ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..ఎందుకో తెలిస్తే షాకవ్వుతారు!

20 Oct, 2023 18:48 IST|Sakshi

కరోనా టైంలో లాక్‌డౌన్‌, హోం క్యారంటైన్‌ వంటి పదాలని విని హడలిపోయాం. ఆ కరోనా మహమ్మారికి భయపడి అంతా స్వీయనిర్బంధంలో బిక్కుబిక్కుమని గడిపాం. అయిన వారితో సహా ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా గడపాల్సిన దారుణమైన దుస్థితితో ఎన్నో అవస్థలు పడ్డాం. హమ్మయ్యా! అని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. చాలా వరకు పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఆ గడ్డు రోజులు తల్చుకుంటునే వామ్మో! అని హడలిపోతాం. అలాంటిది ఈ వృద్ధుడు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే జీవిస్తున్నాడు. అది కూడా అతనికి ఎలాంటి అంటు రోగం లేకపోయిన ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా తనను తాను నిర్బంధించుకుని ఎందుకు ఉంటున్నాడంటే..

వివరాల్లోకెళ్తే..71 ఏళ్ల ఆఫ్రికన్‌ వ్యక్తి తనను తాను నిర్బంధించుకుని ఎవ్వరితోనూ సంబంధాలు లేకుండా ఏకాకిగా బతుకుతున్నాడు. అతను ఎందుకిలా జీవిస్తున్నాడో వింటే ఇలాంటి భయాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. జంతువులు, నీళ్లు, నిప్పు తదితర భయాలు గురించి వాటి తాలుకా ఫోబియాల గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత అరుదైన ఫోబియా గురించి విన ఉండే అవకాశమే లేదు. ఐతే ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్న విచిత్రమైన భయం ఏంటంటే ఆడవాళ్లు. మహిళలా!.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అతడికి మహిళలంటేనే చచ్చేంత భయం. మహిళ గాలి సైతం తనను తాకకూడదని ఇలా 55 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. పైగా ఇంటి చుట్టూ కంచె కూడా వేసుకున్నాడు.

ఇలా ఆ వృద్ధుడు 16 ఏళ్ల ప్రాయం నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు. విచిత్రం ఏంటంటే అతడికి మహిళలంటే భయం కానీ అతడు ఆ మహిళల సాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి సాయం చేసేది ఇరుగుపొరుగు మహిళలే. అ వ్యక్తి తన చిన్నతనం నుంచి ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడని, బయటకు అస్సలు రాడని చెబుతున్నారు చుట్టుపక్కల మహిళలు. పొరపాటున ఏ మహిళ అయినా అతడి ఇంటి ఆవరణలోకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించిన నిమిషం ఆలస్యం చేయకుండా తలుపువేసేసుకుంటాడని తెలిపారు. అతనికి మహిళలంటే చచ్చేంత భయం అని చెబుతున్నారు స్థానికులు. ఈ భయం కారణంగా ఆ వ్యక్తి 77 ఏళ్ల వచ్చినా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చివరికి అతడు ఏ పని చేయలేని స్థితికి వచ్చేశాడు. అతడి దుస్థితిని చూసి చుట్టుపక్కల మహిళలు తమకు తోచిన రీతలో  ఆహారపదార్థాలను అతడి వాకిట్లో ఉంచి వెళ్లిపోతారు. అతడు మాత్రం వారు వెళ్లిపోయాక మెల్లిగా వాటిని తీసుకుంటాడు. 

ఇలా వేరొక జెండర్‌ని చూస్తే భయపడే మానసిక స్థితిని గైనోఫోబియా అంటారు. అతడు తీవ్రమైన గైనోఫోబియాతో బాధపడుతున్నాడు. దీన్ని వైద్య పరిభాషలో డయాగ్నోస్టిక్‌ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్‌గా పిలుస్తారు. దీన్ని క్లినికల్‌ పరంగా ఓ నిర్ధిష్ట భయంగా చెబుతారు వైద్యులు. ఈ ఫోబియ ఉన్నవాళ్లు స్త్రీల పట్ల అహేతుకమైన భయంతో ఉంటారట. తరుచుగా వారి గురించి ఆలోచించడంతో ఒక విధమైన ఆందోళనకు దారితీసి క్రమంగా మరింత తీవ్రమైపోతుంది. ఫలితంగా ఆయా వ్యక్తులు పొరపాటున మహిళలను చూడగానే చెమటలు పట్టేసి, శ్వాస ఆడనట్లుగా అయిపోయి ప్రాణాలు కోల్పేయే పరిస్థితికి వచ్చేస్తారని చెబుతున్నారు వైద్యులు.

(చదవండి: అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్‌ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!)

మరిన్ని వార్తలు