మునగను పొడి చేసి అమ్ముతూ.. లాభాలు గడిస్తు‍న్న దీపిక!

22 May, 2022 05:27 IST|Sakshi

తల్లిదండ్రులు చెప్పేమాటలను పెడ చెవిన పెట్టే వారు కొందరైతే, తమ పేరెంట్స్‌ పడుతోన్న కష్టాలు, వారి ఆలోచనలను మనసుపెట్టి అర్థం చేసుకుని గౌరవించేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే దీపిక రవి. ఓ రైతు కడుపున పుట్టిన దీపిక రైతుల కష్టాలను చాలా దగ్గర నుంచి చూసింది.

సామాన్య రైతు ఏం కోరుకుంటాడో తన తండ్రి మాటల ద్వారా తెలుసుకుని ఏకంగా ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఈ స్టార్టప్‌ ద్వారా మునగ ఆకు, ములక్కాడలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, బ్యూటీ ప్రోడక్ట్స్‌ తయారు చేసి విక్రయిస్తూ, తనతోపాటు రైతులకు ఉపాధి కల్పిస్తోంది.

తమిళనాడులోని కరూర్‌ జిల్లా కరూర్‌ గ్రామంలో పుట్టిపెరిగింది 26 ఏళ్ల దీపిక రవి. చదువురీత్యా పట్నం వెళ్లినప్పటికి సెలవుల్లో గ్రామంలో ఉన్న ఇంటికి తప్పకుండా వచ్చేది. తండ్రితోపాటు పొలాల్లో తిరుగుతూ వ్యవసాయం ఎలా చేస్తారు, రైతులు ఎదుర్కొనే సమస్యలు, పంట.. పొలం నుంచి మార్కెట్‌కు చేరేనాటికి రైతుకు ఏ మాత్రం లాభం వస్తుందో తండ్రి మాటల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకునేది.

ఎండనకా వాననకా శ్రమటోడ్చి కష్టపడితే దళారులకు తప్ప రైతులకు మిగిలేది ఏమిలేదని అర్థమైంది దీపికకు. అంతేగాకుండా పంటలన్నీ రసాయన ఎరువులతో పండించడం వల్ల, స్వచ్ఛమైన ఆహారానికి బదులు రసాయనాలు తినాల్సి వస్తోందని గ్రహించింది. అప్పటినుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి, వాటిని లాభసాటిగా మార్కెట్‌లో ఎలా విక్రయించాలో పరిశోధించడం మొదలు పెట్టింది.  
 
సూపర్‌ ఫుడ్‌ మొరింగా... ఒక పక్క లాభసాటి పంటల గురించి ఆలోచిస్తూనే ఎమ్‌ఎస్సీ పూర్తిచేసిన దీపిక తన పరిశోధనలో... ‘‘మునగ (మొరింగా)లో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధి గా ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమని తన అవ్వతాతల మాటలు, కొన్ని శాస్త్రీయ ఆధారాల ద్వారా తెలుసుకుంది. ఇదే సమయంలో తన పొలంతోపాటు, చుట్టుపక్కల పొలాల్లో పండిస్తోన్న మునగ పంటకు సరైన ధర లేకపోవడంవల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడాన్ని చూసింది. వెంటనే మునగను పొడి చేసి అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో 2017లో మునగాకుతో రెండు రకాల పొడులు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది.
 
ది గుడ్‌ లీఫ్‌... రెండు ఉత్పత్తులకు మంచి స్పందన లభించడంతో మరుసటి ఏడాది తండ్రి రవి వేలుసామితో కలిసి ‘ద గుడ్‌ లీఫ్‌’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. గ్రామంలోని చుట్టుపక్కల రైతులతో సేంద్రియ పద్దతిలో మునగను పండించి, వారి దగ్గరే మునగ ఆకు, మునక్కాడలను కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఈ రెండింటితో రైస్‌మిక్స్, చట్నీ పొడి, ములగ టీ, ములగ క్యాప్యూల్స్, ములగ ఫేస్‌ప్యాక్స్, ఫేస్‌ స్క్రబ్స్, సబ్బులు, చర్మసంరక్షణ ఉత్పత్తులేగాక, ములగ హెయిర్‌ ఆయిల్, హెయిర్‌సిరమ్‌ వంటివాటిని కూడా తయారు చేసి విక్రయిస్తోంది.

దీపిక తల్లిదండ్రులతోపాటు మరో పదిమంది ఉద్యోగులు స్టార్టప్‌లో పనిచేస్తున్నారు. ఒక్క కరూర్‌లోనే గాక దిండిగల్, తేని వేలూర్‌ వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోని 200కుపైగా రైతుల నుంచి ములగ పంటను సేకరించి, రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తోంది.

సేంద్రియ పద్ధతిలో పండిన మునగతో ఉత్పత్తులు తయారు చేయడం వల్ల గుడ్‌ లీఫ్‌కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు దీపిక ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. గుడ్‌ లీఫ్‌ ద్వారా తన తండ్రితోపాటు ఇతర రైతుల జీవితాల్లో లాభాలు పండిస్తూ,  నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది దీపిక.               

‘‘ఇప్పుడున్న తీరికలేని జీవన శైలిలో పోషకాహారం తీసుకోవడం కష్టం. అందువల్ల మేము అందించే ఉత్పత్తులు కస్టమర్ల శ్రమను తగ్గించి ఆరోగ్యాన్నీ పెంపొందించేవిగా ఉండడంతో మా ప్రోడక్ట్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొ చ్చేందుకు కృషిచేస్తున్నాను’’.

– దీపిక రవి

మరిన్ని వార్తలు