నిశీధిలో ఓ దీపం!

12 Dec, 2021 00:33 IST|Sakshi

‘మన ప్రజాస్వామ్యం మేడిపండు– మన దరిద్రం రాచ పుండు’ అన్నాడొక కవి... ఇప్పుడు కాదు, మూడు నాలుగు దశాబ్దాల కిందట! కాలం గడిచేకొద్దీ మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని మనం గట్టిగా నమ్ముతున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని చెప్పుకోవడానికి కూడా గర్వపడుతుంటాము. ప్రజాస్వామ్య వ్యవస్థలపై రేటింగ్స్‌ ప్రకటించే కొన్ని అంతర్జాతీయ సంస్థలు మాత్రం క్రమం తప్పకుండా మన ఆత్మవిశ్వాసం మీద దెబ్బలు కొడుతున్నాయి. ఐరోపా సంస్థ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ వాళ్లు ప్రకటించే డెమోక్రసీ ఇండెక్స్‌ తాజా నివేదికలో భారత్‌కు 53వ స్థానం దక్కింది. అమెరికాకు చెందిన ఫ్రీడమ్‌ హౌస్‌ అనే సంస్థ 23 దేశాలను మాత్రమే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలుగా గుర్తించింది. అందులో మనకు స్థానం దొరకలేదు. పాక్షిక స్వేచ్ఛ కలిగిన 52 దేశాల జాబితాలో మాత్రం చోటు దక్కింది.

పౌరులందరి హక్కులకూ గట్టి రక్షణ లభించడం, సమస్త భౌతిక బౌద్ధిక వనరులన్నీ సమానంగా అందుబాటులో ఉండడం వంటి అంశాల ఆధారంగా ప్రజాస్వామ్య వ్యవస్థల పరిణతిని లెక్కిస్తారు. ఈ లెక్కలతో కొలుచుకుంటే చాలు. మనకు ఏ అంతర్జాతీయ సంస్థల రేటింగ్స్‌తో అవసరం లేదు. మన ప్రజాస్వామ్యం మేడిపండుగా మారిందని చెప్పడానికి మన దైనందిన జీవితానుభవాలు చాలు. ఎందుకిలా జరుగు తున్నది? పరిణతితో వికసించవలసిన ప్రజాస్వామ్యం పరిమిత ప్రజాస్వామ్యంగా ఎందుకు ముడుచుకొని పోతున్నది? ప్రపం చంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం మనకు ఉన్నప్పటికీ, చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌తో కూడిన అధికార విభజన అమలులో ఉన్న ప్పటికీ ఎందుకు పురోగమించలేకపోతున్నామనేది చర్చనీయాం శంగా మారింది.

రాజకీయ పార్టీల్లో ఏర్పడుతున్న సైద్ధాంతిక శూన్యత కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుడుకు ఒక ప్రధాన కారణంగా రాజనీతి శాస్త్ర నిపుణులు పరిగణిస్తున్నారు. ఏరకమైన సామా జిక పరివర్తనను తాము కోరుకుంటున్నామో ఒక స్పష్టమైన అవగాహన, ఆ స్థితికి చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ కలిగి ఉండడమే రాజకీయ పార్టీ సిద్ధాంతంగా, దాని తాత్విక భూమికగా పరిగణించవచ్చును. ఆదిలో అన్ని రాజకీయ పార్టీ లకూ తమదైన ఒక తాత్వికత ఉండేది. సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థగా, లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించుకున్నది. మొదట్లో ఈ దిశగా కొన్ని అడుగులు వేసిన ఆ పార్టీ క్రమంగా దారితప్పిన వైనం మన కళ్లముందున్నది. అధికారం నిలుపు కోవడానికి ఆ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలను ఆశ్రయిం చింది. ఆ బ్యాంకులో ప్రవేశం దొరకని వర్గాలను దూరం చేసు కున్నది. ఫలితంగా అధికారానికి దూరమైంది. ఉత్తరాదిలో దాని పతనానికి ఇదే ప్రధాన కారణం.

ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఆరెస్సెస్‌ భావజాలమేనన్నది బహిరంగ రహస్యం. మతం సెంటిమెంట్‌తో ఓట్లు తెచ్చుకోవాలి గనుక ఆరెస్సెస్‌ ఎజెండాలోని హిందూత్వ జెండాను మాత్రం వెలిసిపోకుండా బీజేపీ కాపాడుకుంటున్నది. కానీ ఆర్థిక రంగంలోని చాలా అంశాల్లో ‘నాగపూర్‌’ భావజాలానికి భిన్నమైన వైఖరినే బీజేపీ తీసుకుంటున్నది. రాజకీయ అవసరాల కోసం పొత్తులు – ఎత్తుల్లో కూడా బీజేపీ చాలా స్వేచ్ఛను తీసుకుంటున్నది. ఈ రెండు జాతీయ పార్టీలే కాదు, దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు వాటి సైద్ధాంతిక నిబద్ధత నుంచి పక్కకు తప్పుకు న్నాయి. రామ్‌మనోహర్‌ లోహియా సోషలిస్టు వారసత్వంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ– ములాయంసింగ్‌ యాదవ్‌ స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీ. కానీ, ఈనాటికీ ఆ పార్టీ దళిత వర్గాల ప్రజల దరికి చేరలేకపోయింది. సోషలిస్టు – వామపక్ష భావజాల ప్రభా వంతో ఎన్టీరామారావు తన తెలుగుదేశం పార్టీ విధానాలను తయారు చేసుకున్నారు. ఆయన దగ్గర్నుంచి పార్టీని దొంగి లించిన ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు పార్టీని పూర్తిగా తలకిందు లుగా నిలబెట్టారు. పేదవర్గాల సంక్షేమ ప్రణాళికను తిరగరాసి, సంపన్న వర్గాలకు కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేసే పార్టీగా తయారుచేశారు. ఈ పార్టీలన్నీ ఓట్ల కోసం ఉపయోగితా వాదాన్ని  (utilitarianism) ఆశ్రయించాయి. ఎన్నికల ప్రణాళి కల్ని చెక్‌బుక్‌ మేనిఫెస్టోలుగా మార్చివేశాయి.

సైద్ధాంతిక నిబద్ధత లేని రాజకీయాలకు సహజంగానే ప్రజా స్వామ్యం పట్ల నిబద్ధత ఉండదు. ప్రజల పట్ల బాధ్యత ఉండదు. ఫలితంగా రాజకీయ రంగం నుంచి ప్రజా సేవకులు అదృశ్యమై వ్యాపారులు ప్రవేశించారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని భారత రాజ్యవ్యవస్థ తూచా తప్ప కుండా స్వీకరించి ఉన్నట్లయితే దేశ పరిస్థితి భిన్నంగా ఉండేది. అన్నార్తులు, అభాగ్యులు, దిక్కుమొక్కు లేని జనమంతా ఒక్కో సాధికారిక బాణమయ్యేవారు. శతకోటి నరనారీ నిపుణ జన సందోహంతో మన దేశం అగ్రరాజ్య హోదాను సవాల్‌ చేయగలిగి ఉండేది. అంబేడ్కర్‌ అందిం చిన అమూల్య అవకాశాన్ని ఈ దేశం జారవిడిచింది. రాజ్యాం గాన్ని అమలుచేయడంలో మూడు ప్రభుత్వ ఎస్టేట్‌లూ పాక్షి కంగా విఫలమయ్యాయి. ఫోర్త్‌ ఎస్టేట్‌గా చెప్పుకునే మీడియా పరిస్థితి ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ అన్న చందంగా తయారైంది. ఫలితంగా ప్రపంచ డెమోక్రసీ ఇండెక్స్‌ల దగ్గర నుంచి హంగర్‌ ఇండెక్స్‌ల దాకా భారత్‌ పరిస్థితి అవమానకరంగా దిగజారి పోయింది.

భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ ‘ప్రవేశిక’ (preamble)లో రాజ్యాంగ లక్ష్యాలను స్థూలంగా ప్రవచించారు. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమకూర్చడానికి, ఆలోచనా భావ ప్రకటనా విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను సమకూర్చడానికి, అవకాశాల్లో హోదాల్లో సమానత్వం సాధించడానికి, వ్యక్తుల గౌరవ మర్యాదలకు హామీపడుతూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపజేయడానికి, దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ప్రకటిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నామని ఈ ‘ప్రవేశిక’లో పేర్కొన్నారు. దేశ లౌకికత్వం మీద ఈనాటికీ నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. సామ్యవాదానికి విడాకులు ఇచ్చేశాము. ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయ ర్యాంకుల్ని చూస్తూనే ఉన్నాము. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ లభించడం లేదన్నది నిర్వివాదమైన అంశం. ఈ డెబ్బయ్యేళ్లలో దేశంలో ఆర్థిక – రాజకీయ – సామాజిక అసమానతలు మరింత పెరిగి పోవడమే ఇందుకు నిదర్శనం.

మొన్న పదో తేదీనాడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని పాటించారు. మన దేశంలో కూడా వేలాది కార్యక్రమాలు జరిగాయి. విజయవాడలో జరిగిన అటువంటి ఒక సభకు తమిళనాడు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె. చంద్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘జై భీమ్‌’ సినిమా కారణంగా జస్టిస్‌ చంద్రూ ఇప్పుడు దేశ ప్రజలందరికీ సుపరి చితులయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అఖండ విజయం సాధిం చిన చిత్రమిది. జస్టిస్‌ చంద్రూ నిజజీవిత కథలో ఒక చిన్నభాగం ఈ చిత్రం ఇతివృత్తం. చదువుకునే రోజుల్లోనూ, న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసే రోజుల్లోనూ పౌరహక్కుల రక్షణ కోసం గళం విప్పిన నేపథ్యం ఆయనది. సీపీఎం, దాని అనుబంధ ప్రజా సంఘాలతో కలిసి కష్టజీవుల పక్షాన ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిరుపేదలనూ, నీడలేని వారినీ భారత రాజ్యాంగ నీడలో నిలబెట్టడానికి ఒక న్యాయవాదిగా ఆయన అవిరళమైన కృషి చేశారు. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రయోజనాలను ఈ దేశ ప్రజలు గరిష్ఠంగా వినియోగించుకోగలిగితే వారిని ‘ఎంపవర్‌’ చేయవచ్చుననే ఆలోచన ఆయనకు ఉన్నట్టు ఈ సినిమా ద్వారా అర్థమవుతున్నది. సినిమాకు ‘జై భీమ్‌’ అనే టైటిల్‌ పెట్టడంలో చంద్రూ పాత్ర ఉన్నదో లేదో తెలియదు కానీ, ఆ టైటిల్‌ వెనుక అంతరార్థం మాత్రం అదే. జై భీమ్‌ అనేది ఇప్పుడొక జనన్ని నాదం. ఒక రణన్నినాదం. తరతరాల వంచనకూ, మోసానికీ, దోపిడీకీ గురైన ప్రజానీకం చేసిన పలవరింతే జై భీమ్‌. జై భీమ్‌ ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని నిస్సహాయ ప్రజలకు కవచంగా ఉపయోగించినవాడు జస్టిస్‌ చంద్రూ. ఆయన వాదించిన అనే కానేక కేసుల్లో ఒకటి మాత్రమే ‘జై భీమ్‌’ సినిమా. భారత రాజ్యాంగ రచన చేసిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్మరణే – జై భీమ్‌. ఇప్పుడు దేశంలోని రాజకీయ పార్టీల్లో ఆవరించిన సైద్ధాం తిక శూన్యతకు ప్రత్యామ్నాయం జనసాధికారత సిద్ధాంతం. సైద్ధాంతిక నిశీధిలో ఒక దీపం సాధికారత. ఈ సాధికారత సాధన కోసం తన జీవితకాలాన్ని జస్టిస్‌ చంద్రూ వెచ్చించారు.

రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేట్టు చూసినట్లయితే అది బలహీనవర్గాల అభ్యున్నతికి ఒక సంజీ వనిలా తోడ్పడుతుందని ‘జై భీమ్‌’ సినిమా ఇచ్చిన సందేశం. జస్టిస్‌ చంద్రూ జీవిత పాఠం కూడా! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రారంభమైన బలహీనవర్గాలు – మహిళల ఎంపవర్‌మెంట్‌ కార్యక్రమాలు కూడా ఇప్పుడిప్పుడే దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం రకరకాల వ్యూహాలతో ఈ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం. రాజధాని ప్రాంతంలో దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్ణయించింది. దీన్ని అడ్డు కోవడానికి తెలుగుదేశం పార్టీ శతవిధాలా పోరాడింది. పేదలకు అక్కడ ఇళ్లు కేటాయించినట్లయితే డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ (సామాజిక అసమతుల్యత) ఏర్పడుతుందని వాదించింది. రాజధానిలో సంపన్నులే తప్ప పేదలు నివసించకూడదట. ఇటు వంటి అహంభావ వైఖరి దాని వర్గస్వభావాన్ని బయట పెట్టింది. ఈ పేదవర్గాల వ్యతిరేక పార్టీ చేపట్టిన కృత్రిమ రైతు ఉద్యమంలో మన కామ్రేడ్స్‌కు తెలంగాణ, తేభాగ, పున్నప్ర– వాయిలార్‌ రైతు ఉద్యమాలు కనిపించడం ఆశ్చర్యకరం. వారికి లాల్‌ సలామ్‌!

డబ్బున్నవారి పిల్లలతో సమానంగా నాణ్యమైన ఉచిత విద్యను, అంతర్జాతీయ పోటీల్లో నిలబడగల నైపుణ్య విద్యను అందరికీ అందజేయడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒక బృహత్తర యజ్ఞాన్ని తలపెట్టి ప్రారంభించింది. ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అందరికీ ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవడం కోసం క్యూబా తరహా వైద్య విప్లవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ‘అమ్మ ఒడి’ ఒక అద్భుతం. ఈ పథకం వల్ల పిల్లలను ఒక బాధ్యతగా బడికి పంపించడం మాత్రమే కాదు, పిల్లల చదువుసంధ్యలను వారి భవిష్యత్తును నిర్ణయించే సాధికార శక్తిగా అమ్మ అవతరించింది. ఇటువంటి పథకాలను చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ల తరహా తాయిలాలతో పోల్చేవారి అజ్ఞానాన్ని క్షమిద్దాం. రాజ్యాంగ విహితమైన ఈ తరహా కార్యక్రమాలను దేశమంతటా చేపట్టిననాడు ‘బిలియన్‌ ఎంపవర్డ్‌ మిసైళ్ల’తో ఈ దేశం గర్జిస్తుంది. గర్విస్తుంది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు