బాలింతగా ఉన్నప్పుడు అలా చేయొచ్చా? సలహా ఇవ్వండి..

7 Nov, 2021 11:39 IST|Sakshi

నేను నెల్లాళ్ల కిందట ‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నాను. ఇటీవలే డెలివరీ అయి, పాప పుట్టింది. బాలింతగా ఉన్నప్పుడు వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వివరించగలరు.
–శ్రావ్య, నకిరేకల్‌

బాలింతలు ఎప్పుడైనా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు కాని, రెండో డోసు కాని తీసుకోవచ్చు. అందరిలో లాగానే కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత బాలింతల్లో కూడా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలిగా ఉన్నట్లు ఉండటం, ఇంజెక్షన్‌ ఇచ్చిన దగ్గర కొద్దిగా నొప్పి, వాపు వంటి చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. అలా ఉంటే లక్షణాలను బట్టి పారాసెటిమాల్‌ మాత్రలు రోజుకు రెండు మూడుసార్లు వేసుకోవచ్చు. ఆ సమయంలో బిడ్డకు మామూలుగానే తల్లిపాలు పట్టించవచ్చు. అంతకంటే పెద్దగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. తల్లి వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఏర్పడే యాంటీబాడీస్‌ తల్లి పాల ద్వారా బిడ్డకు చేరి, బిడ్డకు కరోనా వ్యాధి రాకుండా కాపాడతాయి. కాబట్టి వేరే భయాలేవీ పెట్టుకోకుండా కోవిషీల్డ్‌ రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.

నా వయసు 23 ఏళ్లు, ఎత్తు 5.2, బరువు 49 కిలోలు. ఏడాది కిందట పెళ్లయింది. ఇప్పుడు నాకు మూడో నెల. ఏ కాస్త తిన్నా వెంటనే వాంతులు అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో ఇదంతా మామూలేనని చెబుతున్నారు. తిన్న ఆహారమేదీ కడుపులో ఇమడకుండా ఉంటే కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– కీర్తి, ఏలూరు

గర్భందాల్చిన తర్వాత చాలామందికి మొదటి మూడు నెలల్లో పెరిగే పిండం నుంచి విడుదలయ్యే హెచ్‌సీజీ హార్మోన్‌ మోతాదును బట్టి, దాని ప్రభావం వల్ల వికారం, నీరసం, వాంతులు వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. చాలామంది తింటే ఎలాగూ వాంతి అయిపోతుందని తినడానికే భయపడతారు. తినకపోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి ఏర్పడి ఇంకా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వాంతులు అయినా ఫర్వాలేదు అనుకుని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండాలి. 

అందులో కొద్దిగా అయినా ఆహారం పొట్టలోకి చేరుకుంటుంది. ఆహారంలో భాగంగా ఎక్కువగా కొబ్బరినీళ్లు, ఎలక్ట్రాల్, గ్లూకోన్‌–డి, మజ్జిగ, పెరుగు లస్సీ, పండ్లరసాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. ఆహారంలో నూనెవస్తువులు, పచ్చళ్లు, కారాలు, మసాలాలు, కాఫీ, టీ, కూల్‌డ్రింకులు వంటివి తీసుకోకపోవడం మంచిది. గైనకాలజిస్టును సంప్రదించి, వాంతులు తగ్గడానికి డాక్సినేట్, ఓన్‌డన్‌సెట్రాన్‌ వంటి మందులను తగిన మోతాదులో వాడుకోవడం వల్ల వాంతులు అదుపులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాంతులు ఎక్కువ అయిపోయి మరీ నీరసంగా ఉంటే, అవసరాన్ని బట్టి గ్లూకోజ్‌ సెలైన్లు పెట్టించుకోవాల్సి రావచ్చు. చాలావరకు మొదటి మూడునెలల్లో ఎక్కువ వాంతుల వల్ల బిడ్డ పెరుగుదలకు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కాబట్టి మీరు కంగారు పడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, గైనకాలజిస్టును సంప్రదించి తగిన మందులు తీసుకోవడం మంచిది.

- డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌ 

చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి..

మరిన్ని వార్తలు