జిల్లాలో ఐదు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు

25 Feb, 2023 08:58 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ 

ఏలూరు(మెట్రో): జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఐదు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈలతో పాటు భారీ పరిశ్రమల ఏర్పాటుకు రుణాలిచ్చేలా బ్యాంకర్లు సహకరించాలన్నారు. వెమ్‌ టెక్నాలజీస్‌ నుంచి స్వాధీనం చేసుకున్న పెదపాడు మండలం వట్లూరు, భోగాపురం గ్రామాల్లోని 350 ఎకరాల స్థలంలోని 25 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

2022–23 సంవత్సరంలో సింగిల్‌ డెస్క్‌ పథకం ద్వారా ఇప్పటివరకు 244 దరఖాస్తులు రాగా 230 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. ఐడీపీ తదితర పథకాల ద్వారా 20 యూనిట్లకు ప్రతిపాదనలు రాగా రాయితీల కింద రూ.2.77 కోట్ల మంజూరుకు సమావేశం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న పెద్ద లే అవుట్లలో అనువైన స్థలాలను గుర్తించి గార్మెంట్‌ తదితర ఉత్పత్తిదారులను సమన్వయం చేసుకొని ముడిసరుకు, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేలా కాటేజ్‌ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పి.ఏసుదాసు, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్‌ మేనేజర్‌ కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు