గంగా జమున తెహజీబ్‌ కాపాడుకుందాం!

30 Nov, 2020 00:29 IST|Sakshi

లేఖ

‘‘సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని... ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః’’ అంటే... ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి, తనలో సర్వభూతాలనూ, సమస్త భూతాలలో తననూ దర్శిస్తాడు, అని తాత్పర్యం. ఇదే నిజ హిందూవాదం. ఇదే హైద్రాబాదీయత. అదే నిజ జాతీయత.

మతాలకతీతంగా కవుల సృజనకు జీ హుజూర్‌ అన్నది మన హైద్రాబాదీ గడ్డ. ఈ గడ్డపైన కవ్వాలి శతకాలు కీర్తనలు ఏకరూపంలో వొకే వేదిక మీద వొలికిన స్వరఝరీ భాగ్యనగరి. దక్కనీ ఆత్మకు ఏకాత్మ మన హైద్రాబాద్‌. భాగమతీ కాలి అందెల రవళిలో తన్మయించిన ఈ సజీవ సంస్కృతిని భగ్నం చేయడానికి కుట్రలు నడుస్తున్నయి. గాయాల తెలంగాణ స్వయం పాలనలో కుదురుకుంటున్న సమయాన, నిన్నటిదాకా లేని వో కొత్త సామాజిక సమస్య మత విద్వేషం రూపంలో ముందుకు వస్తున్నది. గంగా జమునల తహజీబ్‌కు కేంద్రమైన హైద్రాబాద్‌ భాగ్యనగరం నడి బొడ్డున, సామరస్యంతో జీవిస్తున్న మనుషుల నడుమ, మత చిచ్చును రగిలించే కుట్రలకు బీజం పడుతున్నట్టుగా అర్థమౌతున్నది. 

ఇటువంటి ప్రమాదకర మత విద్వేషాన్ని కవులు, రచయితలు, కళాకారులు, మొత్తంగా సృజనకారులుగా మనందరం ముక్తకంఠంతో  వ్యతిరేకించవలసి వున్నది. మత సామరస్యాన్ని సారవంత గుణంగా పొదువుకున్న హైదరాబాదీయతను రక్షించుకోవాల్సిన సందర్భం వచ్చింది. హైద్రాబాదీయతే నిజ జాతీయత.  మతం పేరుతో చరిత్రలో లేని విషయాలను ముందుకు తెచ్చి మనలను మందిముందు అవమానాలకు గురిచేస్తున్నరు. అబద్ధపు దుష్ప్రచారాలను తుత్తునియలు చేసి మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా నడుం బిగించవలసివున్నది. 

సంపద్వంతమైన దక్షిణాపథాన్ని కొల్లగొట్టడానికి, ఆక్రమించడానికి హైదరాబాద్‌ అనే పెద్ద గడపను గెలిచి తెలంగాణను తమ మతవాద విస్తరణకు ఎరగావేసే కుట్రలకు ఉత్తరాది శక్తులు కుట్రలు పన్నుతున్నయి. దాన్ని తిప్పికొట్టవలసిన సందర్భం ముంచుకువచ్చింది. ఇటువంటి హైద్రాబాద్‌ వారసత్వాన్ని నిలుపుకోవాల్సిన కష్ట కాలంలో మనం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మన జీవ సంస్కృతిని జీవితకాలం కోల్పోవాల్సిన ప్రమాదంలో పడిపోతాం. అరవయేండ్ల పోరాటాన్నించి, స్వయం పాలనలో సాంత్వన  పొందుతూ ప్రశాంత వాతావరణంలో తనను తాను పునర్నిర్మించుకుంటున్న క్రమంలో, దేశంలో సగర్వంగా తలెత్తుకోని ముందడుగు వేస్తున్నది తెలంగాణ. 

ఈస మూసీల సంగమంలా వెలసిల్లిన అవ్యక్తపు ఆధ్యాత్మిక బోధనాస్థలి, ఆధ్యాత్మిక మడి భాగ్యనగరి హైద్రాబాద్‌ను కాపాడుకుందాం.  ద్వేషంతో కూడిన వాచాలత్వం, అప్రజాస్వామిక నడవడితో కూడిన, ఉత్తరాది దాష్టీకాన్ని ఎదురిద్దాం. మన కవనంతో గానంతో మేథో సృజన రచనలతో యోచనాత్మకమైన దార్శనిక దృక్పథంతో ప్రజలను చైతన్యం పరిచి నాటి ఉద్యమ స్ఫూర్తితో మతవిద్వేష శక్తుల కుట్రలను నిలువరిద్దాం.

ఇట్లు...
– తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, సృజనకారులు
– కవి సిద్దార్థ, అల్లం నారాయణ, కె.శ్రీనివాస్, వర్ధెల్లి మురళి, ఎన్‌.గోపి, కె.శివారెడ్డి, ఓల్గా, నందిని సిధారెడ్డి, గోరటి వెంకన్న, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, షాజాహాన, గోగు శ్యామల, జూపాక సుభధ్ర, మహెజబీన్, కుప్పిలి పద్మ, జ్వలిత, మెర్సీ మార్గరేట్, పెన్నా శివరామకృష్ణ, జిలుకర శ్రీనివాస్, శ్రీనివాస్‌ దెంచనాల, దేశపతి శ్రీనివాస్, మునాస వెంకట్, పసునూరి రవీందర్, కృపాకర్‌ మాదిగ, పగడాల నాగేందర్, యాకూబ్, అక్కినేని కుటుంబరావు, వేణు ఊడుగుల, ఎన్‌.శంకర్, బతుకమ్మ ప్రభాకర్, ఎస్‌.రఘు, ఏలె లక్ష్మణ్, కార్టూనిస్ట్‌ శంకర్, కోయి కోటేశ్వర్‌ రావు, సుద్దాల అశోక్‌ తేజ, స్కైబాబ, మోహన్‌ రుషి, జూలూరి గౌరీశంకర్, వఝల శివకుమార్, అన్నవరం దేవేందర్, నలిమెల భాస్కర్, పిల్లలమర్రి రాములు, నాళేశ్వరం శంకరం, ఒద్దిరాజు ప్రవీణ్, వాసు, కోడూరి విజయ్‌ కుమార్, కాంచనపల్లి, దామెర రాములు, అమ్మంగి వేణుగోపాల్, సీతారామ్, ప్రసేన్, వేముగంటి మురళి, బన్న అయిలయ్య, శిలాలోలిత, సంగిశెట్టి శ్రీనివాస్, బైరెడ్డి కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, మచ్చ దేవేందర్, బెల్లి యాదయ్య, వనపట్ల సుబ్బయ్య, తైదల అంజయ్య, ఆదేశ్‌ రవి, మోత్కూరి శ్రీనివాస్, శిఖామణి, కోట్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎం.ఎస్‌.నాయుడు, తాడి ప్రకాశ్, జివి రత్నాకర్, గుడిపల్లి నిరంజన్, చిక్కా రామదాసు, మామిడి హరికృష్ణ, బంగారి బ్రహ్మం, మౌనశ్రీ మల్లిక్, పుష్పగిరి, రమేశ్‌ హజారి,  ఏనుగు నరసింహారెడ్డి, వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మల్లేపల్లి లక్ష్మయ్య

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు