Beauty Tips In Telugu: ఇలా చేస్తే ముడతలు మాయం.. అరటి పండు, క్యారెట్‌ గుజ్జు, కాఫీ పొడి... ఇంకా

15 Feb, 2022 12:15 IST|Sakshi

Beauty Tips: ముఖం కాంతిమంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం చాలా మంది బ్యూటీ పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే తక్కువ ఖర్చుతోనే మెరిసే మేని, మృదువైన, ముడతలు లేని ముఖ సౌందర్యం మీ సొంతమవుతుంది.

అరటిపండుతో ఇలా
రెండు టీస్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. రోజుమార్చి రోజూ ఈ విధంగా చేయడం వల్ల ముఖ చర్మం లోతుగా శుభ్రపడి మెరుపుని సంతరించుకుని యవ్వనంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్‌ క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల వదులుగా మారిన చర్మం బిగుతుగా మారుతుంది. 

క్యారట్‌ గుజ్జును కలిపితే 
అరటి పండు గుజ్జుతో క్యారెట్‌ గుజ్జును కలిపి ప్యాక్‌ చేసి ముఖానికి వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కావలసినవి: క్యారెట్‌ గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్స్, అరటిపండు గుజ్జు –  2 టేబుల్‌ స్పూన్స్‌, పెరుగు – అర టేబుల్‌ స్పూన్, తేనె – పావు టేబుల్‌ స్పూన్.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని... క్యారెట్‌ గుజ్జు, అరటిపండు గుజ్జు మిక్స్‌ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పెరుగు, తేనె కలుపుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి ఓ 20 నిమిషాలు పాటు బాగా ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో మొత్తం క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

కాఫీ పొడితో మృతకణాలు మాయం
ఫిల్టర్‌లో వేయడానికి ఉపయోగించే కాఫీ పొడి (ఇన్‌స్టంట్‌ కాఫీ పౌడర్‌ కాదు)ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుని కొద్ది నీటితో పేస్టు చేయాలి. ఆ పేస్ట్‌ని ఒంటికి రాసి, ఐదునిమిషాల తర్వాత వలయాకారంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వు కణాలు, మృతకణాలు రాలిపోవడంతోపాటు చర్మం శుభ్రపడుతుంది. మృదువుగా మారుతుంది.

చెడు వాసన వస్తుంటే..
రెఫ్రిజిరేటర్‌లో చెడు వాసన వస్తుంటే... దూదిలో వెనిల్లా పౌడర్‌ వేసి ఫ్రిజ్‌లో ఒక మూలగా ఉంచితే చాలు. ఒక గంట సేపటికి చెడు వాసన మాయమైపోతుంది.
ఫ్లోరింగ్‌ టైల్స్‌ను ఎంత శుభ్రంగా తుడిచినా మురికిగానే కనిపిస్తుంటాయి.
అలాంటప్పుడు అమ్మోనియా కలిపిన నీటిలో స్పాంజ్‌ను ముంచి టైల్స్‌ తుడిస్తే తళతళమెరుస్తాయి. 

చదవండి: జుట్టు రాలడానికి మందులు కూడా ఓ కారణమే.. ఆ మందులు ఇవే..

మరిన్ని వార్తలు