మసిబారిన పసితనం

16 Nov, 2020 00:34 IST|Sakshi

కొత్త బంగారం

నవల : షగ్గీ బెయిన్‌
రచన : డగ్లాస్‌ స్టువర్ట్‌
ప్రచురణ : గ్రోవ్‌; 2020

డగ్లాస్‌ స్టువర్ట్‌ రాసిన తొలినవల ‘షగ్గీ బెయిన్‌’ బుకర్‌ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్‌ కావడం వెనకాల తొమ్మిది వందల పేజీల మొదటి డ్రాఫ్ట్‌మీద పన్నెండేళ్లపాటు కృషి చేసిన శ్రమ ఉంది. కొంతవరకూ ఆటోబయోగ్రఫికల్‌ నవల కూడా కావడంతో నవలలోని వేదన– బరువునీ, వాస్తవికతనీ, మనసుని కదిలించగల శక్తినీ సంతరించుకుంది. యు.కె.లోని స్కాట్లాండ్‌ నేపథ్యంలో గత శతాబ్దపు ఎనభ య్యవ దశకంలో సాగే నవలలో కొన్ని చారిత్రకాంశాలు కూడా కలగలిసిపోయి ఉన్నాయి.

మార్గరెట్‌ థాచర్‌ అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల పరిశ్రమలు దెబ్బతిని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి కూరుకుపోవడం, నిరుద్యోగులై వారిలో చాలామంది వ్యసనాలకి బానిసలైపోవడం, కొంతమంది ఆడవాళ్లు కూడా మద్యానికి బానిసలైపోయి కుటుంబాలు వీధిన పడటం నవలలో సమాంతరంగా కనిపించే అంశాలు.

1981లో కథ ప్రారంభమయ్యేనాటికి ఆగ్నెస్‌కి మూడు పదుల పైన వయసు, ఎలిజబెత్‌ టేలర్‌కి ఉన్నంత అందచందాలు ఉన్నాయి. మొదటి వివాహంలోని యాంత్రికతని భరించలేక, ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న షగ్‌తో వచ్చేసి, తల్లిదండ్రుల ఇంట్లో కాపురం పెట్టిన ఆగ్నెస్‌కి ద్వితీయ వివాహంలో ఐదేళ్ల షగ్గీ బెయిన్‌తో బాటు, మొదటి వివాహంలో పుట్టిన కొడుకు లీక్, కూతురు కేథరిన్‌ సంతానం.

స్వతహాగా అందగాడైన భర్త పలు అక్రమ సంబంధాలని పెట్టుకోవడం, చివరికి తన స్నేహితురాళ్లతోనే బాహాటంగా తిరుగుతూండటం వాళ్ల సంసారం బీటలు వారడానికీ, ఆగ్నెస్‌ తాగుడుకి బానిస కావడానికీ కారణమవుతుంది. ఈ స్థితిని చక్కదిద్దడానికా అన్నట్టు, షగ్‌ తన సంసారాన్ని ఊరికి దూరంగా ఉన్న బొగ్గు గనుల కాలనీకి మారుస్తాడు. ఈ స్వతంత్ర జీవనంవల్ల తన కాపురం మెరుగవుతుందనుకున్న ఆగ్నెస్‌ ఆశపడుతుంటే, షగ్‌కి ఉన్న ఆలోచనలు మాత్రం వేరు. అదే రోజున తన సామానుతో షగ్‌ బయటికి వెళ్లిపోతాడు. మూతపడిన బొగ్గుగనికి అనుబంధంగా ఉన్న ఆ కాలనీలో పేదరికం, వ్యసనాలు రాజ్యమేలుతుంటాయి.

ప్రభుత్వం ఇచ్చే బొటాబొటీ భృతితోనే సంసారాన్ని నడపాల్సిన పరిస్థితుల్లో సైతం ఆగ్నెస్‌ తన బలహీనతలోకి మరింత కూరుకుపోతుంటుంది. అవకాశం కోసం పొంచివుండే ‘అంకుల్స్‌’ మద్యం ఎరతో ఆగ్నెస్‌ని వాడుకుంటూంటారు. యుక్తవయసొచ్చిన కూతురు కేథరిన్‌ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పెళ్లిచేసుకుని ఆఫ్రికాకి వెళ్లిపోతుంది. ఆర్ట్‌ క్లాసులకి వెళుతుండే కొడుకు లీక్‌ ఇంటి పరిస్థితులని భరించలేక సాధ్యమైనంతవరకూ ఇంటికి దూరంగా ఉంటూంటాడు. తల్లి సంరక్షణ కోసం వయసుకి మించిన బాధ్యతని తలకెత్తుకోవాల్సి వచ్చిన షగ్గీ బెయిన్‌కి ఇంకో వ్యక్తిగత సమస్య కూడా ఎదురవుతుంది: తనలో శారీరకంగా వస్తున్న స్త్రీ లక్షణాల వల్ల కలుగుతున్న గందరగోళం, ఎదురవుతున్న అవహేళనలు. నలభై యేళ్ల క్రితం సమాజంలో ఇలాంటి సమస్య పట్ల ఎలాంటి చిన్నచూపు ఉండేదో ఊహించవచ్చు.

మధ్యలో తాగుడు వదిలేయాలని ప్రయత్నించి, ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్న ఆగ్నెస్‌ స్థిరచిత్తంతో సంవత్సరం పాటు ఉండగలుగుతుంది కానీ, అప్పుడు పరిచయమైన యూజీన్‌ అనే వ్యక్తి వల్ల మళ్లీ అదే బిలంలోకి జారిపోతుంది. కాలం గడుస్తున్నా వ్యసనం నుంచి బయటపడలేని ఆగ్నెస్, తనున్న లైంగికతా చట్రాన్ని దాటుకోలేని షగ్గీ– ఇద్దరూ భౌతికమైన సమస్యలతో బాధపడుతున్నవారే; ఇద్దరూ ఆ సమస్యలు çసృష్టిస్తున్న మానసిక వైకల్యాలకి లోనవుతున్నవారే; ఇద్దరూ వాటి నుంచి బయటపడి సమాజం శాసించే ‘నార్మాలిటీ’ అందుకుందామని ప్రయత్నిస్తున్నవారే. కానీ, గమ్యాన్ని చేరుకోవడమే ఇద్దరికీ కష్టంగా ఉంది. ఆ దూరాన్ని దాటడానికి ఇద్దరూ చేసిన ప్రయాణం, నిలుపుకున్న పరస్పర ప్రేమాభిమానాల మీదుగా మిగతా కథ నడిచి, ఊహించగలిగిందే అయినా మలుపు దగ్గర ఆగిపోతుంది. 

నవలలో విరివిగా కనిపించే స్కాటిష్‌ మాండలీకం ఎక్కడా ఇబ్బంది కలిగించదు కానీ, ఒకే తరహా సన్నివేశాలు పునరావృతమవడం వల్ల నవల ప్రభావం స్వల్పంగా పలచబడినట్టనిపిస్తుంది. స్వీయచరిత్రాంశాలు ఉన్న కారణంగా బహుశా అది అనివార్యం కావొచ్చేమో కానీ, నిడివి విషయంలో(448 పేజీలు) మరింత జాగ్రత్త వహించి కుదించివుంటే, పఠనానుభూతి మరింత గాఢంగా ఉండేది! 
- ఎ.వి.రమణమూర్తి

మరిన్ని వార్తలు