సాధికారతే ప్రజాస్వామ్యం!

29 Oct, 2023 03:36 IST|Sakshi

జనతంత్రం

కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్‌ రామస్వామి నాయకర్‌ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు.

పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది.

భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం.

ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధికారంలో వున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు.

రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. 

సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్‌లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్‌ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు.

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది.

ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు.

వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్‌ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్‌ సర్కార్‌ స్వస్తి చెప్పింది.

మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్‌పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్‌ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్‌ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్‌లో పడిపోయింది.

ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు.

1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌) వెబ్‌సైట్‌ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్‌ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు.

అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది.

పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు.

సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్‌ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము.

అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్‌ మోహన్‌రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక  హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది.

మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు.

ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్‌ గోర్కీ రాసిన రష్యన్‌ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు.

ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్‌ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు.

అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి.

పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్‌మోహన్‌ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు.

ఈ 53 నెలల కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు