Chaganti Koteswara Rao: మనిషిని నమ్ముతున్నావా...

4 Oct, 2021 08:17 IST|Sakshi

శతకనీతి 

‘‘...అపకారికి నుపకారము నెపమెన్నక...’’.. చేయడం అంటే ఎలాగో... లంకాపట్టణంలో రావణవధ తరువాత సీతమ్మ...  స్వామి హనుమకు వివరిస్తూ... ‘‘జంతువులపాటి మంచితనం అయినా మనుషులకు ఉండాలి కదా! దీనికి నీకు ఒక కథ చెబుతా విను...’’ అంది. ‘‘ఒకానొకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక వేటగాడు తీవ్రగా గాలిస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ పెద్దపులి ఎదురయింది.. ఆకలిమీద ఉన్నట్లుంది. అది మీద పడేలోగా ప్రాణభయంతో పరుగు లంఘించుకున్నాడు. అది తరుముకొస్తున్నది. దారిలో ఓ పెద్ద చెట్టొకటి కనిపిస్తే... గబగబా ఎక్కేసాడు... దానికి అందకుండా ఉండాలని అన్ని కొమ్మలు దాటుకుంటూ పైకి ఎక్కుతూ పోతున్నాడు.

వెనక తరుముకుంటూ వచ్చిన పులి చెట్టుకింద తిష్టవేసింది. ఎప్పటికయినా దిగకపోతాడా... అని కింద కాపుకాసింది. మరో రెండు కొమ్మలు దాటితే చిటారు కొమ్మ ను అందుకోవచ్చని రొప్పుతూ పోతున్న వేటగాడికి పైకొమ్మను పట్టుకునేంతలో అక్కడ గుబుర్లలో ఒక భల్లూకం (ఎలుగుబంటి) కూర్చుని ఉంది. కింద చూస్తే పులి చూపు అతని మీదే ఉంది. ముందు చూస్తే వేటగాడికి సమీపంలో భల్లూకం. చావు ఖాయం అనుకుని గుండె దిటవు చేసుకున్నాడు. ఊపిరి బిగపట్టుకుని చావుకోసం చూస్తున్నాడు.

ఈలోగా పెద్దపులి ఎలుగుబంటితో...‘‘ వీడు వేటగాడు. నన్ను చూసి పారిపోతూ ఈ చెట్టెక్కాడు. నేను వెళ్ళిపోతే నిన్ను చంపేస్తాడు. అందుకని వీడిని నమ్మకు. వాడిని కిందకు తోసెయ్‌. తినేస్తా. నిన్ను వదిలిపెట్టేస్తా....’’ అంది. దానికి ఎలుగుబంటి...‘‘ఈ మనిషి తెలిసో తెలియకో నేనున్న చెట్టుమీదికి వచ్చాడు. అంటే... నా ఇంటికొచ్చిన అతిథితో సమానం. వాడిని నేను కాపాడాలి. వాడిని కిందకు తోసేసి నీకు ఆహారంగా అందించలేను’’ అని చెప్పేసింది.

‘‘నీవు మనిషివి నమ్మావు కదా...అది నీకే తెలిసొస్తుందిలే..’’ అని పెద్దపులి చెప్పింది. కానీ కదలకుండా అక్కడే కూర్చుంది. ఈలోగా వేటగాడికి అలసటవచ్చి నిద్రపోయాడు. అది కూడా అతనిని ఏమీ చేయలేదు. కాసేపటికి నిద్ర లేచాడు.. ఈలోగా భల్లూకానికి నిద్ర వచ్చి..  నిద్రపోతున్నది. పెద్దపులి వేటగాడితో ...‘‘ఆ భల్లూకం నిద్ర లేస్తుంది. ఆకలితో ఉంటుంది. నేను చంపేస్తానని దిగదు. నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి నిన్ను తినేస్తుంది. దాన్ని కిందకు తోసెయ్‌. నేను తినేస్తా.. నా ఆకలి తీరిపోతుంది కాబట్టి నేను నీ జోలికి రాను...’’ అంటుండగానే వేటగాడు క్షణం ఆలస్యం చేయకుండా భల్లూకాన్ని కిందకు తోసేసాడు.

అదృష్టంకొద్దీ అది కిందకు పడేసమయంలో తేరుకుని మధ్యలో ఒక కొమ్మ అందితే దాన్ని పట్టుకుని పైకి ఎక్కేసింది. వెంటనే పెద్దపులి అంది..‘‘నేను ముందే చెప్పా. వాడిని నమ్మొద్దు అని... ఇప్పటికయినా తెలుసుకున్నావు కదా.. వెంటనే తోసెయ్‌ వాడిని..’’ అన్నది. ‘‘వాడు నాకు అపకారం చేసి ఉండొచ్చు. వాడు నా అతిథి. వాడికి అపకారం చేయను. కిందకు తోయను..’’ అన్నది భల్లూకం. చేసేదిలేక పెద్దపులి వెళ్లిపోయింది. ఎలుగుబంటి కూడా అతనిని వదిలేసింది. వేటగాడు కిందకు దిగి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు....’’ ...‘‘చూసావా హనుమా ! అడవిలో ఉండే జంతువులపాలిటి వివేకం కూడా మనం చూపకపోతే ఎలా...అందువల్ల ఆ రాక్షస స్త్రీలను చంపవద్దు. వారి జోలికి పోకు...’’ అంది... అది బద్దెనగారు సుమతీ శతకం ద్వారా మనకు చెప్పిన శీల వైభవం. 

మరిన్ని వార్తలు