రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్‌ఐవీ ఫిజీషియన్‌ ఆయన!

21 Oct, 2023 14:28 IST|Sakshi

వైద్యులు రోగులకు వైద్యం చేస్తారు. పేషెంట్‌ వ్యాధిని అంచనా వేసి, పరీక్షలతో నిర్ధారణకు వచ్చి, సిలబస్‌లో చదివిన సమాధానాలతో వైద్యం చేస్తారు. మరి... అప్పటివరకు లేని కొత్త రోగం వస్తే? చికిత్స కోసం అప్పటికే చదివిన సిలబస్‌లో సమాధానం ఎలా వెతకాలి? వైద్యవిద్యలో చెప్పని పాఠాల కోసం అన్వేషణ ఎలా మొదలు పెట్టాలి? అందుకే... ‘పేషెంట్‌లు, పరిశోధనలే నా గురువులు’ అన్నారు డాక్టర్‌ మురళీకృష్ణ. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... నిర్ధారిత ప్రయోగాలు, నిరూపిత సమీకరణలతో వైద్యం చేయడానికే పరిమితం కాకూడదు. రోగికి అవసరమైన కొత్త సమీకరణాలను వైద్యులు సృష్టించగలగాలన్నారు. బ్రాండ్స్‌ ఇంపాక్ట్‌ సంస్థ విశేషంగా వైద్యసేవలందించిన వైద్యులను ఇటీవల న్యూఢిల్లీలో గౌరవించింది. పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ ‘హెల్త్‌ కేర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2023’ పురస్కారం అందుకున్నారు తెలుగు డాక్టర్‌ మురళీకృష్ణ.

మైక్రో బయాలజీ నడిపించింది!
‘‘మాది అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, రామచంద్రాపురం. కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్, అదే కాలేజ్‌లో ఎం.డీ (మైక్రో బయాలజీ) కూడా చేసి, సాంక్రమిక వ్యాధుల నిపుణుడిగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. మైక్రో బయాలజీలో చేరడం ఇష్టంతో కాదని చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడను. సీటు వచ్చిన కోర్సుతో రాజీపడిపోయాను. కానీ కోర్సు మొదలైన తర్వాత ఏర్పడిన ఆసక్తిని మాటల్లో వర్ణించలేను. నేరుగా వైద్యం చేయడం కంటే వైద్యరంగానికి అవసరమైన తెర వెనుక కృషి చాలా సంతృప్తినిచ్చింది. గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్థులకు పరీక్షల కోసం సేకరించిన రక్త నమూనాలను తీసుకుని ఎయిడ్స్‌ వైరస్‌ గురించి ప్రభుత్వం చాలా గోప్యంగా పరీక్షలు నిర్వహించేది.

మనదేశంలో వెయ్యిలో 15 మందిలో ఎయిడ్స్‌ వైరస్‌ ఉన్నట్లు, అది దక్షిణాది ఆఫ్రికా దేశాల నుంచి మనదేశంలోకి వస్తున్నట్లు తెలుసుకున్నాం. దేశంలో ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్న సమాచారమంతటినీ సేకరించాను. అన్ని సంస్థల దగ్గరున్న సమాచారం కంటే ఎక్కువ డాటా నా దగ్గరుంది. అప్పట్లో మనదగ్గర ఎయిడ్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌లు లేరు. అనుబంధ సమస్యలకు వైద్యం చేసే నిపుణులే హెచ్‌ఐవీకి కూడా మందులిచ్చేవారు. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్‌ఐవీ ఫిజీషియన్‌ని నేనే. 

వారానికి ఇద్దరు పేషెంట్‌లు!
సొంతక్ట్రీస్‌ మొదలుపెట్టింది 2000లో. మొదట్లో వారానికి ఇద్దరు లేదా ముగ్గురు పేషెంట్‌లు వచ్చేవారు. దాంతో నా సమయాన్ని ఎయిడ్స్‌ అధ్యయనానికి ఉపయోగించాను. ప్రముఖ పరిశోధకులందరూ శాస్త్రం ఆధారంగా ఎయిడ్స్‌కు వైద్య శోధన మొదలు పెట్టారు. నా అధ్యయనం, పరిశోధనలను పేషెంట్‌ వైపు నుంచి మొదలు పెట్టాను. ఎయిడ్స్‌కి మాంటూక్స్‌ టెస్ట్‌ అలాంటిదే. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి టీబీ సోకడం సర్వసాధారణంగా జరిగేది. ఎయిడ్స్‌ మరణాల్లో ఎక్కువ టీబీ మరణాలే ఉండేవి. ‘13వ ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ కాన్ఫరెన్స్‌’ సౌత్‌ ఆఫ్రికాలోని దర్బన్‌లో జరిగింది. ఆ సదస్సులో నేను ‘మాంటూక్స్‌ టెస్ట్‌’ ఎయిడ్స్‌ తీవ్రత పట్ల ఒక అంచనాకు రావచ్చని చెప్తూ నా పరిశోధన పత్రాన్ని సమర్పించాను.

అది ఎయిడ్స్‌ చికిత్సలో కొత్త దృక్పథానికి దారి తీసింది. ఎయిడ్స్‌ చికిత్సలో వైద్యం మొదలు పెట్టిన వారం రోజుల నుంచి రికవరీ స్పష్టంగా తెలుస్తుంది. అయితే జీవితకాలం మందులు వాడాల్సిందే. పేషెంట్‌ తిరిగి తన పనులకు వెళ్లగలిగేటట్లు చేయడం నా వైద్యం ఉద్దేశం. ఈ వ్యాధి పేదవాళ్లలోనే ఎక్కువ. వారికి వైద్యం చేయడంలో టెస్ట్‌ల మీద ఆధారపడకుండా వ్యాధి లక్షణాలు, చిహ్నాలను బట్టి తీవ్రతను అంచనా వేసి చికిత్స చేస్తాను. అలాగే రెండంచెల ఔషధాలతో వైద్యం చేయడం కూడా నేను చేసిన మరో ప్రయోగం. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ సింపోజియమ్‌ హెచ్‌ఐవీ ఎమర్జింగ్‌ మెడిసిన్‌ ’ సదస్సులో పేపర్‌ సమర్పించాను. నేను ప్రతిపాదించిన పదేళ్ల తర్వాత 2019 నుంచి ఇప్పుడు అంతర్జాతీయంగా టూ డ్రగ్స్‌ చికిత్సనే అనుసరిస్తున్నారు.

ఎయిడ్స్‌ అవగాహన వ్యాసాలు
హెచ్‌ఐవీ గురించి మన సమాజంలో విపరీతమైన భయం రాజ్యమేలుతున్న రోజులవి. ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం నగరాలు, పట్టణాలు, చిన్న కాలనీలు, గ్రామాల్లో ఐదు వందలకు పైగా సమావేశాల్లో ప్రసంగించాను. వయోజనుల్లో అవగాహన కోసం ‘అక్షర గోదావరి’ పేరుతో క్లుప్తంగా, సరళంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రాశాను. మొదట మా జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఆప్రాజెక్టును తర్వాత అన్ని జిల్లాలకూ విస్తరించారు.

ఆశ వర్కర్స్, రీసోర్స్‌ పర్సన్‌కి ప్రామాణిక గ్రంథంగా నా రచననే తీసుకున్నారు. హెచ్‌ఐవీ గురించిన అవగాహన వ్యాసాలతో ‘ఎయిడ్స్‌’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకం పునర్ముద్రణలతో పదేళ్లలో ఎనిమిది వేల కాపీలు అమ్ముడవుతుందని నేను కూడా ఊహించలేదు. ఎంబీబీఎస్‌లో కాలేజ్‌ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా పని చేసిన అనుభవమే ఇప్పటికీ నా అధ్యయనాలన్నింటినీ అక్షరబద్ధం చేయిస్తోంది.

కోవిడ్‌కి ఇంట్లోనే వైద్యం
కోవిడ్‌ వైద్యరంగానికి పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. ఒక వ్యాధికి మందులు రావాలంటే దశాబ్దాల పరిశోధన తర్వాత మాత్రమే సాధ్యం. కొత్త వ్యాధి, పైగా ఒక్కసారిగా విజృంభించినప్పుడు రోగులందరికీ ఒకేసారి నాణ్యమైన వైద్యం అందించడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యాధి విస్తరించినంత వేగంగా ప్రత్యామ్నాయాల అన్వేషణ కూడా జరగాలన్న ఆలోచనతో సులభంగా, చవగ్గా దొరికే మందులతో హోమ్‌కేర్‌ కిట్‌ రూపొందించాను. కోవిడ్‌ మీద అవగాహన కోసం వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో ΄పోస్ట్‌ చేశాను. ఒక్కో పోస్ట్‌ వేలసార్లు షేర్‌ అయింది. వైద్యం కోసం పేషెంట్‌లు అప్పుల పాలు కాకూడదనేది నా పాలసీ. అందుకోసమే నా తాపత్రయమంతా.

కోవిడ్‌ మీద కూడా అవగాహన పుస్తకం తెచ్చాను. కోవిడ్‌ తర్వాత వస్తున్న సమస్యల మీద అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. నాలుగు ఇంటర్నేషనల్‌ సెమినార్‌లలో పేపర్‌లు ప్రెజెంట్‌ చేశాను. ఇంకా చేస్తాను కూడా. ఒక డాక్టర్‌గా వైద్యరంగం నేర్పించిన జ్ఞానంతో పేషెంట్‌లను ఆరోగ్యవంతులను చేయడానికి కృషి చేయడం అనేది నూటికి తొంబై తొమ్మిది మంది చేసే పని.

నా కృషితో వైద్యరంగానికి తోడ్పాటు అందించడం నా విజయం. మొదట ఆరోగ్యపరంగా నన్ను నేను జయించాను. ఆ తర్వాత జీవితాన్ని జయించాను. మా ఇంట్లో తొలి వైద్యుడిని నేనే. నా పిల్లలిద్దరిలో ఎవరూ వైద్యరంగం పట్ల ఆసక్తి చూపకపోవడమే మనసుకు బాధ కలిగించే విషయం’’ అన్నారు ప్రజారోగ్య పరిరక్షణలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్‌ మురళీకృష్ణ.
– డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, ఎం.డి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్‌

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు