అమరావతి (ప్రైవేట్‌ లిమిటెడ్‌) కథలు!

7 Nov, 2021 00:28 IST|Sakshi

జనతంత్రం

‘‘విపణివీథి–తపోవనం/చాకిరేవు–శాసనసభ/సానికొంప– సాధుమఠం/మూత్రశాల–యాత్రాస్థలి/ఎచటైతేం? ఎచటైతేం? పోటీపడి కాటులాడ ఎచటైతేం?’’. ప్రజాకవి కాళోజీ రాసిన ఒక కవితలోని పంక్తులివి. ఆయన రాసిన వ్యంగ్యాన్ని టీడీపీ వాళ్లు ఆదర్శంగా మలుచుకున్నట్టున్నారు. గుడి, బడి, అసెంబ్లీ, గంజాయి... సందర్భం ఏదైనా కాట్లాడటమే ఎజెండాగా ఎంచు కున్నట్టున్నారు. అధికారం చేజారి మనోధృతి జావగారిన వేళ రచ్చబాట ఒక్కటే గత్యంతరమన్న ధోరణి ఆ పార్టీ కార్య క్రమాల్లో కనిపిస్తున్నది.

ఎక్కడో ఒక ఆకతాయి గుడిమీద రాళ్లు విసిరితే, ఒక దగు ల్బాజీ విగ్రహాలు చోరీచేస్తే, గుడి బయట ఉన్న రథానికి ఎవడో ఒక దుండగీడు నిప్పుపెడితే ఆ పార్టీ పండుగ చేసుకున్నది. ప్రభుత్వానికి లంకె పెట్టి ప్రచారాన్ని మోగించింది. ఈ దెబ్బతో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కలలుగన్నది. తన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఘటనలు ఇంతకంటే ఎక్కువ జరిగాయన్న సంగతి పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ, ఆ పార్టీ లెక్క చేయలేదు. దేవాలయ భూములను, సత్రం భూములను ఆ పార్టీ నేతలే ఫలహారంలా ఆరగించిన దృష్టాంతాలను దాచి పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా పూనుకొని బుల్డోజర్లను రంగంలోకి దించి ఒక్క విజయవాడలోనే 30 గుళ్లను నేలమట్టం చేసిన రికార్డు ఆ పార్టీదే. కానీ ఇప్పుడు రాద్ధాంతం కావాలి. రచ్చ జరగాలి. కాట్లాడుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలమీద ప్రచారం జరగనీయరాదు. ఇదే దాని సంకల్పం. అందుకు బీజేపీ, జన సేనలు యథాశక్తి సహకరించాయి. సహకరిస్తున్నాయి.

గంజాయి ఎపిసోడ్‌ అటువంటిదే. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గంజాయి దొంగ రవాణా పెద్దయెత్తున సాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం 2017లోనే రాష్ట్రాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అప్పట్లోనే జాతీయ దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అక్రమ రవాణా, లిక్కర్‌ మాఫియా, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం మోపడానికి ఎస్‌ఈబీ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గంజాయి కోసమే ఒక ప్రత్యేక బెటాలియన్‌ను కేటా యించింది. దీంతో దొంగ రవాణాకు అడుగడుగునా కళ్లేలు పడుతున్నాయి. ఈ వార్తలను ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ గంజాయి రవాణాకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ లంకించుకున్నది – దొంగే... ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు!

మహిళల రక్షణకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టనన్ని కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. ‘దిశ’ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దోషులకు సత్వరమే శిక్షలు పడేలా ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోదం లభించవలసి ఉన్నది. ‘దిశ’ యాప్‌ యువతులకు ఒక రక్షా బంధనంలా మారింది. 85 లక్షలమంది ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. చంద్రబాబు హయాంలో మహిళా అధి కారులకే రక్షణ లేని దుర్భర పరిస్థితిని ఈ రాష్ట్రం వీక్షించింది. శాసన సభ్యులే దుశ్శాసన పాత్రను పోషించిన దారుణాలను గమ నించింది. అప్పటి ప్రభుత్వ నేతలు రమ్య హత్యకేసు సంద ర్భంలో గురువిందలుగా మారిన గమ్మత్తయిన దృశ్యాన్ని కూడా రాష్ట్రం అవలోకించింది.

మంచీ–చెడూ విచక్షణ లేదు. పాపపుణ్యాల బేరీజు లేదు. ప్రతి సందర్భం రచ్చ కోసమే! పోట్లగిత్తల్లా కాలు దువ్వడమే! బండబూతుల దండోపాయమే! తరతరాలుగా వెనకబాటు తనానికి గురై నిలువ నీడ కోసం పరితపిస్తున్న అభాగ్యులు లక్షల సంఖ్యలో మిగిలి ఉండడమే ఒక దారుణం. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సాఫల్యతను శంకించవలసిన తరుణం. అటువంటి వారికి, అందులోనూ ఆడవారి పేరు మీద 30 లక్షల ఇళ్లు కట్టించే మహాయజ్ఞాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించింది. కేటాయింపులు పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటున్నది. ఈ ప్రయత్నాన్ని తొలి నుంచీ అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెగ తంటాలు పడింది. దొంగ పేర్లతో కోర్టుకెక్కింది. వ్యాజ్యం నడిపింది. ఆడవాళ్ల పేరు మీద పట్టాలు ఇవ్వడం తప్పట! యుగ యుగాల అణచివేతకూ, అస్వతంత్రతకూ బలైన మహిళా లోకాన్ని సాధికారితం చేయకుండా ఏ రకంగా ఉద్ధరిస్తారో చెప్పవలసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉన్నది.

రైతులకు భరోసా భద్రత కల్పించి వెన్నుదన్నుగా నిలపడం కోసం ఏర్పాటుచేసిన ఆర్‌బీకేలపై ఇప్పటివరకు ఒక్క మంచి మాట లేదు. విద్యా, వైద్య రంగాలను సమూల క్షాళన గావిస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంపై అభినందన లేదు. పోనీ దోషా లుంటే ఎత్తిచూపిందీ లేదు. ఎటువంటి జన శ్రేయోదాయక పనిని చేపట్టినా డైవర్షన్‌ స్కీమ్‌ను ఆశ్రయించడమే విపక్షం పనిగా పెట్టుకున్నది. దుష్ప్రచారమే ఆ డైవర్షన్‌. గోబెల్స్‌ సిద్ధాంత స్ఫూర్తితో ఒక రాద్ధాంతమే ఆ డైవర్షన్‌ స్కీమ్‌.

ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ వారు ఒక యాత్రను ప్రారంభించారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ అని దానికి నామకరణం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఈ యాత్రలో పాల్గొంటున్నారనీ, తమకు న్యాయం చేయాలని ఏడుకొండల వాడిని వేడుకోవడానికి వెళ్తున్నారనీ ప్రక టించారు. అన్యాయం జరిగిందని భావించినప్పుడు ఎవరైనా సరే తమ హక్కుల కోసం జరిపే పోరాటాన్ని అభినందించవల సిందే. సానుభూతి చూపవలసిందే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కనీస ధర్మం. రాజధాని కోసం తాము భూములిచ్చామనీ, ఈ ప్రభుత్వం మూడు రాజధానులను తెర మీదకు తీసుకొచ్చి నందువలన తమకు అన్యాయం జరిగిందని ఈ ఆందోళన కారులు చెబుతున్నారు. ఇందులో నిజానిజా లేమిటి? రాజధాని భూసమీకరణ కోసం చంద్ర బాబు హయాంలో జరిగిందేమిటి?

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల రైతుల దగ్గర్నుంచి 34,281 ఎకరాల భూమిని రాజ ధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం సమీకరించింది. భూమినిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లే–అవుట్లలో ప్లాట్లను కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. రైతులిచ్చిన భూమిని అభివృద్ధిచేసి, సుమారు 130 కంపెనీలకు 1293 ఎకరాల భూమిని ఇచ్చేశారు. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు కింద సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు 1691 ఎకరాలను కేటాయించారు. కొంత భాగాన్ని స్వాధీనం చేయడమూ జరిగింది. రైతులకు మాత్రం కాగితాలే దక్కాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వనే లేదు. భూ యజమానులకు వారి వాటాను దఖలుపరచకుం డానే వారి భూముల్లో వ్యాపారాన్ని ప్రారంభించడం ఏ చట్టం ప్రకారం, ఏ న్యాయం ప్రకారం, ఏ నైతిక సూత్రాల ప్రకారం సమ్మతమవుతుంది? పాదయాత్రగా బయల్దేరిన రైతు సోదరు లారా.. ఈ ప్రశ్నను మీరు చంద్రబాబుకు సంధించి ఉండవలసింది.

రాజధాని ప్రాంతంపై బహిరంగ ప్రకటన రాకముందే భూ సమీకరణ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే ప్రదేశాల్లో చంద్రబాబు అనుయాయులూ, బినామీలూ వేల ఎకరాలు కొనుగోలు చేశారు. ముందుగా లీక్‌ చేయడం వల్లనే వీరు కొనుగోళ్లు చేయ గలిగారు. రైతులిచ్చిన భూముల్లో రాజధాని ఏర్పడినట్లయితే ఈ ముఠా కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల వెల లక్ష కోట్లకు చేరి ఉండేది. సొమ్ము రైతులది, సోకు బినామీ వినా యకులది. ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’ పేరుతో కొనుగోలు చేసిన భూము లతోపాటు ఈ లక్ష కోట్ల ముఠాలో తెలుగుదేశం ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. భూసమీకరణ ప్రాంతంలో ఉండ వలసిన లింగమనేని రమేశ్‌ భూమి ఉన్నపళాన జారిపోయింది. కరకట్ట మీద ఉన్న ఆయన గెస్ట్‌హౌస్‌ చంద్రబాబు సొంతమైంది. ఈ వ్యవహారం మీకు అధర్మమని తోచలేదా రాజధాని ప్రాంత సోదరులారా?

రాజధాని ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటున్న 2,200 ఎకరాల అసైన్డ్‌ భూములను తెలుగుదేశం నేతలు లాక్కున్నారు. ‘ప్రభుత్వం తీసుకుంటే మీకు పరిహారం ఇవ్వరు. మేము పది లక్షల దాకా ఇస్తామ’ని మభ్యపెట్టారు. వారి చేతుల్లో పప్పు బెల్లాలు పెట్టి లాక్కున్నారు. అసైన్డ్‌ భూముల కొనుగోలు చట్ట విరుద్ధం. అయినా బాబు ప్రభుత్వం ఆమోదించింది. కొనుగోలు చేసిన నాయకులకు పూలింగ్‌ ప్యాకేజీ ప్రకటించారు. పాపం ఆ దళిత రైతులు మీ భూములు దున్నినవారే. మీ పంట చేలను చెమట చుక్కలతో తడిపినవారే. వారికి జరిగిన అన్యాయం మీ మనసును కదిలించలేదా?

ఇక సింగపూర్‌ యవ్వారం సంగతి. అక్కడున్న రెండు ప్రైవేట్‌ కంపెనీలను రంగంలోకి దించారు. వారితో ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికోసం 1691 ఎకరాలను ఈ కంపెనీలకు కట్టబెట్టారు. ఉచితంగానే సుమా!. ఆ భూమిని అభివృద్ధి చేయడానికి 5500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే వారికి ఇవ్వాలి. రైతుల భూమిలో, ప్రభుత్వ సొమ్ముతో వారు అభివృద్ధి చేస్తారు. అలా చేసినందుకు మొత్తం భూమిలో 250 ఎకరాలను సదరు కంపెనీలకు కట్నంగా ఇస్తారు. రాజధాని కోర్‌ ఏరియాలో ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసిన రైతుల భూమి 250 ఎకరాలు వారి సొంతం. అధమపక్షం ఎకరా 10 కోట్లు వేసుకున్నా 2500 కోట్లు. ఇక మిగిలిన 1450 ఎకరాల్లో ఆ కంపెనీలు వ్యాపారం చేస్తాయి. వచ్చే ఆదాయంలో అమరా వతి అభివృద్ధి సంస్థకు మూడు దశల్లో కలిపి 450 కోట్లు ఇస్తారు. అధమపక్షం పదికోట్లేసుకున్నా 1450 ఎకరాలకు 14,500 కోట్లు, అందులో ప్రభుత్వ సంస్థకు 450 కోట్లు. పోను సింగపూర్‌ సంస్థ లకు మిగిలేది 14000 కోట్లు ప్లస్‌ 2500 కోట్లు. మొత్తం 16,500 కోట్లు. ఇది కనీస పక్షం లెక్క. ఇది ద్విగుణం, త్రిగుణం... అంతకుమించి కూడా అవ్వొచ్చు. ఎవరీ సింగపూర్‌ కంపెనీ వారు? ఎవరి తాతగారి బంధువులు? ఇన్ని వేలకోట్ల ప్రజా ధనాన్ని వారికి ఎందుకు కట్టబెట్టడానికి ప్రయత్నించి నట్టు? ఇందులో సింహభాగం సొమ్ము సింగపూర్‌లో చేరవలసిన వారి అకౌంట్‌కు చేరుతుందని కనిపెట్టడానికి కామన్‌సెన్స్‌ చాలదా? ఆందోళనకారులు ఈతరహా ఒప్పందాన్ని ఎప్పుడైనా ప్రశ్నిం చారా? రాజధాని వ్యవహారంలో ఆయనకు మద్ద తునిస్తున్న పార్టీలైనా ప్రశ్నించాయా?

అధికారంలో ఉన్నవారు ప్రజాదరణ పొందలేకపోతే దిగి పోవలసి రావడం సహజం. కానీ చంద్రబాబుకు మాత్రం కోల్పోయిన అధికారం ఒక తొణికిన స్వప్నం. ఒక చేజారిన స్వర్గం. ఎందుకంటే, అదే అమరావతి మహిమ. ఈ ప్రాజెక్టులో ప్రజాశ్రేయస్సు కంటే ఆయన సౌభాగ్యమే ఎక్కువ. ఇది ప్రపంచంలో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా, ప్రపంచంలో అతిపెద్ద స్కామ్‌గా ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. తొణికిన స్వప్నాన్ని, చేజారిన స్వర్గాన్ని మళ్లీ అందుకోవాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆయన రెండంచెల వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఒకటి– వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్య క్రమాలపై చర్చ జరగకుండా వ్యతిరేక ప్రచారాన్ని నిరంతరంగా నిర్వహించడం. రెండు– వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ఎదు ర్కోవడానికి ఎన్ని శక్తులను ఏకం చేయవలసి ఉంటుందనే అంశంపై ట్రయల్స్‌ వేయడం. మొదటి అంచెను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల నుంచే ప్రారంభించారు. ఇప్పుడది అదుపుతప్పి ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. రెండో వ్యూహంపై బద్వేల్, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఒక ప్రయోగం చేశారు.

ముందుగా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఆ పార్టీ అభ్యర్థే రంగంలో ఉండేలా పావులు కదిపారు. జనసేన అధికా రికంగా బీజేపీ మిత్రపక్షమే కనుక దాని మద్దతు లభించింది. టీడీపీ కార్యకర్తలే ఏజెంట్లుగా నిలబడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చు కున్న తెలుగుదేశం నేతలు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్‌లు టీడీపీ ఓట్లు బీజేపీకి పడేలా చక్రం తిప్పారు. ఈ ప్రయోగం కొంతమేరకైనా ఫలించి ఉన్నట్లయితే చంద్రబాబులో ఆశలు చిగురించేవి. ఇంత చేసినా బద్వేల్‌లో ఉమ్మడి అభ్యర్థికి డిపాజిట్‌ దక్కలేదు. హుజూరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీకి దక్కడానికి తెరవెనుక చంద్రబాబు మంత్రాంగం చేశారని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు చెబు తున్నారు. అటువంటి గట్టి ప్రయత్నం ఏదీ లేకపోతే గత ఎన్ని కల్లో 30 శాతం ఉన్న కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఒకటిన్నర శాతానికి పడిపోవడం అసంభవమని వారి వాదన. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసమే చంద్రబాబు ఈ పని చేసిపెట్టారని చెబుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రెండంచెల వ్యూహానికి బీజేపీ తోడ్పాటు కావాలి. సాధారణ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు లభించాయి. స్థానిక ఎన్నికల నాటికి 70 శాతం దాటాయి. బద్వేల్‌లో 76 శాతం ఓట్లు పడ్డాయి. ఆ ఓటు బ్యాంకు 50 శాతం కంటే తగ్గాలి. అందుకోసం దుష్ప్రచారం. అది అఖండ జ్యోతిలా ఆరకుండా మండుతూనే ఉన్నది. ఇరవై ఐదు శాతానికి పడి పోయిన తన ఓటు బ్యాంకు యాభై శాతం దాటాలి. ఎలా? అందుకే ఈ ట్రయల్‌ రన్స్‌.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు