీసీ ఆచార్య ఆర్‌ సాయన్న నియమించారు. యూనివర్సిటీ చరిత్రలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా ఒక మహిళకు అవకాశం రావడం అదే తొలిసారి. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు 36 వేలమంది వాలంటీర్లతో పనిచేశాను. హరితహారంలో మొక్కలు నాటాం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాం. రక్తదానం శిబిరాల్లో 25 వేలమంది వాలంటీర్లు, లక్షా 18వేల యూనిట్ల రక్తదానం చేశారు. 975 ఆరోగ్య శిబిరాలు నిర్వహించాం.

గుప్పెడు బియ్యం (కప్‌ ఆఫ్‌ రైస్‌) పేరున ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించి, నిరుపేదలకు, అనాథలకు పంపిణీ, జలశక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా నీటì సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం, శ్రమదానం చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంకుడు గుంతలు తవ్వడంతోపాటు క్యాంపస్‌లో ఉన్న చెక్‌ డ్యామ్‌లకు మరమ్మతులు కూడా చేశాం. మేడారం జాతరలో భక్తులకు సేవలందించడం, ఎన్నికల సమయాల్లో పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఓటర్లకు సేవలందించడంలోనూ మా కార్యకర్తలు ముందుండేవాళ్లు. కోవిడ్‌ సమయంలో శానిటైజర్, మాస్కుల పంపిణీ చేశాం. ఇన్ని సేవల నేపథ్యంలో అందిన ఈ గౌరవం మధురానుభూతిగా మిగులుతుంది’’ అన్నారు సుంకరి జ్యోతి.
– డి. రమేశ్, సాక్షి, హన్మకొండ

మరిన్ని వార్తలు