చీరపైన బాపూ బొమ్మ

12 Aug, 2022 00:57 IST|Sakshi
చీరలో ఐఎఎస్‌ హరిచందన. ఫ్యాషన్‌ డిజైనర్‌ హేమంత్‌సిరి.

బాపు బొమ్మల అందం గురించి ఎంత వర్ణించినా.. మనవైన చేనేతల ఘనత గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు.
ఇక, ఈ రెండింటి కాంబినేషన్‌లో వచ్చిన కళా సోయగాలను ఎంత చూసినా తనివి తీరవు.
ఆ అందమైన కాంబినేషన్‌ను నారాయణపేట చేనేత చీరల మీదకు వచ్చేలా రూపుకట్టారు హైదరాబాద్‌ వాసి, ఫ్యాషన్‌ డిజైనర్‌ హేమంత్‌సిరి.
ఈ కొత్త కాంబినేషన్‌ గురించి, ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఆమె మాటల్లోనే..

‘నాలుగేళ్లుగా ప్రతి యేడాది ఆగస్టు నెలలో మన తెలుగురాష్ట్రాల చేనేత కారులతో కలిసి ‘తస్రిక’ పేరుతో ఒక వేడుక నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో హ్యాండ్లూమ్స్‌ని యువత కోసం ఇండోవెస్ట్రన్‌ డ్రెస్‌లు రూపొందించాను. ఈ క్రమంలోనే నారాయణ పేట చేనేతకారులను కలిసినప్పుడు, వారి డిజైన్స్‌ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నారాయణ పేట చీరలు సాధారణంగా ప్లెయిన్‌లోనే ఉంటాయి. అయితే అందరినీ ఆకర్షించాలంటే వీటిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనిపించింది. దీంతో కిందటేడాది లేపాక్షి డిజైన్స్‌ని నారాయణ పేట్‌ కాటన్‌ శారీస్‌మీదకు తీసుకువచ్చాం.

బాపూ స్మరణం
ఈ నెలలో బొమ్మల బాపూ వర్ధంతి ఉంది. హ్యాండ్లూమ్‌ డే కూడా ఈ ఆగస్టు నెలలోనే. బాపూగారిని తలుచుకోగానే మనకు ఆ ముగ్గులు, బొమ్మలు.. మన మదిలో అలా నిలిచిపోతాయి. దీంతో ఈ యేడాది బాపూ బొమ్మలను డిజిటల్‌ ప్రింట్లుగా నారాయణ పేటæపట్టు చీరల మీదకు తీసుకువచ్చాను. ఆ బొమ్మల రూపును నా డ్రెస్‌ డిజైన్స్‌పైకి తీసుకురావాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. కానీ, నారాయణ పేట హ్యాండ్లూమ్స్‌కైతే మరింత బాగుంటుందని అనుకున్నాను. నారాయణæపేట పట్టు చీరల మీద డిజిటల్‌ ప్రింట్ల అందం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నది కూడా దీని వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ బాపూ బొమ్మల కాన్సెప్ట్‌ని ఐఎఎస్‌ హరిచందన, ఇతర అధికారులు చాలా అభినందించారు.

చేనేత కారులకు మార్కెటింగ్‌
ప్లెయిన్‌గా ఉన్న హ్యాండ్లూమ్స్‌కి మరిన్ని హంగులు అద్దడం వల్ల ప్రజల్లోకి వీరి చేనేతలు మరింత వేగంగా వెళతాయి. చీరలపై డిజిటల్‌ ప్రింట్లు సులువుగానూ వేయచ్చు. స్థానికంగా బ్లాక్‌ప్రింట్, డిజిటల్‌ ప్రింట్‌ యూనిట్స్‌ని ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కారులకు మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి.  
నారాయణ పేటæ చీరలు అనగానే పెద్దవాళ్లు కట్టుకునేవి అనే అభిప్రాయం ఉండేది. ఆ ఆలోచన మార్చాలనే టీనేజర్స్‌ కూడా ఇష్టపడేలా పేస్టల్‌ కలర్స్, మోటిఫ్స్‌లోనూ మార్పులు తీసుకురావడంపై కృషి జరుగుతోంది. చేనేతకారులకు అవకాశాలు మెరుగవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని వివరించారు ఈ ఫ్యాషన్‌ డిజైనర్‌.

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు