ఫ్యామిలీ డాక్టర్‌ దేశానికే ఆదర్శం

28 Mar, 2023 00:38 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని

ఏలూరు టౌన్‌: పేద, బలహీన వర్గాలకు ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని అన్నారు. ఏలూరులోని ఇండోర్‌ స్టేడియంలో సోమవారం ఉదయం ప్రభుత్వం మంజూరు చేసిన 16 కొత్త 104 వాహనాలను జిల్లా కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఆశతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ళనాని మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేస్తూ పేదలకు ఉచిత వైద్యాన్ని చేరువ చేశారని చెప్పారు. నూతనంగా అమల్లోకి తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ దేశానికే ఆదర్శంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఇంటివద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించటంపై వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గతంలో 1004 వ్యాధులకు మాత్రమే చికిత్స ఉంటే ప్రస్తుతం 3400 పైచిలుకు వ్యాధులను చేర్చారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గతంలో వైద్యులు కూడా ఉండే పరిస్థితి లేదని, ప్రస్తుతం పీహెచ్‌సీల్లో ఏకంగా ఇద్దరు వైద్యులను నియమించారని చెప్పారు. ఇద్దరు వైద్యుల్లో ఒకరు 104 వాహనంలో మండలంలోని గ్రామాలకు వెళ్ళి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉత్తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలోనూ ప్రజలకు ఉచిత వైద్యసేవలు సకాలంలో అందుతాయని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 36 వాహనాలు అందుబాటులో ఉన్నాయని, తాజాగా 16 వచ్చాయని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులను సైతం నాడు–నేడులో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, 108 జిల్లా మేనేజర్‌ గణేష్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్‌.సుధీర్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ నెరుసు చిరంజీవి, మాజీ చైర్మన్‌ మంచెం మైబాబు, ప్రభుత్వ బోధనాసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యులు మున్నుల జాన్‌గురునాథ్‌, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాస్‌, యర్రంశెట్టి సుమన్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు