తలబొప్పి పలికించిన తత్త్వం

19 Jan, 2023 00:13 IST|Sakshi

తలబొప్పి కడితే కానీ తత్త్వం బోధపడదంటే ఇదే. పాలు పోసి పెంచిన తీవ్రవాద సర్పం తన మెడకే చుట్టుకొంటూ, అస్తవ్యస్త విధానాలతో ఆర్థికంగా నట్టేట మునిగాక పాకిస్తాన్‌ తెలివి తెచ్చుకుంటున్నట్టుంది. నిరుడు పగ్గాలు పట్టిన ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నోట హఠాత్తుగా ఊడిపడ్డ భారత్‌తో శాంతి చర్చల మాట చూస్తే అలాగే అనిపిస్తోంది. రెండురోజుల పర్యటనకు వెళ్ళిన ఆయన దుబాయ్‌ వార్తాఛానల్‌ ‘అల్‌ అరేబియా’తో సోమవారం మాట్లాడుతూ భారత్‌తో మూడు యుద్ధాలతో గుణపాఠాలు నేర్చామనీ, నిజాయతీగా శాంతి చర్చలు జరపాలనీ, ఉభయులకూ మిత్రదేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మధ్యవర్తిగా వ్యవహరించాలనీ అన్నారు.

కానీ, ఆ మర్నాడే పాక్‌ ప్రధాని కార్యాలయం హడావిడిగా వివరణనిచ్చింది. కశ్మీర్‌లో ‘చట్టవిరుద్ధ చర్యల’పై భారత్‌ వెనక్కి తగ్గితేనే చర్చలంటూ మెలికపెట్టింది. తప్పంతా తమదేనని అనిపించుకోవడం ఇష్టం లేని శక్తిమంతమైన సైనిక వర్గాలు ఒత్తిడి తేవడంతో పాక్‌ పాలకులు అలా స్వరం సవరించుకోవాల్సి వచ్చింది. కానీ అసలంటూ చర్చల ప్రస్తావన రావడం విశేషమే.

భారత్‌తో శాంతి నెలకొంటేనే పాక్‌ ఆర్థికవ్యవస్థకు లాభమని షెహబాజ్, ఆయన సోదరుడైన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు తరచూ చెబుతుంటారు. కానీ, భారత్‌తో చేసిన మూడు యుద్ధాలతో బుద్ధి వచ్చిందనీ, వాటి వల్ల కష్టాలు, కన్నీళ్ళు, నిరుద్యోగం, పేదరికమే దక్కాయనీ ఒక పాకిస్తానీ పాలకుడు అనడం ఇదే తొలిసారి. అందుకే, షెహబాజ్‌ తాజా మాటలు తరచూ చేసే శుష్క ప్రకటనల కన్నా భిన్నమైనవి, ప్రాధాన్యమున్నవి.

అందులోనూ ఆర్థిక కష్టాల్లో 300 కోట్ల డాలర్ల మేర భుజం కాస్తున్న ‘సోదర’ దేశం యూఏఈని శాంతిసంధాతగా రమ్మనడమూ కీలకమే. నిజానికి, దాయాదుల మధ్య తెర వెనుక చర్చల ప్రక్రియకు మధ్యవర్తి పాత్ర తమ దేశమే పోషించిందని యూఏఈ ఉన్నత దౌత్యాధికారి 2021లో బయటపెట్టారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ మద్దతు నిచ్చాయన్నారు. మళ్ళీ ఆ సోదర దేశాన్నే పాక్‌ సాయం కోరింది.  

నిజాయతీ ఎంత ఉందో కానీ, ఇన్నాళ్ళకు పాక్‌ పాలకులు సరైన దోవలో ఆలోచిస్తున్నారు. డాలర్‌ నిల్వలు పడిపోతూ, శ్రీలంక బాటలో పాక్‌ కూడా దివాళా తీసే ప్రమాదపుటంచున ఉంది. ఈ నేపథ్యంలోనే ‘అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం చెలరేగితే, ఏం జరిగిందో చెప్పడానికైనా ఎవరూ మిగలర’న్న ఆకస్మిక జ్ఞానం వారికి కలిగిందనుకోవాలి. నిజానికి, పాక్‌ చర్చల ఆకాంక్ష, కశ్మీర్‌ సమస్య పరిష్కారం, చివరకు భారత్‌తో శాంతిస్థాపన ఆలోచనలు కొత్తవేమీ కావు.

జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ పాలనలోనే ఈ కథ కంచి దాకా వెళ్ళినట్టే వెళ్ళి, ఆఖరి క్షణంలో అడ్డం తిరిగింది. అప్పట్లో ఇక్కడ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి, అక్కడ ముషారఫ్‌ను బలహీనపరిచిన దేశీయ సమస్యలు కలసి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చాయి. ఆ మధ్య ఇమ్రాన్‌ ఖాన్‌ – సైన్యాధ్యక్షుడు జనరల్‌ బజ్వా ద్వయం కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని ప్రయత్నించింది. కానీ, పాక్‌ పాలక వర్గాలు పడనివ్వలేదు.

దేశ ఆర్థిక సమస్యలు, తీవ్రవాద ‘తెహ్రీక్‌–ఎ–తాలిబన్‌ పాకిస్తాన్‌’ (టీటీపీ) తలనొప్పి, పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో మార్పులు – ఇలా అనేకం శాంతి గీతాలాపనకు కారణం. పశ్చిమాసియాలో కీలకమైనవీ, పాక్‌కు ‘సోదర’ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా తాజా పరిస్థితుల్లో భారత్‌కు దగ్గరయ్యాయి. దీంతో, పాక్‌ రూటు మార్చక తప్పట్లేదు. పైగా, భారత్‌తో శాంతి నెలకొంటే వాయవ్యాన తలనొప్పిగా మారిన తాలిబన్లపై దృష్టి పెట్టవచ్చు.

ఈ ఏడాదే పాక్‌లో ఎన్నికలు జరగనున్నందున ఈ శాంతి వచనాలు ఊహించదగ్గవే. అధికారం కోరే ప్రతి పార్టీ ఓటర్లకు గాలం వేస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలో భారత్‌తో శాంతిస్థాపన అంశాన్ని చేర్చడం షరా మామూలే. గత ఎన్నికల్లో ప్రధాని పీఠానికి పోటీపడ్డ ముగ్గురూ ఆ వాగ్దానమే చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ షెహబాజ్‌ అదే పల్లవి అందుకున్నట్టున్నారు.  
   
కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019 ఆగస్ట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌ పునః సమీక్షించే అవకాశం లేదు. అది మినహాయించి, జమ్ము–కశ్మీర్‌ల రాష్ట్ర హోదా పునరుద్ధరణ లాంటివి కోరుతూ చర్చలంటే కథ కొంత ముందుకు నడుస్తుంది. అదే సమయంలో యూఏఈ సహా ఉభయ మిత్రులూ, తెర వెనుక శక్తిమంతులూ ఎందరున్నా... అంతర్గత అంశమైన కశ్మీర్‌పై అంతర్జాతీయ జోక్యం మనకు సమ్మతం కానే కాదు. అది గుర్తెరిగి ప్రవర్తిస్తేనే తాజా ప్రతిపాదనకు సార్థకత. పీఎంఓ ప్రకటన అటుంచి, చర్చలకు కట్టుబడి ఉన్నామని షెహబాజ్‌ బృందం చేతల్లో చూపాలి. 

పాక్‌తో గత అనుభవాల దృష్ట్యా ఆ దేశం నేర్చుకున్నట్టు చెబుతున్న గుణపాఠాల పట్ల భారత్‌కు అనుమానాలు సహజమే. అయితే, అనాలోచితంగా శాంతి ప్రతిపాదనకు అడ్డం కొట్టాల్సిన పని లేదు. దౌత్య, వాణిజ్యపరంగా ముందుగా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. 2019 ఆగస్ట్‌ పరిణామాల తర్వాత ఇరుదేశాల రాజధానుల్లోనూ హైకమిషనర్లు లేరు. కింది సిబ్బందే బండి నడుపుతున్నారు.

పరస్పర విశ్వాసం పాదుగొల్పే చర్యల్లో భాగంగా రెండుచోట్లా హైకమిషనర్ల నియామకం జరగాలి. వీసాలపై షరతుల్ని సడలించాలి. సాంస్కృతిక, క్రీడా సంరంభాలను పునరుద్ధరించాలి. ముఖ్యంగా తీవ్రవాదానికి కొమ్ము కాయబోమని పాక్‌ నమ్మకం కలిగించాలి. శాంతి పథంలో సాగాలంటే అది అతి ముఖ్యం. అందుకు పాక్‌ రెండడుగులు ముందుకు వేస్తే, నాలుగడుగులు వేయడానికి శాంతికాముక భారతావని సదా సిద్ధంగానే ఉంటుంది. 

మరిన్ని వార్తలు