కల్పసూత్రాలు

2 Nov, 2020 06:54 IST|Sakshi

భారతదేశ సంస్కృతి సమస్తం వివిధ రకాల ధర్మాలమీద నిర్మించబడింది. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది భారతదేశ నినాదం అయింది. అంటే, ధర్మాన్ని రక్షించండి, దానిచేత రక్షించబడండి అని అర్థం. ‘ధృ‘ అనే సంస్కృత ధాతువునుండి ‘ధర్మ’ అనే పదం పుట్టింది. దీనికి ‘కలిపి వుంచు’ లేదా ‘నిలబెట్టు’ అని అర్థం. అసలు ఈ ధర్మాలు అంటే ఏంటి..? ఇవి ఎప్పటివి..? ఎవరు రచించారు ..? వేదకాలంలో వీటికి ప్రాముఖ్యత వుందా..? ఇలాంటి విషయాల గురించిన వివరణే ఈ వ్యాసం..!

భారతదేశంలో ప్రతి మనిషి పాటించాల్సిన నాలుగు ధర్మాలు, బ్రహ్మచర్య,  గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాలు. వీటినే ఆశ్రమ ధర్మాలు అంటారు. ఇవి మనిషి జీవితంలో ఎదురయ్యే నాలుగు దశలు. మనిషి, బ్రహ్మచర్యాశ్రమం లో బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, గురువు ఇంటిదగ్గరే వుండి, గురువుకు సేవలు చేస్తూ విద్యాభ్యాసం చెయ్యాలి. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత, గురువు అనుమతితో, ఒక యోగ్యురాలైన కన్యను పెళ్ళిచేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యాశ్రమంలోనుండి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. అందులో పంచ యజ్ఞాలను ఆచరిస్తూ, నిత్య నైమిత్తిక కర్మలను నిర్వర్తిస్తూ, గృహస్థు ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించి, తన సంతానానికి పెళ్ళిళ్ళు జరిపించి, మనుమ సంతానంతో గడిపిన తర్వాత, భార్యతో సహా అడవులకు వెళ్ళి వానప్రస్థ ఆశ్రమాన్ని ప్రారంభించాలి. ఆపైన లౌకిక జీవితంతో అనుబంధాన్ని విడిచిపెట్టి, సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, భిక్షాటన చేస్తూ, మోక్షగామియై పూర్తిగా దైవచింతనలో పారమార్థిక జీవితాన్ని గడపాలి. వీటిలో మరలా ఒక్కొక్క ఆశ్రమధర్మానికి విడివిడిగా మనిషి పాటించాల్సిన అనేక ధర్మాలను చెప్పియున్నారు.

వేద వాఙ్మయంలో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అనేవి ఆరుశాస్త్రాలు. వీటినే షడంగాలు అంటారు. వీటిలో మొదటి నాలుగు శాస్త్రాలు, వేదాలను చదివే జ్ఞానాన్ని ఇస్తే, ఐదవదైన జ్యోతిష్య శాస్త్రం ఖగోళవిజ్ఞానాన్ని ఇస్తుంది. బ్రహ్మచర్యాశ్రమంలో, ఒక వ్యక్తి, విద్యార్థిగా ఈ అయిదు శాస్త్రాలని అధ్యయనం చేసిన తరువాత, తను భవిష్యత్తులో పాటించాల్సిన ధర్మాల గురించి తెలుసుకోవడానికి కల్పశాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. ఆరవదైన కల్పశాస్త్రం మనిషి చెయ్యాల్సిన కర్మలను గురించి, నెరవేర్చాల్సిన ధర్మాలని గురించి చెప్తుంది. అందుకే కల్పాన్ని వేదపురుషుని బాహువులుగా చెప్తారు. ఈ కల్ప శాస్త్రాలే భారత దేశ సంస్కృతికీ, సాంప్రదాయాలకీ, ఆచార వ్యవహారాలకీ, యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకీ, గర్భాదానం మొదలుకుని సమస్త సంస్కారాలకీ, ఆశ్రమ   ధర్మాల వారీగా మానవులు పాటించాల్సిన ధర్మాలకీ, మనిషి నడవడికకీ, నైతిక విలువలతోకూడిన ధార్మిక సమాజ నిర్మాణానికీ ఆధారం. ప్రపంచంలో, భారతదేశాన్ని ధార్మిక దేశంగా, కర్మభూమిగా మహోన్నతమైన స్థానంలో నిలబెట్టింది ఈ కల్పసూత్రాలే. ప్రపంచ వ్యాప్తంగా ఇతరదేశస్తులు మన ధర్మాలకు ఆకర్షితులవుతున్నారంటే, ఈ కల్ప సూత్రాలే కారణం. ఈ కల్పసూత్రాలను క్రీ.పూ 800 ప్రాంతంలో రచించినట్లు మనకు ఆధారాలున్నాయి. అంటే, సుమారు మూడువేల సంవత్సరాలనుండి భారతీయులు ఒక క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన పారమార్థిక జీవితాన్ని గడుపుతున్నారు. దీనినిబట్టి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల మూలాలు ఎంతపురాతనమైనవి, దృఢమైనవో అర్థం చేసుకోవచ్చు.
 – ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు 

మరిన్ని వార్తలు