Bathukamma: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?

21 Sep, 2022 17:30 IST|Sakshi

పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి.. చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. 

తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈసారి సెప్టెంబరు 25(ఎంగిలిపూల బతుకమ్మ)న ఈ సంబరాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా పండుగ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలు

బతుకమ్మ.. బతుకునీయవమ్మా!
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. సాధారణంగా గునుగు, గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, గోరంట్ల పూలు పట్టుకుచ్చులు(సీతజడ పూలు) స్థూపాకారంలో వరుసలుగా పేర్చి.. పైభాగం మధ్యలో ‘గౌరమ్మ’ను పెడతారు.

గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు.. పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గరూపంగా.. బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మా(జీవించు అని అర్థం).. మాకు బతుకునీయవమ్మా(మమ్మల్ని చల్లగా చూడు తల్లీ) అని పాటలతో అమ్మను వేడుకుంటారు.

బతుకమ్మ పండుగ నేపథ్యం
బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాట ప్రకారం... ధర్మాంగధుడు అనే రాజుకు వంద మంది కుమారులు పుట్టి చనిపోయారు. 

దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపున ఆ లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు. వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది. ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు ‘నువ్వు ఎల్లకాలం బతుకమ్మ’ అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది.

చిన్న కోడలు కథ
ఇక బతుకమ్మ చుట్టూ చేరి.. పండుగకు కారణమైన కథను గానం చేసే పల్లె ప్రజల పదాల ఆధారంగా.. బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యం పొందింది. 

దాని ప్రకారం.. అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఓ చిన్న కోడలు. వారి ఊరికి జీవనాధారం చెరువు. ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడటంతో మత్తడి దుంకుతుంది. ఎడతెరిపి లేని వానల వల్ల చెరువు నిండి కట్టకు గండిపడుతుంది. 

గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే, చెరువు కట్ట అంటే అక్కడ మైసమ్మ(గ్రామ దేవత) కొలువు ఉంటుందని చాలా మంది నమ్మకం. ఆమే చెరువుకు రక్షణగా ఉంటుందని భావిస్తారు.

అందుకే కట్ట నిలవాలంటే మైసమ్మను శాంతింపచేయాలని రాజు, ప్రజలు భావిస్తారు. కట్టను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు. ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకు కూడా బర్రెల మంద ఉందని సమాధానమిస్తుంది.

ఆవుల మంద, గొర్రెల మంద, మేకల మంద.. ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయని చెబుతుంది. దీంతో ఆ రాజు.. తమ ఊరి బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెబుతాడు.

కానీ.. ఆ గ్రామ దేవత శాంతించదు. ఎటూపాలుపోని స్థితిలో ఆ రాజు చిన్న కోడల్నిస్త ఉయ్యాలో.. కట్ట నిలుపే మైసు ఉయ్యాలో అని రాగం అందుకోగానే మైసమ్మ సంతృప్తి పడుతుంది. కట్ట తెగకుండా ఆపుతుంది.

ఇక అన్న మాట ప్రకారం రాజు ఇంటికెళ్లి తన చిన్న కోడలిని చెరువు దగ్గరకు తీసుకువచ్చేందుకు పూనుకుంటాడు. కానీ.. ఆమెకు తను చేయాల్సిన త్యాగం గురించి చెప్పడు. అయితే, చిన్న కోడలి పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ.. అన్ని పనులు పూర్తయ్యాయని ఆమె చెప్పగానే చెరువుకు పోయి నీళ్లు తెమ్మని చెబుతాడు.

మామ మాటను గౌరవించి ఆ చిన్న కోడలు బిందె పట్టుకుని చెరువు దగ్గరకు వెళ్తుంది. అయితే, ఎంత ముంచినా బిందె మునగదు. నడుము లోతు వరకు వెళ్లినా అదే పరిస్థితి. అంతలో ఆ రాజు కల్పించుకుని ఇంకొంచెం లోపలికి పొయ్యి నీళ్లు తే అని చెబుతాడు.

అలా మరింత లోతుకు వెళ్లిన ఆమె బిందెతో పాటు చెరువులో మునిగిపోతుంది. తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న ఆ తల్లి.. తన తల్లిదండ్రులకు బిడ్డ లేదని, త బిడ్డకు తల్లి లేదని చెప్పమంటూ పాటు పాడుతూ పూర్తిగా మునిగిపోతుంది. బొడ్డెమ్మనై.. మళ్లీ వస్తానంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది.

అయితే, ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్లలో తేలతాయి. ఊరి కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆడబిడ్డ తాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ.. బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే ఉంటుందని.. పూలతో ఆమెను పూజించుకుంటామని ఊరి వాళ్లంతా చెప్పినట్టు కథ సాగుతుంది. ఇవేగాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
-వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు