Caterpillar: గొంగళి పురుగుకి త్రిభుజాకారపు తల ఎందుకంటే!

28 Apr, 2022 14:10 IST|Sakshi

గొంగళిపురుగు సీతాకోక చిలుకలా మారుతుందని తెలుసు కానీ.. పాముగా మారుతుందని మీకు తెలుసా? అవును.. ఈ గొంగళి పురుగు పాములా మారుతుంది. ఇది ఆ ప్రకృతి దానికి ఇచ్చిన వరం. అదేమిటబ్బా అనుకుంటున్నారా? అవును.. ఈ గొంగళి పురుగు కథ చాలా ప్రత్యేకం.

హెమెరోప్లేన్స్‌ ట్రిప్టోలెమస్‌ అనే శాస్త్రీయనామం కలిగిన ఈ పురుగులు.. అమెజాన్‌ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దక్షిణ అమెరికా... ఈక్వెడార్‌లోని ప్యూయోలో ఇవి చెట్లపై పాకుతుంటాయి. మామూలుగా చూస్తే... ఇది సాధారణ గొంగళి పురుగు లాగానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి డిస్టర్బ్‌ చేశామంటే మాత్రం విశ్వరూపం చూపిస్తుంది. ఒక్కసారిగా తన రూపాన్ని మార్చేసుకుంటుంది. ఏ పక్షో వాటిని చూసి.. ‘చిన్న పురుగే కదా’ అనుకుని.. లటుక్కున తీసుకుని, చటుక్కున నోట్లో వేసేసుకోకుండా ఉండేందుకు ఈ మాయాజాలాన్ని ప్రదర్శిస్తాయి ఈ గొంగళి పురుగులు.

తమని తాము రక్షించుకునేందుకు తలను, త్రిభుజాకారపు పాము తలలా మార్చేసుకుంటాయి. అప్పుడు వాటిని తినడానికి వచ్చిన శత్రువులకు అవి పాముల్లా కనిపించి భయపడి పారిపోతాయి. తల గుండ్రంగా ఉండే పాముల్లో విషం తక్కువగా ఉంటుంది. అదే తల త్రిభుజాకారంలో ఉండే పాములకు విషమెక్కువ ఉంటుంది. అందుకే ఈ పురుగుకి త్రిభుజాకారపు తలను వరంగా ఇచ్చి.. ప్రకృతి గొప్ప మేలే చేసింది. మార్పు మంచికే మరి.
 

మరిన్ని వార్తలు