వాటర్‌తో వెయిట్‌లాస్‌!

9 Mar, 2021 14:34 IST|Sakshi

ఈరోజుల్లో అధిక బరువుతో బాధపడేవారు అనేకమంది కనిపిస్తున్నారు. మారుతున్న జీవన శైలీతో అడ్జెస్ట్‌ కాలేక అనేక రకాల ఒత్తిడులకు గురవ్వడంతో అధికబరువుకు గురవుతున్నారు. అయితే వేలకు వేలు ఖర్చుచేయకుండా మనం రోజు దాహం తీర్చుకోవడానికి తాగే నీళ్లతో శరీరంలోని కొవ్వు, కేలరీలను కరిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  వాటర్‌ తాగుతూ వెయిట్‌ తగ్గవచ్చని చాలా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

ద్రవరూప ఆహార పదార్థాలు ఎంత తీసుకుంటే ఆరోగ్యం అంత మెరుగుపడుతుంది. అంతేగాక బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఒక సంవత్సరం పాటు కొందరికి కేవలం లిక్విడ్‌ ఫుడ్‌ను అందిస్తూ శాస్త్రవేత్తలు పరిశోధించారు. దానిలో వారు బరువు తగ్గడమేగాక, ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగుపడడంతోపాటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రణలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2011లో ఒబెసిటీ అనే జర్నల్‌ వెలువరించిన ఓ స్టడీ ప్రకారం... అధికంగా నీరు తాగడం వల్ల కేలరీ డైట్‌గా పనిచేసి వెయిట్‌ తగ్గవచ్చట. అంతేగాక అంతర్జాతీయ జర్నల్‌ ఆఫ్‌ ఒబేసిటీలో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం 12 నెలలపాటు డైట్‌గా డ్రింక్స్, పానీయాలను సాధారణ నీళ్లు తాగిన వారిలో బరువు తగ్గడమే కాకుండా వారిలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా మెరుగుపడ్డాయి.

►భోజనానికి ముందు 10–15 నిమిషాల ముందు కడుపునిండా నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన భావనతో ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ తక్కువగా తింటారు. నీళ్లు తాగడంతో అతిగా ఉన్న ఆకలి కాస్త తగ్గి ఎక్కువగా తినము. ఇలా రెగ్యులర్‌గా జరగడం వల్ల మన బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

►అధిక బరువు ఉన్న వారు వేగంగా క్యాలరీలు కరిగించేందుకు తెగ కష్టపడుతుంటారు. అయితే వాటర్‌ తాగడం వల్ల ఎక్కువ కష్టపడకపోయినప్పటీకి కేలరీలు కరుగుతాయి. ఇక మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు, కార్బొహైడ్రేట్స్‌ను కరిగించడంలో నీళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

►శరీరానికి తగినన్ని నీరు అందకపోతే టాక్సిన్‌లు పేరుకుపోతాయి. అధికంగా నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ బయటకి పోతాయి.

►మనకు ఆకలివేసినప్పుడు వెంటనే ఏదోఒకటి తింటుంటాం. కానీ కొన్ని సార్లు దాహం వేసినప్పుడు కూడా ఆకలిగా అనిపిస్తుంది. ఇలా మన బ్రెయిన్‌ మనల్ని కన్ఫ్యూజ్‌ చేసినప్పటికీ ఆ సమయంలో వాటర్‌ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా మన ఆకలిని వాటర్‌ తాగడం ద్వారా నియంత్రించగలిగితే కేలరీలు తగ్గి బరువు తగ్గుతారు.

►నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండరకణాలు బాగా పనిచేస్తాయి. అందువల్ల నీళ్లు ఎక్కువగా తాగుతూ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

►బరువు తగ్గాలనుకునేవారు రోజూ 4–6 లీటర్ల నీటిని తాగితే మంచింది. అయితే వయసు, శరీరాకృతి, ఆరోగ్య స్థితిగతులను బట్టి నీళ్లు తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం నివసించే ప్రాంతం వాతావరణాన్ని బట్టికూడా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వృద్ధులు, గర్భిణీలు ఎంత వాటర్‌ తాగాలో అనేది డాక్టర్ల సలహామేరకు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు