కలుద్దామా డార్లింగ్‌.. కానీ తేరుకునేలోపు కటకటాల్లో

4 Aug, 2021 00:00 IST|Sakshi

అతడో రేపిస్ట్‌. అమాయకురాలిని మోసం చేసి గర్భవతిని చేశాడు. మూడు రోజుల క్రితం ఆ సంగతి హాస్పిటల్‌ వర్గాల నుంచి ఢిల్లీ మహిళా పోలీస్‌ సెల్‌కు అందింది. అక్కడ ఎస్‌.ఐ ప్రియాంక సయాని. అతణ్ణి పట్టుకోవాలి. ‘ఆకాశ్‌’ అన్న పేరు తప్ప వేరే ఏ వివరాలు తెలియవు. ఆమె ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. ‘ఆకాశ్‌’ అనే పేరున్న ఢిల్లీ కుర్రాళ్లందరికీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్స్‌ పంపింది. తర్వాత? నేరం చేసి తప్పించుకుందాం అనుకునేవారికి ప్రియాంక వంటి ఆఫీసర్ల నుంచి ఇలాంటి మెసేజే వస్తుంది... ‘కలుద్దామా డార్లింగ్‌’...

జూలై 30– 2021.
ఢిల్లీలోని ఒక హాస్పిటల్‌ నుంచి ద్వారకాలోని మహిళా సెల్‌కి ఫోన్‌ వచ్చింది. అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్‌.ఐ. ప్రియాంక సయాని ఆ కాల్‌ అటెండ్‌ చేసింది. అవతల డాక్టర్‌ ఆమెతో మాట్లాడాడు. ‘మా దగ్గర ఒక మైనర్‌ అమ్మాయి వచ్చింది. ఆమె మీద లైంగిక దాడి జరిగింది. ఎన్నాళ్లుగా జరుగుతున్నదో తెలియదు. ఆమె ప్రస్తుతం గర్భవతి’ అని డాక్టర్‌ చెప్పాడు. వెంటనే ప్రియాంక సయాని హాస్పిటల్‌కు వెళ్లింది. బాధితురాలితో మాట్లాడింది. బాధితురాలు అమాయకురాలు అని తెలుస్తోంది. ‘ఎవరు?’ అని  అడిగితే ‘ఆకాశ్‌’ అని చెప్పింది. ఎక్కడ ఉంటాడు అంటే ఆమెకు తెలియదు. ఏం చేస్తుంటాడు అంటే గాజుల బిజినెస్‌ అని అంది. అతని ఫొటో కూడా ఆ అమ్మాయి దగ్గర లేదు. ఢిల్లీ అంటే మహా నగరం.ఇంత పెద్ద నగరంలో ఇంత దుర్మార్గాన్ని చేసిన వాణ్ణి ఎలా పట్టుకోవడం? కాని పట్టుకోవాలి అని ప్రియాంక నిశ్చయించుకుని ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసింది.

ఆ రోజు రాత్రే తన ఫొటోతోనే, సాధారణ బట్టల్లో ఉన్న ఫొటో పెట్టి, ఒక దొంగ పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసింది ప్రియాంక. ఢిల్లీలో నివసిస్తున్న ఆకాశ్‌ అనే పేరున్న ఫేస్‌బుక్‌ ఐడిలకు రాండమ్‌గా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టడం మొదలెట్టింది. కొంత మంది యాక్సెప్ట్‌ చేశారు. కొంతమంది రిజెక్ట్‌ చేశారు. ఆ నిందితుడు ఆకాశ్‌ అనేవాడు రిజెక్ట్‌ చేసినవారిలో ఉండొచ్చు... లేదా యాక్సెప్ట్‌ చేసినవారిలో ఉండొచ్చు. అంతా లాటరీ. 

తన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఓకె చేసిన ఆకాశ్‌లకు మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించింది ప్రియాంక. హాయ్‌... ఎలా ఉన్నావ్‌... ఫ్రీనా... ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కడు మాత్రం రియాక్ట్‌ అయ్యాడు. హాయ్‌ అని రిప్లై పెట్టాడు. వీడేనా వాడు అని ప్రియాంక అనుకుంది. నెక్ట్స్‌ అంకానికి తెర తీసింది. మెల్లగా మాటలు మొదలెట్టింది. ఏం చేస్తుంటావు... అని అడిగితే గాజుల డిజైనర్‌ అని చెప్పాడు. తను మెచ్చుకుంది. నీ ఫొటో కావాలి అని మెసెంజర్‌లోనే తెప్పించుకుంది. వెంటనే దానిని రేప్‌ విక్టిమ్‌కి చూపితే ఇతనే అని చెప్పిందా అమ్మాయి. ఇక పట్టుకోవాలి.

ప్రియాంక ఇప్పుడు అతనితో పీకల్లోతు ప్రేమలో దిగిపోయానని చెప్పింది. మనం వెంటనే కలవాలి అని కూడా చెప్పింది. అంతా చేసి అప్పటికి రెండు రోజులే అయ్యింది నాటకం మొదలయ్యి. అతను కూడా హుషారుగా స్పందించాడు. నంబర్‌ ఇవ్వు అన్నాడు. తన నంబర్‌ ఇచ్చాడు. వీడియో చాటింగ్‌ చేద్దాం అన్నాడు. ప్రియాంక వీడియో కాల్‌ చేసి తీపి కబుర్లు చెప్పింది. ‘మనం కలవాలి డార్లింగ్‌’ అంది. ఎక్కడ కలుద్దామో నువ్వే చెప్పు అంది. వీడియో కాల్‌ కూడా మాట్లాడటంతో అతడికి నమ్మకం కుదిరింది. మొదట మెట్రో స్టేషన్‌లో అన్నాడు. కాని చివరి నిమిషంలో కేన్సిల్‌ చేశాడు. మిస్సయిపోయాడని ప్రియాంక అనుకుంది. కాని మళ్లీ అతడే శ్రీమాతా మందిర్‌లో కలుద్దాం అన్నాడు. ప్రియాంక చక్కగా తయారై అక్కడకు వెళ్లింది. తోడు మఫ్టీలో ఉన్న పోలీసులు. అతడు ఏదో ఊహించుకుని వచ్చాడు. కానీ తేరుకునేలోపు కటకటాల్లో ఉన్నాడు.

ప్రియాంక తెలివిని ద్వారకా డీసీపీ సంతోష్‌ కుమార్‌ అభినందించాడు. కేవలం రెండు రోజుల్లో ఆమె అతణ్ణి పట్టుకున్నందుకు మీడియాకు సమాచారం అందించి స్త్రీలకు అన్యాయం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఢిల్లీలో స్టార్‌ పోలీస్‌ ప్రియాంక.

మరిన్ని వార్తలు