జయహో ఎవరెస్ట్‌

28 May, 2023 00:23 IST|Sakshi
హిల్లరీ–నార్గె విగ్రహాలు

మే 29, 2023 నాటికి ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్జింగ్‌ నార్గెలు ఎవరెస్ట్‌ అధిరోహించి 70 ఏళ్లు. ఆ సందర్భంగా నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్లిద్దరి బంగారు విగ్రహాలు ప్రతిష్టించారు. అంతేనా? షెర్పాల ఘన ఆరోహణ సంప్రదాయాన్ని నిలబెడుతూ ‘ఎవరెస్ట్‌ మేన్‌’గా ఖ్యాతినెక్కిన ‘కమిరత్న షెర్పా’ మే 23న 28వసారి ఎవరెస్ట్‌ ఎక్కి ఆ మహా పర్వతం ఒడికి తాను  ముద్దుబిడ్డని నిరూపించుకున్నాడు. ఎవరెస్ట్‌– ఒక ధవళ దేవత. ఈ ఆరాధన ఎప్పటికీ వైరలే.

ఎంత బాగుందో ఆ సన్నివేశం
మే 26న, నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో (దీని పేరు టెన్సింగ్‌–హిల్లరీ ఎయిర్‌పోర్ట్‌) ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్జింగ్‌ నార్గె బంగారు విగ్రహాలు ప్రతిష్టిస్తే ఆ కార్యక్రమంలో హిల్లరీ కుమారుడు పీటర్‌ హిల్లరీ, టెన్జింగ్‌ కుమారుడు జామ్లింగ్‌ నార్గె పాల్గొన్నారు. డెబ్బయి ఏళ్ల క్రితం తమ తండ్రులు సృష్టించిన ఘన చరిత్రను వాళ్లు గుర్తు చేసుకోవడం, పొంగిపోవడం అందరినీ ఉద్వేగభరితం చేసింది. ఎవరెస్ట్‌ను నేపాల్‌వైపు ఎక్కాలనుకునేవారు మొదట లుక్లా ఎయిర్‌పోర్ట్‌లోనే దిగుతారు కాబట్టి వారికి స్ఫూర్తినివ్వడానికి, 70 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాలు ఆవిష్కరించారు.

ఇప్పటికి 6 వేల మంది
డెబ్బయి ఏళ్ల క్రితం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హిల్లరీ, నార్గెల జంట ఎవరెస్ట్‌ను అధిరోహించాక అప్పటి నుంచి ఇప్పటి వరకూ హిమాలయన్‌ డేటాబేస్‌ ప్రకారం ఆరు వేల మంది ఎవరెస్ట్‌ అధిరోహించారు. దానికి రెట్టింపు మంది ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వరకూ వెళ్లి వచ్చారు. పర్వతారోహకుల తొలి ఆరోహణ కలగా ఇప్పటికీ ఎవరెస్ట్‌ నిలిచి ఉంది. ఇప్పుడు నేపాల్‌వైపు నుంచి ఎవరెస్ట్‌ అధిరోహించాలంటే 9 లక్షలు పర్మిట్‌ ఫీజు కట్టాలి. ఈ సీజన్‌లో 478 మందికి పర్మిట్‌ ఇచ్చారు. వీరిలో చాలామంది గైడ్‌ను తీసుకెళతారు కాబట్టి రికార్డు స్థాయిలో 900 మంది ఈ సీజన్‌లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తారని భావిస్తున్నారు.

మంచుపులి
హిల్లరీకి దారి చూపేందుకు వచ్చి చరిత్రలో నిలిచిన షెర్పా టెన్జింగ్‌ నార్గెను ‘మంచు పులి’ అని పిలుస్తారు. ఆ షెర్పాల జాతికే చెందిన కమిరత్న షెర్పాను ‘ఎవరెస్ట్‌ మేన్‌’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇతను ఎవరెస్ట్‌ గైడ్‌గా పని చేస్తూ ఇప్పటికి 27సార్లు ఆ శిఖరాగ్రాన్ని ఎక్కి దిగాడు. అందుకని అత్యధికసార్లు ఎవరెస్ట్‌ ఎక్కిన ఘనత ఇతని పేరు మీద ఉంది. అయితే మొన్నటి మే 22న పసాంగ్‌ దవ రత్న అనే మరో షెర్పా 27వసారి ఎవరెస్ట్‌ అధిరోహించి కమిరత్న రికార్డును సమం చేశాడు. ఇది ఏమాత్రం రుచించని కమిరత్న ఆ మరుసటి రోజు ఉదయానికి ఎవరెస్ట్‌ ఎక్కి 28వసార్లు ఎక్కిన ఏకైక వ్యక్తిగా రికార్డు తన పేరు మీదే నిలుపుకున్నాడు. ఈ మే నెలలో కమిరత్న రెండుసార్లు ఎవరెస్ట్‌ ఎక్కాడు. హైదరాబాద్‌ బెజవాడల మధ్య తిరిగినంత సులభంగా ఎవరెస్ట్‌ అధిరోహిస్తున్న ఇతణ్ణి మరో మంచుపులి అనక ఇంకేం అనగలం.

మరిన్ని వార్తలు