పారదర్శకంగా ఓటరు జాబితా తయారీ | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటరు జాబితా తయారీ

Published Sat, Nov 11 2023 12:54 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ 
 - Sakshi

ఏలూరు(మెట్రో): ఎన్నికల సంఘ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఓటు ఉండాలనే లక్ష్యంతో ఓటరు జాబితా తయారీలో అందరూ భాగస్వాములు కావాలని గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ గౌతమి సమావేశ మందిరంలో గుర్తింపుపొందిన పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రక్రియ, ఓటింగ్‌ యంత్ర పరిశీలన తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా, పారదర్శకంగా రూపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఓటరు జాబితాలో చేర్పులు, మార్పుల కోసం వచ్చేనెల 9 వరకు సమయం ఉన్నందున, ఈలోపు అర్హులంతా ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవచ్చన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించి ఆన్‌లైన్‌లో పెట్టడంతోపాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించామని, లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురాచ్చన్నారు. అలాగే వచ్చేనెల 2, 3 తేదీల్లో బీఎల్‌ఓల సమక్షంలో ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహిస్తామన్నారు.

జనవరి 5న తుది జాబితా : జనవరి 5వ తేదీన ఓటరు తుది జాబితా ప్రకటిస్తామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల నాటికి 15 లక్షల 88 వేల 622 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అలాగే ఈనెల 4,5 తేదీల్లో నిర్వహించిన స్పెషల్‌ క్యాంపెయిన్‌లో మొత్తం 11,793 దరఖాస్తులు అందాయన్నారు.

యంత్రాల తనిఖీ పూర్తి

జిల్లాలో చేపట్టిన ఓటింగ్‌ యంత్రాల తనిఖీ పూర్తి చేశామని, మాక్‌ పోల్‌ నిర్వహించామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్ర తినిధులు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ఓ టరు జాబితా సవరణ ప్రక్రియపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు జిల్లా యంత్రాంగం కృషిచేసిందని అభినందించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఓటింగ్‌ యంత్రాల మొదటి దశ పరిశీలన పూర్తి

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

Advertisement
Advertisement