క్యాండిల్‌ సిస్టర్స్‌: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!

15 Nov, 2023 09:30 IST|Sakshi

వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. కానీ, అహ్మదాబాద్‌ వాసులైన ప్రియాంషి, యశ్వి అక్కాచెల్లెళ్లు ఐదేళ్ల క్రితం తల్లి ఇచ్చిన పాకెట్‌మనీ 2,500 రూపాయలతో జార్‌ క్యాండిల్స్‌ తయారీని ప్రారంభించారు. నేడు ఏడాదికి 25 లక్షల టర్నోవర్‌ని సాధిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటూనే జాయిస్‌ బీమ్‌ క్యాండిల్‌ వ్యవస్థాపకులుగా, వ్యాపారవేత్తలుగా మారిన ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘మా జీవితాల్లో మేమే వెలుగులను నింపుకుంటున్నాం’ అని తమ వెంచర్‌ గురించి ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచుతున్నారు.

అక్కా చెల్లెళ్లలో ముందుగా యశ్వి మాట్లాడుతూ – ‘అహ్మదాబాద్‌లోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ చదివాను. కోర్సులో పారిశ్రామిక శిక్షణా యూనిట్‌ అనే సబ్జెక్ట్‌ కూడా ఉంది. ఇందులో మెలకువలు నేర్చుకున్నాను. ఏడాది పొడవునా సీజన్‌కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే వాళ్లం. వీటి ద్వారా మొదట్లో నెలకు వెయ్యి రూపాయలే వచ్చేది. ఆ తర్వాత ఈ పనే ప్రధానంగా చేసుకున్నాం. దీపావళి సమయంలో కొవ్వొత్తులతో పాటు సోప్‌ సొల్యూషన్స్, లిప్‌ బామ్‌లు అమ్మేవాళ్లం. చాలా సార్లు పెద్ద కంపెనీలకు, ఇంటింటికీ వెళ్లి ఉత్పత్తులను డోర్‌ టు డోర్‌ మార్కెటింగ్‌ చేసేదానిని.

ఈ సమయంలో మా స్వంత కలను గుర్తించాం. కాలేజీ సమయంలో మూడేళ్ల పాటు చేసిన ఈ ప్రయత్నానికి మా అక్క ఆలోచనలు కూడా తోడయ్యాయి. అమ్మ కూడా మాకు సపోర్ట్‌గా నిలిచింది. ఐదుగురితో క్యాండిల్స్‌ తయారీ ప్రారంభించి, 50 కొవ్వొత్తులను మాత్రమే తయారు చేశాం. వాటిని ఒక ఫెయిర్‌లో ప్రదర్శించాను. అన్ని ఖర్చులు తీసివేస్తే 700 రూపాయల లాభం వచ్చింది. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మా నాన్నకు నచ్చలేదు.

ఇరవై ఏళ్లు దాటుతూనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడమే ప్రధానంగా భావించేవారు. ఆడపిల్లలు సొంతంగా ఆలోచించడానికి వీలు లేని చోటు. దీంతో నాన్న మమ్మల్ని ఆదుకోలేదు. కానీ, ఈ రోజు మమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. మొదట్లో మా బంధువుల్లో ఫలానా వాళ్ల కూతుళ్లు ఇంట్లో టైమ్‌ పాస్‌ చేస్తున్నారు అనుకునేవారు. కానీ, ఈ రోజు మా ఎదుగుదల చూసి బంధువులకు కూడా మా బలం ఏంటో అర్థమైంది. ఆంక్షలు ఉన్నప్పటికీ సాధించాలన్న మా తపనకు అవేవీ అడ్డంకి కాలేదు’ అని వివరిస్తుంది. 

నిశితంగా పరిశీలన
ముడిపదార్థాలను కలపడం, మ్యాజికల్‌ ఫార్ములాను సెట్‌ చేయడం యశ్వి చూస్తుంటే, ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ ప్రచారాల మార్కెటింగ్‌ వ్యూహాలను రూపొందించే బాధ్యత అక్క ప్రియాంషి తీసుకుంది. తమ ఉత్పత్తుల గురించి ప్రియాంషి మాట్లాడుతూ – ‘మా చేతితో తయారుచేసిన జార్‌ కాండిల్స్‌ మాకో ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఆర్గానిక్, నాన్‌ టాక్సిక్‌ ముడి పదార్థాలను మాత్రమే ఈ తయారీలో ఉపయోగించడం వల్ల పర్యావరణ అనుకూలమైనవని మా అభిప్రాయం. ఇందుకు మేం గర్వపడుతున్నాం.

తయారీ నుంచి ప్యాకేజ్, కస్టమర్లకు మా ఉత్పత్తులను చేర్చడం వరకు ప్రతి దశను నిశితంగా పర్యవేక్షిస్తాం. కచ్చితమైన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మా జాడీలను ఎనిమిదిసార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. దీని వల్ల కస్టమర్లకు నాణ్యమైన జార్‌ క్యాండీలను అందించగలుగుతున్నాం. కొవ్వొత్తులు కేవలం కాంతిని మాత్రమే అందించవు. మేం తయారు చేసే క్యాండిళ్లలోని కంటికి ఇంపైన రంగులు, హాయి గొలిపే పరిమళాలు మనసును ఆనందానికి లోను చేస్తాయి. ఈ పనిలో శ్రద్ధ చాలా కీలకం. నమ్మి చేస్తాం కనుక ఫలితం కూడా చూస్తున్నాం’ అని ఆనందంగా వివరిస్తుంది. ఒక చిన్న ఆలోచనను అమలులో పెట్టి, దానికి సృజనాత్మకతను జోడించి అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

(చదవండి: కేరళ నుంచి ట్రినిటీ కాలేజీకి)
  

మరిన్ని వార్తలు