రాత్రి చేసిన పోస్ట్‌కు విపరీతంగా లైక్స్‌.. ఫాలోవర్స్‌ అమాంతం పెరిగారు.. అసలు సంగతి తెలిసి! మీరూ జాగ్రత్త..

6 Apr, 2023 16:07 IST|Sakshi

How To Get More Social Media Followers: సౌజన్య (పేరుమార్చడమైనది) సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటుంది. రాత్రి తను చేసిన పోస్ట్‌కు ఉదయం విపరీతంగా లైక్స్‌ రావడం, ఫాలోవర్స్‌ పెరగడం చూసి తెగ సంతోషించింది. ఒకట్రెండు రోజులు సజావుగా సాగినా ఆ తర్వాత నుంచి ప్రచార వస్తువుల గురించి ప్రకటనలు పెరిగాయి. తన చేసిన పోస్ట్‌లకు చెడుగా కామెంట్స్‌ పెడుతున్నారు. దీని వల్ల తన పేరు దెబ్బతింటుందనే ఆందోళన ఆమెను విపరీతమైన టెన్షన్‌కు గురిచేసింది.

సోషల్‌ మీడియా సొసైటీలో ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్‌ను బట్టి విలువకట్టే రోజులు ఇవి. సినిమా స్టార్స్‌తోపాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సేవల గురించే కాదు, వస్తువుల బ్రాండ్‌లతో వినియోగదారులను ఆకట్టు కుంటుంటారు.

అయితే, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లను నిర్వహించే వ్యాపారాల దృష్టిని ఆకర్షించడానికి స్టార్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఫాలోవర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇది ఒక పోటీలా మారుతుంటుంది. దీనిని గుర్తించిన నకిలీ ఫాలోవర్స్‌ అధికసంఖ్యలో పుట్టుకొస్తుంటారు. తమ మోసాలకు కొత్త తెర తీస్తుంటారు. దీనివల్ల ఆదాయ మార్గాలకు గండికొట్టడం, పేరు ప్రతి ష్టలు దెబ్బతీయడం వంటివి జరుగుతుంటాయి. 

నిజమైన ఫాలోవర్స్‌ను ఎలా పొందాలంటే.. 
►ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టించాలి. మీ కంటెంట్‌ ప్రేక్షకులకు సమాచారంగా, వినోదాత్మకంగా, చూడటానికి ఆకర్షణీయంగా ఉండాలి. క్వాలిటీ ఫొటోలు, వీడియోలు వాడాలి.  ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. ∙
►క్రమం తప్పకుండా పోస్ట్‌ చేయడం వల్ల మీ ప్రేక్షకులు మీ కంటెంట్‌పై ఆసక్తిని కలిగి ఉంటారు.
►వ్యాఖ్యలు, సందేశాలకు ప్రతిస్పందించడం, అభిప్రాయాలను అడగడం, సంభాషణలను ప్రారంభించడం ద్వారా వీక్షకులతో సన్నిహితంగా ఉండాలి. ఇది ఫాలోవర్స్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.
►పోటీలు, బహుమానాలను ప్రకటించడం వల్ల కొత్త ఫాలోవర్లు పెరుగుతారు. మీ ఫాలోవర్లకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించవచ్చు.
►మీ వెబ్‌సైట్, ఇతర సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను ప్రచారం చేసేలా ఉండాలి. దీనివల్ల చూసేవారి సంఖ్య పెరగడంతోపాటు కొత్త ఫాలోవర్లను ఆకర్షించడానికి సహాయపడుతుంది. 

నకిలీ ఫాలోవర్లు ఏం చేస్తారంటే.. 
►కృత్రిమంగా ఫాలోవర్లను పెంచే ప్రయత్నంలో సోషల్‌ మీడియా ఖాతాలను ఫాలో అవడానికి అటోమేటెడ్‌ అకౌంట్స్‌ను రూపొందిస్తారు.
►ఫాలోవర్‌ కౌంట్, లైక్స్, కామెంట్స్‌ మళ్లించేందుకు వాస్తవంగా కంటే ఎక్కువ జనాదరణ లేదా ప్రభావవంతమైనదిగా కనిపించేలా చేయడానికి అకౌంట్లు సృష్టించబడతాయి. వీటిని థర్డ్‌పార్టీ ప్రొవైడర్ల నుంచి కొనుగోలు చేయచ్చు.
►లేదా నకిలీ ఖాతాలను సృష్టించే ప్రక్రియను ఆటోమేట్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ సాధనాలను ఉపయోగించి సృష్టించవచ్చు. ∙
►నకిలీ ఫాలోవర్లు అనైతికంగా ప్రవర్తిస్తారు.
►భవిష్యత్తులో మీ బ్రాండ్‌నేమ్‌ని దెబ్బతీస్తారు.
►వినియోగదారులు నిజమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండేలా ఫేక్‌ అకౌంట్స్‌ను క్రమం తప్పకుండా తొలగించాలి. 

నకిలీ అకౌంట్స్‌ను గుర్తింవచ్చు..
►సోషల్‌ మీడియా పాలోవర్లను గుర్తించడం సవాల్‌గా ఉంటుంది. అయితే, నిజమైన వినియోగదారుల నుండి వీరిని వేరు చేయడంలో సహాయపడే కొన్ని సూచికలు... 
►నకిలీ ఖాతాలో  ప్రొఫైల్‌ సమాచారం ఉండదు. ప్రొఫైల్‌ ఫొటో సరైనది ఉండదు. బయో, లొకేషన్‌ వంటి అసంపూర్ణమైన లేదా ఖాళీ ప్రొఫైల్‌ ఉంటుంది. 
►వీరి ఖాతాలో అతి సాధారణ కంటెంట్‌ ఉంటుంది. పోస్ట్‌కు ప్రతిస్పందనగా ఎమోజీలు ఉంటాయి. లేదా సంబంధం లేని వెబ్‌సైట్‌ లింక్‌లతో స్పామ్‌ కామెంట్స్‌ వదిలేయవచ్చు.
►వీరి ఖాతాలకు చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. కానీ, వీరు పెద్ద సంఖ్యలో ఇతర ఖాతాలను ఫాలో చేస్తుంటారు.
►ఇతరులతో ఎలాంటి ఇంటరాక్షన్‌ ఉండదు. కంటెంట్‌ను షేర్‌ చేయడం లేదా ఇతర యూజర్స్‌కి మెసేజ్‌లు, పోస్ట్‌లు.. అప్‌లోడ్‌ చేయడం నకిలీ అకౌంట్స్‌ వారు చేయరు. 
►ఫాలోవర్‌ కౌంట్‌లో ఆకస్మిక పెరుగుదల ఉంటే అనుమానించాలి.

నకిలీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు...
►ఇతరులను కించపరిచేలా ప్రతికూల కథనాలను, సమీక్షలు రాస్తారు. 
►వారి వ్యూవర్‌షిప్‌ను పెంచడానికి మోసపూరిత ఫొటోలను పోస్ట్‌ చేస్తారు. 
►నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేస్తూ, అవి తమకు తాముగా ప్రయోజనం పొందేలా చూస్తారు. 

నకిలీ ఖాతాల గురించి రిపోర్ట్‌ చేయడానికి...
►మీ డేటాను యాక్సెస్‌ చేయకుండా అకౌంట్‌ను బ్లాక్‌ చేయవచ్చు. 
►లేదంటే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నివేదించవచ్చు.
https://www.facebook.com/help/306643639690823 
https://help.twitter.com/en/rules-and-policies/platform-manipulation 
https://www.linkedin.com/help/linkedin/answer/a1338436/report-fake-profiles?lang=en
https://help.instagram.com/446663175382270
- ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

మరిన్ని వార్తలు