మరణంలోకి మేల్కొన్న కల(ము)లు

7 Sep, 2020 00:51 IST|Sakshi

బుగడూరు మదన మోహన్‌ రెడ్డి

‘‘సంగీత మపి సాహిత్యం సరస్వత్వాకుచద్వయం – ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం’’. ఈ ఆలోచన అమృతాన్ని సృష్టించడం అంత సులువు కాదు. భావసాగరంలో ఎన్నో రాత్రిళ్లు అంతర్మథనం జరిగితే తప్ప బయల్పడదు. ఒక రకంగా చెప్పాలంటే అమృత ఉత్పాదనకు జరిగే పూర్వ క్రియ అంతా విషతుల్యమే. ఒక పాశ్చాత్య రచయిత కవిత్వం రాసేటప్పుడు రెండు పదాల మధ్య ఫుల్‌ స్టాప్‌ (.) ఉంచాలా, కామా (,) ఉంచాలా అన్న సందిగ్ధతని తొలగించుకోవడానికి 45 రోజులు పట్టిందట. కవిత్వం పట్ల అంతటి సూక్ష్మతని కలిగి వుంటాడు రచయిత. అందుకే అతడికి గద్ద కళ్ళు, కుక్క ముక్కు, పాము చెవులు ఉండాలని పాశ్చాత్యులు నిర్వచించారు.

కవి సహజంగా నిర్మల హృదయుడు. కానీ అమాయకుల ఆక్రందనలు, శ్రమజీవుల క్షుదార్థులను విన్నా, చూసినా కంపితుడై చెలియలికట్ట దాటే సముద్రుడైపోతాడు. కవిపై  రాజ్యాధికార, ధనిక పక్షాలు ఎప్పుడూ ఒక నిఘా కన్ను వేసివుంటాయి. తప్పనిసరైన పక్షంలో కత్తి, గన్నులను కూడా వాడటానికి వెనకాడని సందర్భాలు వెనకటి చరిత్రలో చాలానే ఉన్నాయి. వీరి నుంచి అంత ప్రమాదం వాళ్ళ మనుగడకి. లేకపోతే అప్పటి సంస్థానాల్లో సొంతంగా రైల్వే వ్యవస్థని నడపగలిగినంతటి నిజాంలకు, ఎక్కడో కూటికి కూడా జరగని బండి యాదగిరిని చంపాల్సినంతటి అవసరమొచ్చివుండేది కాదు. సూర్యుడు అస్తమించని రాజ్యాధి నేతలకు రాసుకోడానికి కమ్మ (కాగితాలు), సిరా బుడ్డీలు కూడా లేని గరిమెళ్ళని జైల్లో నిర్బంధించవలసిన ఆవశ్యకత కూడా లేదు. మరెందుకు వీళ్ళకి, వాళ్ళకి వైరుధ్య భావం? రచయిత ఎప్పుడూ ప్రపంచ ప్రజల వైపుండే ఎన్నుకోబడని శాసనకర్త. చలంలా గుంభనంగా చెప్పుకుంటే ‘కవి ఉన్నాడు అంటే ఆ రాజ్యంలో రెండో ప్రభుత్వం ఉన్నట్లే’.

కవిని మనం ‘ఋషి’పీఠంపై ఆరాధించితే, గ్రీకులేకంగా అతడి ‘ముఖతరహా పలుకునది భగవంతుడే’ అంటారు. ఆ పలుకుల వెనుక రచయితలు ఎంతో వేదనను అనుభవిస్తారు. నిత్యం ఏదో సంఘర్షణలో నలిగిపోతుంటారు. కుహనా రచయితలు వదిలిపెడితే నిబద్ధతా రచయితలకు రచనంటే అగ్నితో సహజీవనమే. మానసికంగా వాళ్ళు చాలా దృఢవంతులు కానీ హృదయపరంగా సున్నితులు. మానిక్‌ డిజార్డర్, హైసూపరాక్టివ్‌ వంటి మానసిక రుగ్మతలు రచయితల్లో ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో వెళ్లడైంది. వాటి తీవ్రత పెరిగితే ఆత్మహత్యల ఆలోచనలు చొరబడతాయి. అలా నిష్క్రమించిన కలాల యోధులు అన్ని ఆధునిక సాహిత్యాల్లోనూ ఉన్నారు. తమ అక్షరాలతో సామాన్యుల జీవితాల్ని మానసిక రుగ్మతల నుంచి విడుదల చేసిన రచయితలే వాటి కబంధహస్తాల్లో చిక్కుబడటం పాఠక çహృదయాలు జీర్ణించుకోలేని వాస్తవం.

పాశ్చాత్య కలాలు
ఎర్నెస్ట్‌ హెమింగ్వే (1899–1961)
ఈ అమెరికన్‌ రచయిత ద సన్‌ ఆల్సో రైజెస్‌ ద్వారా రంగ ప్రవేశం చేసి మొదటి ప్రపంచ యుద్ధంలోని తన అనుభవాల్ని ‘ఎ ఫేర్‌వెల్‌ టు ఆర్మ్స్‌’గా మలిచి గుర్తింపు పొందాడు. ‘ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ’ నవల అయితే ఆయన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది. ఏడాది వ్యవధిలోనే పులిట్జర్‌ (1953), నోబల్‌ (1954) పురస్కారాలు అందించి ప్రపంచవ్యాప్తం చేసింది. నిత్యం ఏదో మానసిక సంఘర్షణ, కలిసిరాని వ్యక్తిగత జీవితం, వంశపారంపర్య వ్యాధి కలిసి 1961లో తనని తాను గన్ను ద్వారా నిష్క్రమింపజేసుకున్నాడు. తల్లి ద్వారా అబ్బిన సంగీత జ్ఞానంగాని, తను జీవం పోసిన ‘శాంటియాగో’ పాత్ర ద్వారా పలికించిన జీవిత సత్యాలుగాని జీవితం పట్ల ఆశ కలిగించకపోవడం మరింత విషాదం.

వర్జీనియా ఉల్ఫ్‌ ( 1882 – 1941):
టు ద లైట్‌హౌజ్, ఓర్లాండో, ఎ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌ లాంటి రచనల ద్వారా ఇంగ్లీషు సాహిత్యంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉల్ఫ్‌. తన రచనల ద్వారా పాఠకులపై ఎంత ప్రభావం చూపిందంటే పోస్టుకార్డులు, ఫొటోఫ్రేములు, హ్యాంకీ, టీషర్టులపై తన ఫొటో వేయగలిగినంతటి అభిమానాత్మక వ్యాపార స్థాయికి ఎదిగింది. ఇంతటి పాఠక ప్రపంచాన్ని ఏలిన వర్జీనియా ‘బైపోలార్‌ డిజార్డర్‌’ ద్వారా మనస్తాపానికి గురై ఊజ్‌ నదిలో మునిగిపోయి, లండన్‌ థేమ్స్‌ నది ఒడ్డున విగ్రహమై తేలింది. తన రచనల్లో ‘జీవిత అనుభూతి మాయమైందని’ పేర్కొన్న తనే జీవితాన్ని పూర్తిగా అనుభవించకపోవడం విచారకరం.

మనదేశంలో తొలితరం ఆధునిక రచయితల్లో ధన్‌ గోపాల్‌ ముఖర్జీ (1890–1936) ఒకరు. ఒకవైపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి రచనలేకాక ఆధ్యాత్మిక, బాల సాహిత్యాలు కూడా రాశారు. ఈ బెంగాలీ రచయితను మెలితిప్పుతున్న మనస్తాపం దెబ్బకి జీవితాన్ని కొనసాగించలేకపోయాడు. ఇదే బాటలో మలయాళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన  ‘ఆత్మావింటే నోవుకల్‌’, ‘మంజుకేటిడం’ రాసిన నందనార్‌ (అసలు పేరు పి.సి.గోపాలన్‌: 1926–74); ‘హృదయస్మితం’, ‘తుషార హారమ్‌’ రాసిన రాఘవన్‌ పిళ్ళే(1909–36) కూడా స్వనిష్క్రమణ చేశారు.

తెలుగు సాహితీ మాగాణిలో....
తెలుగు గడ్డపై కూడా జీవిత కురుక్షేత్రంలో మనస్తాప అంపశయ్యపై నిష్క్రమించిన రచనా భీష్ముళ్ళు ఉన్నారు.

బంగోరె (1938–1982)
నెల్లూరు తెలుగు భాషకందించిన సాహితీ సేవకుల్లో బండి గోపాల్‌ రెడ్డి ఒకరు. విద్యార్థి దశలోనే సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. వేరు వేరు ఉద్యోగాలు చేస్తున్నా తన పరిశోధనల యావ తగ్గలేదు. అది కాస్తా వ్యసనంగా మారి, పూర్తి జీవితాన్ని అంకితం చేశాడు. గ్రంథ పరిష్కారాలు, బ్రౌన్, వేమనపై ప్రాజెక్టు రీసెర్చ్‌ ఆఫీసర్‌గా ఎన్నో అమూల్య గ్రంథాలు వెలికితీసి వెలువరించారు. బ్రౌన్‌ జాబులు, మాలపల్లి నవలపై ప్రభుత్య నిషేధాలు, గురజాడ కన్యాశుల్కం తొలికూర్పు వంటి విలక్షణ మార్గాల్లో పరిశోధనను నడిపే క్రమంలో కుటుంబ బాంధవ్యాలని కోల్పోయాడు. తన పరిశోధనల వల్ల తెలుగు సాహిత్యం బలపడింది గానీ తను మాత్రం ఆర్థిక లేమికి లోనయ్యాడు. మనస్తాప వైరాగ్యంతో భాక్రానంగల్‌ డ్యామ్‌ మీద నుంచి తన జీవితాన్ని కిందికి తోసేసుకొన్నాడు.
పాటలతో ఉర్రూతలూగించిన గరిమెళ్ళ సత్యనారాయణనే గాలికొదిలేసిన ‘ఋణా’నుబంధం మన తెలుగువాళ్ళది. మేధో సంబంధిత పరిశోధనల్లో జీవితాన్ని త్యాగం చేసిన బంగోరెకి గుర్తింపు, చేయూత వంటివి అత్యాశకు దగ్గరగా ఉన్నట్లేనేమో.

డి.రామలింగం (1924–93)
డి.రామలింగం ప్రముఖ కవి దాశరథికి సమకాలీకుడు, సహాధ్యాయి కూడా. నిజాం వ్యతిరేకోద్యమంలో గాంధేయవాదిగా పాల్గొంటూ, కాంగ్రెస్‌ వారి ‘సారథి’ పత్రిక నడపడంలో కీలకంగా వ్యవహరించేవాడు. జైలుజీవితం, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా రచనా వ్యాసంగాన్ని ఆపలేదు. విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత అడ్డుగోడలు, కాగితపు పడవలు వంటి కథా సంపుటాలను వెలువరించడమే కాకుండా తెలుగు కథ, ఒకతరం తెలుగు కథ సంకలనాలు భావి రచయితల కోసం తీసుకురావడంలో సంపాదకత్వ బాధ్యతలు చేపట్టాడు. తనతో సాంగత్యమున్న మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, శొంఠి వెంకటరమణ మూర్తి తదితరుల జీవిత చరిత్రలు, విమర్శా వ్యాసాలు, ఇలా నిరంతర సాహితీ సేద్యం చేశాడు. ఆరోగ్య, మానసిక సమస్యలకి తాళలేక హుస్సేన్‌ సాగర్లో జలప్రవేశం ద్వారా తన జీవిత కథకు అర్ధంతర ముగింపు ఇచ్చాడు. ఇతని పేరు విన్నప్పుడల్లా ఊజ్‌ నదిలో దూకిన వర్జీనియా ఉల్ఫ్‌ గుర్తుకొస్తుంది.

నాగప్పగారి సుందర్రాజు (1968 – 2000) 
‘చండాల చాటింపు’ (కవిత్వం) ‘మాదిగోడు’ (కథలు) ద్వారా దళిత సాహిత్యంలోకి తారాజువ్వలా దూసుకొచ్చాడు సుందర్రాజు. మాదిగల యాసను, పలుకుబడులను ఒడుపుగా వాడి తన కవిత్వంతో సొగసులు అద్దాడు. తన కథల్లో రాయలసీమ దళిత స్త్రీల వెతలను వస్తువుగా చేసుకొన్నాడు. పులికంటి కృష్ణారెడ్డి కథలపై పరిశోధన చేసి ఎస్కే విశ్వవిద్యాలయంలో అధ్యాపక స్థాయికి రాణించాడు. మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు అనుకున్న తరుణంలో సాహిత్యానికి నిరాశను మిగిల్చాడు.

రాప్తాడు గోపాలకృష్ణ జన్మించింది అనంతపురంలోనైనా రచనా వ్యాసంగం కర్నూల్‌ నుంచి ప్రారంభమైంది. ‘ఏదీ ఏక వచనం కాదు’ కవితా సంపుటి ద్వారా సాహితీ లోకంలో ప్రవేశించాడు. ఒడుపుగా రాసిన కథా సంపుటాలలో ఒకటిగా ఆయన ‘అతడు బయలుదేరాడు’ తప్పక ఉంటుంది. ఉత్పత్తి కులాలతో పాటు వృత్తి కులాల వాళ్ల జీవితాలు కూడా అక్షరబద్ధం కావాలని ‘పల్లె మంగలి’ సంకలనం తేవడంలో మిత్రులతో కలిసి కృషి చేశాడు. అప్పుడప్పుడే దళిత బహుజన రచయితలు ఉధృతంగా రాస్తున్న తరుణంలో ఈ అవివాహ కిశోరం మనస్తాపం మబ్బుకు బలైపోయాడు. రచయిత్రి, విమర్శకురాలే కాకుండా జగద్ధాత్రి అనువాదకురాలు కూడా. సహచరం కవితా సంపుటి ఆమెలోని భావుకతకు, హృదయార్ద్రతకు అద్దం పడుతుంది. అనారోగ్యంతో పాటు ఆప్తమిత్రుల లేమివల్ల కలిగిన మనస్తాపం ఆమె మెడను చుట్టూకోగా నిష్క్రమించింది. ‘బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలని’ నినదించిన తెలంగాణ గడ్డ మీద బడిలో పిల్లలకు వాళ్ళ భాషలోనే కథలు రాయాలని తలపోశాడు పెండెం జగదీశ్‌. ‘బడి పిల్లల కథలు’ చూస్తే ఇంట్లో అవ్వ, తాతలు చేసే ‘అనగనగ’ కథారంభాలు, విస్మయ, హాస్య ఎత్తుగడలు, ముగింపులో కొసమెరుపులతో బాల్యం నిద్రలేస్తుంది. బాల సాహిత్యం రాసే జగదీష్‌ హృదయం కూడా బాలల వంటిదే కాబోలు, జీవితం విసిరిన కఠిన సవాళ్లు ఎదుర్కోలేక, మనస్తాప శకటం కిందకు వెళ్లి నలిగిపోయాడు.

వీరేకాక శృంగార రచయితైన గెరార్డ్‌ డి నెర్వాల్‌ (1808–1855), తొలి బిలినీయర్‌ రచయిత జాక్‌  లండన్‌ (1876–1916), రొమైన్‌ గారి (1914–1924), సిజేర్‌ పావేస్‌ (1908–1950), ఆప్తమిత్రులైన బెంజమిన్‌ (1892–1940), వ్లాదిమిర్‌ మయకోవోస్కీ (1893–1930) ఇద్దరూ కూడా వ్యక్తిగత, మానసిక సమస్యలతో స్వయంగా దివికెగిరిపోయారు. జపాన్‌ రచయితలు యసునారి కవబాటా, యూకియో మిషిమా; ఆస్ట్రియా రచయిత స్టెఫాన్‌ త్సై్వక్‌; అమెరికా కవయిత్రి సిల్వియా ప్లాత్‌ నుండి ఊరి చెరువులోకి చెప్పులు వదిలేసి బతుకును నడిపించుకుంటూ వెళ్లిపోయిన తెలుగు కవి చిత్రకొండ గంగాధర్‌ దాకా ఇంకా ఎందరో సున్నిత హృదయులు ఈ జాబితాలో. వ్యక్తిగతంగా ఎంతటి గరళాన్ని మోసివుంటారో తెలపడానికి అర్హులు, నిర్ధారకులు ఉండరు. కవిత్వానికి జీవితం కాకుండా, జీవితానికే కవిత్వం లోబడి వుంటుందన్నది గగనమెక్కిన తారలు అందిస్తున్న వాంగ్మూలం. వనంలో ఏ మొక్క పోయినా వనమాలి హృదయం చివుక్కుమంటుంది. అలాంటిది వనమాలే వెళ్ళిపోతే తనదైన పాఠకులకు వసంతం వాయిదా పడ్డట్టే. ‘కవులు, నదులు ఈ భూగోళపు రక్తనాళాలు’ మహా సముద్రాల్లోకి, మనస్తాపాల్లోకి నిరూపయోగ స్రావం కారాదన్నదే అభిలాష.
(సెప్టెంబర్‌ 10న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా