మాటా...  మంటా రెండూ ఒక్కటే !

2 May, 2022 00:34 IST|Sakshi

శతక నీతి – సుమతి

ఏది చెయ్యాలన్నా ప్రప్రథమం గా కావలసింది నీరే. అది అమృతంతో సమానం. ఆపోమయప్రాణః ..అది వేదం . ప్రాణమంటే నీరే. తనంత తానుగా ఎంతకాలం నీటిని శరీరంలోకి పుచ్చుకోగలుగుతాడో, శరీరంలోని కల్మషమైన నీటిని తనంతతానుగా విడిచిపెట్టేయ గలుగుతాడో అంతకాలం శరీరం ప్రాణాలను నిలబెట్టు కుంటున్నదని గుర్తు. నీరు శరీరంలోకి వెళ్లకపోయినా, వెళ్ళిన నీరు శరీరంలో నిలబడకపోయినా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తు. అంటే ప్రాణం నీటి చేత తయారవుతున్నది... నీరే ప్రాణం.

‘అన్నమయం హి సౌమ్య మనః’. మనస్సు సూక్ష్మ శరీరం. అది తిన్న అన్నం చేత తయారవుతుంది. మనం ఎంత భక్తితో, ఎంత ప్రశాంతంగా, ఎంత నిశ్శబ్దంగా కావాల్సిన ఆహార పదార్థాలను నియమంగా స్వీకరిస్తామో అంత మంచి మనసు ఏర్పడుతుంది. అదే పనిగా మాట్లాడుతూ, ఉద్వేగానికి లోనవుతూ, తాను ఏం తింటున్నాడో తాను తెలుసుకోకుండా ఉద్రేకంతో ఏవేవో మాట్లాడుతూ తిన్నవాడి మనసు కూడా అలాగే తయారవుతుంది. తిన్న అన్నంలో ఆరోవంతు మనసుగా మారుతుందని వేదం చెబుతుంది. కాబట్టి అన్నమే మనసుగా మారుతున్నది.

‘తేజోమయీ వాక్‌..’ అగ్నిహోత్రం వాక్కుగా మారుతున్నది. ఈ మూడూ శరీరానికి అత్యంత ప్రధానమైనవి.  అయితే ఆ వాక్కు ఉండాలన్నా, ఆ మనసు ఉండాలన్నా అసలు ప్రాణం ఉండాలికదా శరీరంలో. ఆ ప్రాణం నిలబడడానికి కారణం నీరు. అటువంటి నీటి పట్ల మనిషి ఎటువంటి శ్రద్ధ చూపాలి. దానిపట్ల ఎంత గౌరవంగా మసులుకోవాలి. భగవంతుడిని చూస్తే ఎలా నమస్కరిస్తామో మొక్క దగ్గరినుంచి సమస్త జీవరాశికి, ముఖ్యంగా మనకు ప్రాణాధారమయిన నీటిపట్ల కూడా అంతే శ్రద్ధాభక్తులతో ఉండాలి. నీరు పరబ్రహ్మమే.

అందుకే ఆ పద్యాన్ని ప్రారంభం చేస్తూనే బద్దెన ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌...’’ అంటూ నోరే రసభరితమయిన నుడువులకెల్లన్‌... అంటున్నాడు...అంటే.. రసభరితమైన వాక్కులన్నింటికీ కూడా నోరే కారణభూతమైనది. రసభరితం అంటే.. ఏదయినా మనకు బాగా ఇష్టమయిన ఆహార పదార్థాన్ని తినేటప్పుడు.. గబగబా తినకుండా కొద్దికొద్దిగా తింటూ సంతోషంగా ఆస్వాదిస్తుంటాం. దాని రుచిని అనుభవిస్తున్నాం. అలాగే  వాక్కులు కూడా రసభరితంగా ఉండాలి. ఏ ప్రాణికీ ఇవ్వని వాక్కును భగవంతుడు మనిషికి ఇచ్చాడు.‘తేజోమయీ వాక్‌..’ అంటే వాక్కుకీ, అగ్నిహోత్రానికీ తేడాలేదు. రెండూ ఒకటే. మంట ఎదురుగా ఉన్న వస్తువును కాల్చేస్తుంది. మాట ఎదుటివారి అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. ఇది తెలియదు – అన్న వాడిని ఇది తెలుసు – అనేటట్లు చేస్తుంది.

చాలా పెద్ద ఆస్తిని పెద్దలు కట్టబెట్టినప్పడు ఒక్క రూపాయి కూడా అదనంగా సంపాదించకుండా దాన్నంతా దుర్వినియోగం చేసేవాడిని సమాజం ఎలా విమర్శిస్తుందో అలాగే భగవంతుడిచ్చిన  ఈ వాక్కును పదిమందికి పనికొచ్చే విధంగా లేదా కనీసం తనను తాను ఉద్ధరించుకోవడానికి ఉపయోగించకుండా వృథా కాలక్షేపానికి, తనను తాను పాడుచేసుకోవడానికి పదిమందిని పాడుచేయడానికి ఉపయోగించడం దారుణం. చనిపోవడానికి సిద్ధమైన వాళ్ళను కూడా మంచి మాటలచేత బతికించవచ్చు. అదే మాటల చేత పచ్చగా బతుకుతున్న వారి చావుకు కూడా కారణం కావచ్చు. మాటలకున్న శక్తి అది. అది తెలుసుకుని ఆ మాటలను వెలువరించే నోటిని రసభరితమైన అమృతం చిలికే మాటలకు ఉపయోగించాలి.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు